నోటు నోటుకో ప్రత్యేకత..

18 Aug, 2020 09:33 IST|Sakshi

దేశ సార్వభౌమాధికార చిహ్నంగా కరెన్సీ 

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం

ఎన్నేళ్లయినా జాతిపిత గాంధీకి అదే గౌరవం

ఏ వస్తువు కొనాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. సమాజంలో డబ్బుకు ఉన్న విలువ అలాంటిది. నోటు అనేది సాధారణ కాగితం కాదు. అది దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. మార్కెట్‌ విక్రయాల్లో నోట్లదే ప్రధాన పాత్ర. అందుకోసం ప్రతి దేశమూ ఒక్కో కరెన్సీని ముద్రిస్తుంది. ఏ దేశంలో నోట్లు ఆ దేశంలోనే చెల్లుబాటు అవుతాయనేది అందరికీ తెలిసిన విషయం. ఇతర దేశాల్లో మన కరెన్సీ నోట్లకు విలువ లేకున్నా వినమయశక్తి ఉంటుంది. పలు ప్రత్యేకతలతో భద్రతా పరమైన చర్యలతో నోట్లను ముద్రిస్తూ ఉంటారు. ఇందుకు దేశ సార్వభౌమాధికార చిహ్నాలు, సంస్కృతి, సంప్రదాయాల ఆనవాళ్లు, జాతి నేతల చిత్రాలను కరెన్సీపై ముద్రిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారత కరెన్సీ(నోట్లు)పై ప్రత్యేక కథనం. 

దత్తిరాజేరు: మన దేశ కరెన్సీ నోట్లపై ఇప్పటికీ మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రిస్తూ ఆయనకు మనం ఇచ్చే గౌరవాన్ని ప్రభుత్వాలు చాటిచెబుతున్నాయి. పెద్ద నోట్లు రద్దు తరువాత రూ.2 వేల  నోటును రిజర్వ్‌ బ్యాంక్‌ అమల్లోకి  తీసుకొచ్చింది. ఈ నోటుకు ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రం, కుడివైపు అశోక స్థూపం ఉంటాయి. వెనుక వైపు స్వచ్ఛభారత్‌ లోగో, మంగళయాన్‌ ప్రయోగ చిహ్నాన్ని ముద్రించారు. గులాబీ రంగులో ఉన్న ఈ నోటు ముద్రణలో 19 జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చర్యలు వలన ఈ నోటును నకిలీ చేయడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం బల్లగుద్ది మరీ చేబుతోంది. 

చారిత్రక ఎర్రకోట 
మన దేశ అద్భుత కట్టడాల్లో ఢిల్లీలోని స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు ఇది కేంద్రం. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సంబరాలను ఇక్కడే నిర్వహిస్తారు. ఈ కోటపైనే మువ్వన్నెల జెండాను దేశ ప్రధాని ఎగురవేస్తుంటారు. ఈ కోటకు 360 ఏళ్ల చరిత్ర ఉంది. 1638లో యమునా నది ఒడ్డున ఈ కోట నిర్మాణ పనులు చేపట్టి, 1648లో పూర్తి చేశారు. ఈ కోట చిత్రం ప్రస్తుతం రూ.500 నోటుపై చోటు దక్కించుకుంది. 

జాతి ఔన్నత్యాన్ని చాటే.. 
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలైన హిమాలయాలను రూ.100 నోటు వెనుక చూడవచ్చు. ఇందులో సుమారు నూరు శిఖరాలు 7.200 మీటర్లు ఎత్తుకు మించి ఉన్నాయి. ఆసియాలోని భూటాన్,  చైనా, భారత్, నేపాల్, పాకిస్థాన్‌ భూ భాగాల్లో ఈ పర్వత శ్రేణులు పెట్టని కోట గోడలుగా ఉన్నాయి. 

చట్ట సభలకు ప్రత్యేకం 
ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యంగ వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది. అతి పెద్ద ప్రజా స్వామ్య దేశంగా ఇతర దేశాలకు సైతం తలమానికంగా ఉండే భారత పార్లమెంట్‌ భవనం. ఈ చిత్రం రూ.50 నోటు వెనుక ముద్రితమై ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు, దేశ పాలనా పరమైన అంశాలను ఇక్కడ చర్చించి చట్టాలను అమలులోకి తీసుకొస్తుంటారు. 

పర్యావరణానికి పెద్ద పీట 
పర్యావరణానికి ప్రతి రూపంగా భావించేది అండమాన్, నికోబార్‌ దీవుల్లో అమౌంట్‌ హేరియంట్‌ నేషనల్‌ పార్క్‌. ఈ చిత్రాన్ని రూ.20 నోటుపై ముద్రించారు. ఈ పార్క్‌ను 1979లో 46.62 కి.మీ. మేర విస్తరించారు. 

అద్భుత శిల్ప కళా సంపద 
రూ.10 నోటుపై మనకు ఒక పెద్ద చక్రం కనిపిస్తుంది. ఆ చక్రం ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కోణార్క్‌ సూర్యదేవాలయం లోనిది. సూర్య గమనానికి అనుగుణంగా నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్ప కళా సంపదకు నిలయం. మన దేశంలోని ఏడు వింతలలో ఇది ఒకటి ఈ దేవాలయం ఒడిశాలోని పూరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఏడు గుర్రాలు ఓ ర«థానికి కట్టి ఉన్నట్లుగా ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు ప్రతీకగా చెబుతారు. ఇక ఈ రథానికి ఉన్న 24 చక్రాలు రోజులోని 24 గంటలకు ప్రతీకగా చెబుతుంటారు. 

కర్షకులకు చిహ్నంగా.. 
వ్యవసాయ నిర్మాణ రంగంలో ఎక్కువ వాడుకలో ఉన్న ట్రాక్టర్‌ను రూ.ఐదు నోటు వెనుక ముద్రించారు. ట్రాక్టర్‌ అనే పదం ట్రహేర్‌ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. దేశం వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటిదని తెలియజేసే లక్ష్యంతో ఐదు రూపాయల నోటుపై ఈ చిత్రాన్ని ముద్రించారు. 

జాతీయ జంతువు.. 
రెండు రూపాయలు నోటుపై మన జాతీయ జంతువు పులి బొమ్మ ఉంటుంది. వన్య ప్రాణుల సంరక్షణకు ప్రాముఖ్యనిస్తూ ఈ నోటుపై పులి బొమ్మను ముద్రించారు. 

సాగర్‌ సామ్రాట్‌ 
మన కరెన్సీలో రూపాయి నోటుకి అధిక ప్రాధాన్యం  ఉంది. ఈ నోటు వెనుక సాగర్‌ సామ్రాట్‌ ఆయిల్‌ రిగ్‌ కనపడుతుంది. ఓఎన్‌జీసీకి చెందిన ఈ ఆయిల్‌ రిగ్‌ దేశ మౌలిక వసతులను తెలియజేస్తుంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు