'లగ్గసరి'.. కన్యాశుల్కం ఇవ్వాల్సిందే మరి

23 May, 2021 05:36 IST|Sakshi
బుర్రకథ చెబుతున్న బుడగ జంగాలు

బుడగ జంగాల కుటుంబాల్లో నేటికీ ఇదే ఆనవాయితీ

ఆడ.. మగ ఎవరైనా ఏడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు

మరో పెళ్లి కావాలంటే పావలా ఇచ్చి విడుదాంబూలం

బుర్రకథలు చెప్పడం, భిక్షాటన, జంతువుల వేటే జీవనాధారం

ఇప్పటికీ అదే వృత్తి.. అవే ఆచారాల కొనసాగింపు

కర్నూలు (రాజ్‌విహార్‌): కన్యాశుల్కం.. పెళ్లి సమయంలో వధువుకు వరుడిచ్చే కట్నం. నేటి ఆధునిక కాలంలో ఈ సంప్రదాయం కనుమరుగైనప్పటికీ.. బుడగ జంగాల్లో మాత్రం నేటికీ కొనసాగుతోంది. ఓలీగా పిలిచే ఈ ఆచారం ప్రకారం.. వివాహం నిశ్చమయ్యాక వరుడు రూ.9 ఎదురు కట్నం (కన్యాశుల్కం)గా సమర్పించుకోవాల్సిందే. ఇందులో రూ.4 వధువుకు, మిగిలిన రూ.5 భవిష్యత్‌లో సమస్య వస్తే పరిష్కరించే ఐదుగురు కుల పెద్దలకు ఇస్తారు. భార్తాభర్తల మధ్య స్పర్థలు వస్తే పోలీస్‌ స్టేషన్లకు వెళ్లరు. విడిపోవాలనే నిర్ణయానికి వస్తే కోర్టుకు వెళ్లి భరణం అడగరు. కుల పెద్దల ఎదుట పంచాయితీ పెట్టి సమస్య పరిష్కరించుకుంటారు. భార్య నుంచి భర్త.. భర్త నుంచి భార్య కూడా విడాకులు కోరవచ్చు. విడాకులు పొందాక ఏడు పెళ్లిళ్ల వరకు చేసుకునే ఆచారం వీరిలో ఉంది. విడిపోవాల్సి వస్తే భార్యాభర్త, కులపెద్ద, అమ్మాయి తల్లి సమీపంలోని చెట్టు చాటుకు వెళ్తారు. భర్త మొహంపై భార్య ఊసిన తరువాత పావలా (స్తోమతను బట్టి ఎంత మొత్తమైనా) భార్య చీర కొంగులో కట్టి ఎడమ చేత్తో తాళిని తెంచేస్తాడు. దీంతో విడాకులు (విడుదాంబూలం) పొందినట్టే.

ఆధునిక కాలంలోనూ అదే జీవనశైలి
నేటి ఆధునిక కాలంలోనూ బుడగ జంగాలు అక్షరాస్యతకు దూరంగా ఆచారాలు, కట్టుబాట్లతో జీవనం సాగిస్తున్నారు. ఊరూరా తిరిగే సంచారజాతికి చెందిన వీరు ఊరి బయట గుడిసెలు వేసుకుని జీవిస్తుంటారు. పూర్వం బుర్రకథలు, ఎల్లమ్మ, బాలనాగమ్మ, అరేవాండ్ల, చిన్నమ్మ, దేశంగిరాజు కథలు చెబుతుండేవారు. బుర్రకథలకు కాలం చెల్లడంతో కాళ్లకు గజ్జెకట్టి తంబుర, గుమ్మెట వాయిస్తూ ‘వినరా భారత వీర రాజకుమారా.. బొబ్బిలి రాజు కథ’ అంటూ పాటలు పాడుతూ యాచనతో జీవనం సాగిస్తున్నారు. పండుగలు, జాతరలు, తిరునాళ్లలో వివిధ వేషధారణలతో అలరిస్తున్నారు. కొందరు మాత్రం ఈతాకు చాపలు అల్లడం, పాత బట్టలు, బుడగలు, పిన్నీసులు, ప్లాస్టిక్‌ బిందెలు విక్రయించడం ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నారు.

కుల ధ్రువీకరణకు నోచుకోక..
రాష్ట్రంలో 65 వేల బుడగ జంగాల కుటుంబాలు ఉన్నాయి. రాయలసీమలో 45 వేల కుటుంబాలు ఉండగా.. ఒక్క కర్నూలు జిల్లాలో 27,500 కుటుంబాల వరకు ఉన్నాయి. సంచార జాతికి చెందిన వీరికి 2010 వరకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ షెడ్యూల్డ్‌ సవరణ చట్టం–2002 అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం తెలంగాణలో మాత్రమే బుడగ జంగాలు ఉన్నట్టు కేంద్రం గుర్తించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో బుడగ జంగాలు లేరంటూ అప్పట్లో జీవో–144 విడుదల చేయడంతో ఏపీలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ ఆగిపోయింది. దీంతో వీరంతా ఓసీలుగా మిగిలిపోయారు.

జగనన్న చేయూత
బుడగ జంగాల సమస్యను గుర్తించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వీరి సంక్షేమానికి ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేసింది. కుల ధ్రువీకరణ స్థానంలో వారి నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకుని ‘జగనన్న చేయూత’ పథకాన్ని వర్తింప చేస్తోంది. 45 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఏటా రూ.18,750 చొప్పున అందజేస్తోంది.

చంద్రబాబు మోసం చేశారు
షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో బుడగ/బేడలను ఎస్సీలుగా గుర్తించినా.. ఏపీలో మాత్రం గుర్తించడం లేదు. ఈ విషయాన్ని గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా మోసం చేశారు. జేసీ శర్మ కమిషన్‌ నివేదికను కేంద్రానికి పంపి, కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయించి ఆదుకోవాలి.
– తూర్పాటి మనోహర్, అధ్యక్షుడు,రాష్ట్ర బుడగ జంగం సంక్షేమ సంఘం

కుల ధ్రువీకరణ ఉంటే అభివృద్ధి
నేను వెటర్నరీ డిప్లొమా చేశా. కుల ధ్రువీకరణ లేక ఉన్నత విద్య, ఉద్యోగాలకు పోటీ పడలేకపోతున్నాం. ఈ సమస్యను పరిష్కరిస్తే అక్షరాస్యత పెరిగి, మా కులంలో మూఢ నమ్మకాలు తగ్గి అభివృద్ధి చెందుతాం.
– కె.రాజు, ఆర్కే దుద్యాల, కర్నూలు జిల్లా 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు