వలస బతుకుల మెతుకు వేట..!

10 Jan, 2023 14:20 IST|Sakshi

పొట్ట చేత పట్టుకుని వేల కిలోమీటర్లు పయనం

వ్యవసాయ పనిముట్లు తయారీ, విక్రయాలతో జీవనం

ఏటా ఏడు నెలల పాటు ఇక్కడే సంచార జీవనం

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన  5 వేల మందికి పైగా జీవనోపాధి

సొంతూరులో ఉపాధి కరువు.. ప్రతి పూటా బతుకు పోరాటం.. జీవనయానం కోసం వేల కి.మీ. పయనం. రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని ఆ చెంతనే నిప్పుల కొలుములు పెట్టుకుని వ్యవసాయ పరికరాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ సీజన్‌లోనే వీరికి ఆదరువు. ఒక వైపు యాంత్రీకరణ పెరిగిపోతున్నా.. బుక్కెడు మెతుకుల కోసం వలస జీవులు ఊరూరా తిరుగుతూ తమకు తెలిసిన నైపుణ్యంతోపనిముట్లు తయారు చేసి విక్రయిస్తూ పొట్ట నింపుకుంటున్నారు. వలస జీవుల జీవన ఆరాటంపై స్పెషల్‌ ఫోకస్‌... 

దర్శి టౌన్‌(ప్రకాశం జిల్లా):  మధ్యప్రదేశ్‌..ఉత్తరప్రదేశ్‌..ఛత్తీస్‌ఘడ్‌.. ఇవన్నీ జిల్లాకు సుదూర ప్రాంతాలే. ఎన్నో వేల కిలోమీటర్లు దాటి వచ్చి ఎన్నో ఆశల మధ్య జీవనం సాగిస్తున్నారు వలస జీవులు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. పనిచేస్తేకానీ నోటికందని మెతుకుని రెక్కల కష్టం చేద్దామన్నా స్థానికంగా అండ లేక, పూటగడవడమే కష్టమైన వేళ.. వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిప్పుల కొలిమిలో ఇనుమును కరిగించి.. రెక్కలు ముక్కలు చేసుకుంటూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాల్లో పిల్లా పెద్దా,.. ఆడ, మగ.. ఇలా అందరికీ ఇనుముతోనే బతుకు అంతా ముడిపడి ఉంటుంది. ఒకరో ఇద్దరో కాదు ఐదు వేల మందికి పైగా నిరుపేదలకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి జిల్లాకు పొట్టచేత పట్టుకుని వస్తున్నారంటే ఆశ్చర్యం కలిగించక మానదు. ఏటా వ్యవసాయ సీజన్‌లో ఒక్కడే ఉండి ఊరూరా తిరుగుతూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇలా సీజన్‌లో నాలుగు డబ్బులు సంపాదించుకుని తిరిగి సొంత ఊళ్లకు వెళ్తుంటారు.  

డొక్కాడాలంటే రెక్కాడాల్సిందే..   
యాంత్రీకరణ గణనీయంగా పెరిగిన ఈ రోజుల్లోనూ వారు చేతి వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు మొదలై పని రాత్రి ఏడు గంటల వరకు కొనసాగుతుంది. ఆడ, మగ తేడా లేకుండా పనిముట్లు తయారు చేస్తారు. పనిముట్లు తయారు చేసుకునేందుకు అవసరమైన పరికరాలు తమ వెంట తెచ్చుకుంటారు. వీటి తయారీకి లారీల పాత కమాన్‌ ప్లేట్లు కేజీ రూ.80కి కొంటారు. వాటిని కొలిమిలో కాల్చి ఇనుమును కరిగించి, సమ్మెటల సాయంతో గునపాలు, కొడవళ్లు, పారలు, వంట పనిముట్లు తయారు చేస్తారు. రోడ్డు పక్కన నిప్పుల పొయ్యి రాజేసుకుని చపాతీలు, రోటీలు తయారు చేసుకుని తింటారు. రాత్రయితే రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని గుడి మెట్ల పక్కనో..షాపుల ఆవరణలో నిద్రిస్తారు. సైజును బట్టి కొడవలి రూ.20 నుంచి రూ.200 వరకు విక్రయిస్తారు. గొడ్డలి రూ.150 నుంచి రూ.300, మాంసం కత్తి రూ.100 నుంచి రూ.250 వరకు విక్రయిస్తారు. రోజుకు వెయ్యి నుంచి రూ.1500 వరకు విక్రయాలు ఉంటాయి. ఊరూరా తిరుగుతూ వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలను సాకుతున్నారు. సంచార జీవితం సాగిస్తూ బతుకులు వెళ్లదీస్తున్నారు. 

జిల్లాలో ఇలా.. 
జిల్లాలో 5 వేల మందికి పైగా పనిముట్ల తయారీలో జీవనోపాధి పొందుతున్నారు. ముఖ్యంగా జన సంచార ప్రాంతాల్లో కొంత స్థలంలో తాత్కాలికంగా కొలిమి ఏర్పాటు చేసుకుని పనిముట్లు తయారు చేస్తుంటారు. జిల్లాలో ఎక్కువగా దర్శి బస్టాండ్‌ ప్రాంతం, తాళ్లూరు వీకే కళాశాల వద్ద, వినుకొండలో కురిచేడు రోడ్‌లో గొర్రెల బడ్డి వద్ద వ్యవసాయ పరికరాలు తయారు చేసుకుని  విక్రయిస్తున్నారు. దొనకొండ నాలుగు కూడళ్ల ప్రాంతంలో, చీమకుర్తిలో జవహర్‌ హాస్పిటల్‌ వద్ద, బీవీఎస్‌ కళాశాల ప్రాంతం, గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతంలో, మోటు వద్ద, మార్కాపురంలో తర్లుపాడు మండల కేంద్రం,  కొండపి బస్టాండ్‌ ప్రాంతంలో, కట్టంవారిపాలెం వద్ద, యర్రగొండపాలెం బస్టాండ్‌ ప్రాంతంలో అర్ధవీడు మండలం కుంట వద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకుని డిమాండ్‌ ఉన్న రోజుల వరకు అక్కడే ఉంచి పనిముట్లు తయారు చేసి అమ్ముకుని జీవనం సాగిస్తారు.  

అక్కడ ఆదరణ లేదు 
మధ్యప్రదేశ్‌లో పనిముట్లు తయారు చేసినా సరైన ఆదరణ లేదు. అమ్ముకోవాలంటే గిరాకీ లేదు. అందుకే వ్యవసాయ సీజన్‌లో  ఏడు నెలల పాటు ఇక్కడే ఉంటూ పలు గ్రామాలు తిరుగుతూ పనిముట్లు అమ్ముకుంటాం. రోజుకు గ్రామాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు వస్తాయి. ఖర్చులు పోను జీవనానికి ఇబ్బందులు ఉండవు. ఉపాధి కల్పిస్తున్న ఏపీకి ప్రత్యేక కృతజ్ఞతలు.  
– జగదీష్, భోపాల్, మధ్యప్రదేశ్‌  

మరిన్ని వార్తలు