అన్నమయ్యకు సింగారం.. ఎర్ర బంగారం

7 May, 2022 11:15 IST|Sakshi

సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా అడవులకు నిలయంగా మారింది. ఎక్కడ చూసినా చుట్టూ కొండ కోనలు.. పచ్చని చెట్లతో ప్రకృతి పరవశింపజేస్తోంది. శేషాచలం, పెనుశిల, ఎర్రమల, పాలకొండలు, వెంకటేశ్వర అభయారణ్యాలలో విస్తరించిన అడవులు అందంగా దర్శనమిస్తున్నాయి. మరోపక్క ఎక్కడ చూసినా ప్రకృతి ఒడిలో చెక్కిన శిల్పాల్లా ఎర్రబంగారానికి నిలువెత్తు సాక్ష్యంగా అన్నమయ్య జిల్లా నిలుస్తోంది.

సువిశాలమైన మైదానాలు.. గలగలపారే సెలయేర్లు.. పక్షుల కిలకిలా రావాలు.. అడవి జంతువులతో అటవీ ప్రాంతం అలరారుతోంది. అంతేకాకుండా జిల్లాలోని అడవులు పెద్దపెద్ద గజరాజులకు నిలయమనే చెప్పాలి. వైఎస్సార్‌ జిల్లా 5.40 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉండగా.. ప్రస్తుతం విభజన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఆరు నియోజకవర్గాలు, 30 మండలాల పరిధిలో 2.45 లక్షల హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది.  

లక్ష హెక్టార్లలో ఎర్ర బంగారం 
జిల్లాలోని శేషాచలం, వెంకటేశ్వర అభయారణ్యాల్లో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఎర్రచందనం ఉన్న జిల్లాల్లో మొదటగా అన్నమయ్యనే చెప్పుకోవాలి. ప్రస్తుతం రాజంపేట డివిజన్‌ పరిధిలోని అనేక ప్రాంతాల్లో సుమారు 92 వేల హెక్టార్ల నుంచి లక్ష హెక్టార్ల వరకు ఎర్రచందనం విస్తరించి ఉంది. ఎర్రచందనంతోపాటు నారేడు, నెమలినార, సండ్ర, తుమ్మచెట్లు, వెదురుతోపాటు ఇతర అనేక రకాల చెట్లతో అటవీ విస్తీర్ణం 
పచ్చదనంతో కళకళలాడుతోంది. 

రాజంపేట డివిజన్‌లోకి పలు రేంజ్‌లు 
రాజంపేట డివిజన్‌ పరిధిలో ఇప్పటివరకు చిట్వేలి, కోడూరు, రాజంపేట, సానిపాయి రేంజ్‌లు కలిసి ఉండగా.. తాజాగా తిరుపతి పరిధిలోని బాలుపల్లె, కడప పరిధిలోని రాయచోటి, చిత్తూరు పశ్చిమ పరిధిలోని మదనపల్లె, చిత్తూరు తూర్పు పరిధిలోని పీలేరు రేంజ్‌ అడవులు కూడా రాజంపేటలోకి వచ్చి చేరాయి. అయితే రానున్న కాలంలో జిల్లాకు సంబంధించి ప్రత్యేక జిల్లా అధికారిని నియమిస్తారని తెలియవచ్చింది. సామాజిక అటవీ విభాగానికి సంబంధించి ఆరు నియోజకవర్గాలకు కలిపి ఏడు నర్సరీల వరకు ఉన్నాయి. 

గజరాజులకు నిలయం
జిల్లాలోని అడవుల్లో అనేక రకాల జంతువులు నివసిస్తున్నాయి. వేల సంఖ్యలో పక్షులకు ఆలవాలంగా నిలుస్తోంది. అయితే శేషాచలం, బాలుపల్లె రేంజ్‌ పరిధిలోని అడవుల్లో ఏనుగుల గుంపులు ఉన్నాయి. ఈ అడవుల్లో సుమారు  35 గజరాజులు ఉన్నట్లు అటవీశాఖ అంచనా వేస్తోంది. అవే కాకుండా ఎలుగుబంట్లు, చిరుతలు, కొండ గొర్రెలు, జింకలు, కొండ దుప్పులు, కుందేళ్లు ఇలా చెబుతూ పోతే అనేక రకాల జంతువులు నివసిస్తున్నాయి.

జిల్లాలో భారీ అటవీ విస్తీర్ణం 
అన్నమయ్య జిల్లాలో భారీ అటవీ విస్తీర్ణం ఉంది. సుమారు 2.45 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి.  అనేక రకాల చెట్లతోపాటు ఏనుగులు, ఎలుగుబంట్లు ఇలా వివిధ రకాల జంతువులు ఉన్నాయి. కొత్తగా బాలుపల్లె, రాయచోటి, మదనపల్లెతోపాటు పలు రేంజ్‌లు వచ్చి రాజంపేటలో కలిశాయి. 
– వై.వెంకట నరసింహారావు. డీఎఫ్‌ఓ, రాజంపేట  

మరిన్ని వార్తలు