వైద్య నియామకాలకు స్పెషల్‌ మెడికల్‌ బోర్డు

16 Nov, 2022 03:18 IST|Sakshi

ప్రతిపాదనలు సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ

సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏపీ ఎంస్‌ఆర్‌బీ) ఏర్పాటు చేయనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి మెంబర్‌ సెక్రటరీగా, జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి సభ్యుడిగా బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

సీఎం ఆదేశాల మేరకు 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావుండరాదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్‌ 2019 నుంచి ఏకంగా 46 వేల పోస్టుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. వైద్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2012లో తమిళనాడు మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు ద్వారానే వైద్య శాఖలో నియామకాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం తమిళనాడులో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ఎంఎస్‌ఆర్‌బీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఈ బోర్డు ద్వారానే వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన నియామకాలను చేపట్టనున్నారు. 

కీలక పరిణామం 
ఏపీ ఎంఎస్‌ఆర్‌బీ ఏర్పాటు వైద్య శాఖ చరిత్రలో కీలక పరిణామం కానుంది. ప్రభుత్వ ఆస్పత్రులను వేధిస్తున్న సమస్యల్లో మానవ వనరుల కొరతే ప్రధానం. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరిగిన జనాభా, రోగుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిని సమకూర్చడం,  మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులంటే నరకానికి చిరునామాగా 2019 ముందు వరకూ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుస్థితిని అరికట్టేందుకు వైద్య శాఖలో ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో సీఎం జగన్‌ నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు 17 కొత్త వైద్య కళాశాలలు, ఇతర సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతున్నారు.

నిరంతర ప్రక్రియగా నియామకాలు
వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడ పోస్టు ఖాళీగా ఉన్నా వెంటనే నోటిఫై చేసి భర్తీకి చర్యలు తీసుకోవాలని, నియామకాల కోసం ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈమేరకు బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వైద్య శాఖలో నియామకాలను నిరంతర ప్రక్రియగా కొనసాగించి ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిపై ఆడిట్‌ నిర్వహిస్తాం. ప్రస్తుతం వైద్య శాఖకు అవసరమైన మందులు, పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఎంఎస్‌ఐడీసీ ఉంది. ఇదే తరహాలో మానవ వనరుల కల్పనకు ఏపీ ఎంఎస్‌ఆర్‌బీ పని చేస్తుంది.  
– ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి 

మరిన్ని వార్తలు