పలాస జీడిపప్పుకు ప్రత్యేక గుర్తింపు

28 Aug, 2020 10:27 IST|Sakshi

రాష్ట్రంలో విశిష్టమైన 14 వస్తువులలో జిల్లా తరఫున స్థానం

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు పెంచేందుకు కృషి 

కాశీబుగ్గ: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 14 విశిష్టమైన వస్తువులను ఎంపిక చేసింది. అందులో శ్రీకాకుళం జిల్లా తరఫున పలాస జీడిపప్పుకు అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న వన్‌  డిస్ట్రిక్ట్‌–వన్‌ ప్రొడక్ట్‌లో భౌగోళిక గుర్తింపు ఇచ్చి అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రాముఖ్యతను తీసుకొచ్చేందుకు ఈ ఎంపిక చేపట్టింది. స్థానికంగా ప్రాచుర్యం పొందిన విశిష్ట వస్తువులను మన ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించి ఆదాయాన్ని తెచ్చిపెట్టడానికి, అధికంగా ఎగుమతులు పెరగడానికి తోడ్పాటునందిస్తోంది.  

లక్ష ఎకరాల్లో సాగు..  
ఉద్దానం ప్రాంతంలోని వజ్రపుకొత్తూరు, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల్లో సుమారు లక్ష ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. సుమారు 5 లక్షల క్వింటాలు జీడిపిక్కలు దిగుబడి అవుతున్నాయి. జీడిపిక్కల బస్తా(80 కిలోలు) సుమారు రూ.13 వేలు ధర పలుకుతోంది. కరోనా కారణంగా వ్యాపారాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర రూ.10 వేలు ప్రకటించింది. ఈ పంటే ఇక్కడ ప్రజలకు జీవనాధారంగా ఉంది.ప్రస్తుతం మార్కెట్‌లో కిలో జీడిపప్పు నంబర్‌ 1 రకం కిలో రూ.800 ధర పలుకుతోంది.  

జిల్లాలో జీడి పరిశ్రమలు.. 
జిల్లాలో జీడి పంటకు కేరాఫ్‌గా నిలిచిన ఉద్దాన ఏడు మండలాల్లో అధికంగా జీడి పంటలు పండుతున్నాయి. పలాస కేంద్రంగా 300కుపైగా పరిశ్రమలు, జిల్లా వ్యాప్తంగా ఏఓబీతో కలుపుకుని 400 పైగా పరిశ్రమలు ఉన్నాయి. రోజుకు 500–600 టన్నుల జీడిపిక్కల ప్రొసెసింగ్‌ కు 150 టన్నుల జీడిపప్పు సిద్ధం చేస్తుంటారు. ఇలా పరిశ్రమల్లో పిక్కలు బాయిలింగ్‌ చేసి పప్పుగా మార్చి ఎగుమతులలో రోజుకు రూ.5 నుంచి రూ.6 కోట్లు వ్యాపారం జరుగుతుంటుంది. రూ.5–6 కోట్లకుగాను జీఎస్టీ రూపేనా రోజుకు రూ.25–30లక్షలు ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. ప్రత్యక్షంగా 15వేల మంది, పరోక్షంగా 5వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు.   

జీడి పరిశ్రమకు ప్రభుత్వ తోడ్పాటు
పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు జిల్లాలో ఉన్న 400కు పైగా పరిశ్రమలు సక్రమంగా నడవడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.  రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ ద్వారా అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేశారు. 

వైఎస్సార్‌ హయాంలో.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి హయాంలో 2007లో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో 30 ఎకరాల పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి ఒకేచోట వందల పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించారు.  
పావలా వడ్డీకి రుణాలను అందించి పరిశ్రమల నిర్మాణానికి తోడ్పాటు అందించారు.  
పరిశ్రమ యజమానులు పప్పు ఎగుమతులకు జీఎస్టీ అధికమవుతుందని విన్నవించడంతో 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. 

ప్రస్తుత సర్కారు హయాంలో.. 
2014 నుంచి పరిశ్రమలకు రావాల్సిన ప్రోత్సాహకాలు 2020 ఏప్రిల్, మే నెలల్లో రూ.120 కోట్లు విడుదల చేశారు. 
మహిళలు, యువతకు పూర్తి అవకాశాలు కల్పించాలని అధిక శాతం సబ్సిడీ అందించింది. 
ఏఎంసీ పరంగా పన్ను వసూళ్లు స్థానిక రైతాంగానికి ఇబ్బందులు కాకూడదని రాష్ట్రప్రతి జూన్‌లో ఆమోదం తెలుపగా ఏఎంసీ లేకుండా రూ.500 కోట్లు నష్టం భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ గత రెండు రోజులుగా అమలు చేస్తోంది. 
పలాస మండల పరిధిలో నూతనంగా పారిశ్రామికవాడను నిర్మించడానికి కొత్తగా 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే చిన్నపాటి సమస్యలతో పూర్తికాలేదు. 
ఇప్పటికే ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరి వారిని నూతన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనుంది. 
అతితక్కువ వడ్డీ, మహిళలకు అధిక శాతం సబ్సిడీతో సరికొత్త ఎంఎస్‌ఎంఈ విధానాన్ని తీసుకువచ్చింది. 
కరోనా సమయంలో జీడిపరిశ్రమలు బంద్‌ కావడంతో సుమారు 400–500 కోట్లు వ్యాపారం నిలిచిపోయింది. ఈ సమయంలో వ్యాపారులు ఇబ్బందులు పడకూడదని పరిశ్రమల శాఖ  కరోణా రుణాలను అందించింది. 
రూ.13వేలు పలకాల్సిన జీడి పిక్కల బస్తా కరోణా కారణంగా పూర్తి అమ్మకాలు జరగపోవడంతో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో రూ.10వేలు మద్దతు ధర ప్రకటించి రైతుల వద్ద కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. 

పలాస జీడిపప్పుకు మహర్దశ 
పలాస జీడిపప్పుకు చాలా ఏళ్లకు మహర్దశ వచ్చింది. పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ మేరకు 30 ఎకరాల స్థలం కేటాయింపు, బకాయిలు రూ.120 విడుదల, ఏఎంసీ రద్దు చేయడం  కలిసివస్తోంది. నాడు తండ్రి, నేడు తనయుడికి వ్యాపారులమంతా రుణపడి ఉంటాం.
– మల్లా రామేశ్వరం,ఇండస్ట్రీయల్‌ ఏరియా అధ్యక్షుడు, పలాస   

మరిన్ని వార్తలు