ఆర్థిక సైబర్‌ నేరాలకు చెక్‌ 

18 Feb, 2024 05:33 IST|Sakshi

బ్యాంకులకు ప్రత్యేక సిరీస్‌ ఫోన్‌ నంబర్లు 

140+ నంబర్‌తో కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం 

గత ఏడాది సైబర్‌ మోసాలకు పాల్పడిన ఫోన్‌ నంబర్లు భారీగా గుర్తింపు 

1.40 లక్షల నంబర్లను బ్లాక్‌ చేసిన సైబర్‌ పోలీసులు 

సాక్షి, అమరావతి :‘బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి. మీ మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది చెప్పిండి’ ఇటీవల కాలంలో మితిమీరి పెరుగుతున్న కాల్స్‌ ఇవీ. ఆ ఫోన్‌ కాల్‌ బ్యాంకు నుంచో లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచే వచ్చిందని నమ్మి ఓటీపీ చెబితే.. బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మంతా కొల్లగొడుతున్నారు. ఇలాంటి సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉపక్రమించింది.

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల పేరుతో మితిమీరుతున్న సైబర్‌ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇటీవల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై చర్చించాయి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో–ఆర్డినేషన్‌ సెంటర్‌’ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.   

ప్రత్యేక సిరీస్‌తో నంబర్ల కేటాయింపు 
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు కాల్‌ చేసే నంబర్లకు ప్రత్యేక సిరీస్‌ కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం సాధారణ టెలికాం సంస్థలు వినియోగదారులకు కేటాయిస్తున్న 10 అంకెల సిరీస్‌ నంబర్లనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కూడా కేటాయిస్తున్నారు. దీన్ని సైబర్‌ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. 2023లో అటువంటి మోసాలకు పాల్పడ్డ 1.40 లక్షల ఫోన్‌ నంబర్లను సైబర్‌ పోలీసులు గుర్తించి వాటిని బ్లాక్‌ చేశారు. అంటే ఈ తరహా మోసాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కాల్‌ చేస్తున్నామని చెప్పి ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌ లేదా పాన్‌ నంబర్‌ లింక్‌ చేయాలనో.. ఫోన్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేయాలనో రకరకాల పేరుతో బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. అవగాహనలేకో పొరపాటులో ఓటీపీ నంబర్‌ చెబితే నగదు కాజేస్తున్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సాధారణ టెలికాం వినియోగదారులకు కేటాయించే సెల్‌ఫోన్‌ నంబర్‌ సిరీస్‌ కేటాయించకూడదని హోం శాఖ తెలిపింది.

టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ (ట్రాయ్‌) గతంలోనే సూచించిన విధంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రత్యేకంగా నంబర్‌ సిరీస్‌ (140+...)తో ఫోన్‌ నంబర్లు కేటాయిస్తారు. కాబట్టి ఆ సిరీస్‌ నంబర్ల నుంచి కాల్‌ వస్తేనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసినట్టుగా భావించాలి. సాధారణ ఫోన్‌ నంబర్ల సిరీస్‌ నుంచి కాల్‌చేసి తాము బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేస్తున్నామని చెబితే.. వినియోగదారులు వెంటనే అప్రమత్తమవుతారు. సైబర్‌ నేరాల ముఠాల పనేనని గుర్తించి ఆ ఫోన్‌ కాల్స్‌కు స్పందించకుండా జాగ్రత్త పడతారు.   

మోసపోయిన సొమ్ము తిరిగి ఇప్పించేలా.. 
సైబర్‌ నేరాల్లో బాధితులు కోల్పోయిన మొత్తాన్ని నిర్ణిత వ్యవధిలోనే తిరిగి ఇప్పించే ప్రక్రియను కూడా కేంద్ర హోం, ఆర్థిక శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. మోసానికి పాల్పడిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, ఆ ఖాతాల్లో ఉన్న మొత్తం నుంచి బాధితుల సొమ్మును వారి ఖాతాలకు మళ్లించడం అనే ప్రక్రియకు నిర్ణిత గడువును నిర్దేశించాలన్నారు.  బాధితు­లు పదేపదే పోలీస్‌ స్టేషన్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి ఇప్పించనున్నారు.  బ్యాంకులు ని  ర్ణిత ఫార్మాట్‌లో సైబర్‌ పోలీసులకు సమరి్పంచాల్సిన సమాచారం నమూనాను రూపొందించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు