గిరిజన విద్యకు ప్రాధాన్యత

24 Feb, 2021 05:11 IST|Sakshi

గిరిజనులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు 

అరకులో ప్రత్యేకంగా క్రీడా పాఠశాల 

త్వరలో అందుబాటులోకి గిరిజన మెడికల్, ఇంజనీరింగ్‌ కాలేజీలు 

విజయనగరం వద్ద గిరిజన యూనివర్సిటీ 

సాక్షి, అమరావతి:  గిరిజనులను నూరు శాతం అక్షరాస్యులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రణాళికను అమలు చేస్తోంది. గిరిజనుల కోసం ఇప్పటికే వివిధ రకాల విద్యాసంస్థల్ని ఏర్పాటు చేసి ప్రాథమిక, ప్రీ మెట్రిక్, పోస్ట్‌ మెట్రిక్‌ వరకు ప్రతి గిరిజన విద్యార్థి విధిగా చదువుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే వివిధ స్థాయిల్లో 2,682 గిరిజన విద్యాలయాలు నడుస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు గిరిజనులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ, పాడేరులో వైఎస్సార్‌ గిరిజన మెడికల్‌ కాలేజీ, విజయనగరం వద్ద గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోంది. గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్మాణాలు పూర్తి కాగానే వాటిలోనూ అడ్మిషన్లు మొదలవుతాయి. ఇప్పటికే గిరిజనుల కోసం అరకులో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాలలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని సౌకర్యాలు కల్పించారు. మంచి ఆట వస్తువులు కొనుగోలు చేసి అనుభవజు్ఞలైన క్రీడా ఉపాధ్యాయుల చేత శిక్షణ ఇప్పిస్తున్నారు. 

ప్రాథమిక దశ నుంచీ ప్రత్యేక శ్రద్ధ 
గిరిజన విద్యార్థులపై ప్రాథమిక దశ నుంచీ ప్రత్యేక శ్రద్ధ వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం వివిధ స్థాయిల్లో గల 2,682 గిరిజన విద్యాలయాల్లో మొత్తం 2,04,588 మంది గిరిజన చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం ఒక్కొక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్యను బట్టి మరో ఉపాధ్యాయుడిని నియమించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రాథమిక విద్య పూర్తి చేసిన వారిని ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో చేర్చుకుంటారు. ప్రాథమిక పాఠశాలలతోపాటు అన్ని స్థాయిల్లోని గిరిజన విద్యాలయాల్లో సకల సౌకర్యాలు కల్పించారు. వారికి పాఠశాలల్లోనే భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. 

మరిన్ని వార్తలు