కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు! 

11 Oct, 2021 20:09 IST|Sakshi
మాళమల్లేశ్వర స్వామి వెలిసిన దేవరగట్టు

బన్ని ఉత్సవంలో మూడు గ్రామాల ప్రజల కఠోర నిష్ట  

12 రోజుల పాటు కట్టుబాట్లతో దీక్ష

హొళగుంద: ప్రతి ఏటా దసరా పర్వదినం రోజు దేవరగట్టులో జరిగే కర్రల సమరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరుంది. నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని తిలకిస్తారు. దేవరగట్టు సమీపంలోని మూడు గ్రామాల ప్రజలు ఉత్సవాల్లో కీలక భూమిక పోషిస్తారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ పాల్గొంటున్నారు. దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి దసరా బన్ని మహోత్సవాల్లో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ప్రత్యేకత చాటుతారు. ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి దీక్ష చేపట్టి కంకణాధారణ మొదలు బన్ని ఉత్సవాలు ముగిసేంత వరకు నిష్టతో ఉంటారు.

కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరణికి గ్రామానికి చేరే వరకు కట్టుబాట్లు పాటిస్తారు. 12 రోజుల పాటు కనీసం కాళ్లకు చెప్పులు వేసుకోకుండా మద్యం, మాంసం ముట్టకుండా.. బ్రహ్మచర్యం పాటిస్తూ దైవకార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరూ విజయదశమి రోజు పండగ చేసుకుంటే ఈ మూడు గ్రామాల ప్రజలు మాత్రం బన్ని ఉత్సవం ముగిసి స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరే రోజు విజయానికి సూచికగా పండగ చేసుకుంటారు. ఆయా గ్రామాల ప్రజలు వైరాన్ని వీడి కులమతాలకు అతీతంగా ఉత్సవాల్లో పాల్గొంటుండటం విశేషం.

బన్నిలో విగ్రహాలకు రక్షణగా నిలిచిన గ్రామస్తులు (ఫైల్‌)           

పాల బాస చేసి.. సమైక్యత చాటుతూ  
కర్రల సమరానికి ప్రారంభానికి ముందు ఈ మూడు గ్రామాల ప్రజల పాల బాస చేస్తారు. దేవుని కార్యం ముగిసే వరకు కట్టుబాట్లు పాటిస్తూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటామని పాల మీద చేతులు ఉంచి ప్రమాణం చేస్తారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నా  జైత్రయాత్రను విజయవంతంగా ముగించుకుని విగ్రహాలను నెరణికి గ్రామం చేరుస్తారు. కొన్ని తరాలుగా  ఇలవేల్పుపై భక్తిభావాన్ని చాటుతున్నారు.

దేవరగట్టు బన్ని ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈనెల 19వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో 15వ తేదీ విజయదశమి రోజు నిర్వహించే బన్ని ఉత్సవం కీలకం. నెరణికిలో ఉన్న మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పల్లకీలో సోమవారం దేవరగట్టులో కొండపై ఉన్న ఆలయానికి చేర్చి కంకణధారణతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. కర్రల సమరానికి ముందు 
కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.

సంప్రదాయ పండగ  
దేవరగట్టు బన్ని ఉత్సవంలో భక్తులు కర్రలతో కొట్టుకుంటారనేది అవాస్తవం. ఇది సంప్రదాయ పండగ. పూర్వం గట్టుపై జంతువుల నుంచి రక్షణగా కర్రలు, ఆయుధాలు, దివిటీలు తీసుకెళ్లే వారు. కాలక్రమేణా అవి దురుద్దేశాలకు వాడడంతో కర్రల సమరంగా ముద్ర పడింది. మద్యం సేవించిన వారు మాత్రమే గాయ పడతారు కాని ఇతరులకు ఏమి కాదు.   
– గిరిస్వామి, భవిష్యవాణి వినిపించే ఆలయ ప్రధాన అర్చకుడు, దేవరగట్టు 

విగ్రహాలకు రక్షణగా ఉంటాం 
వేలాది మంది పాల్గొనే వేడుకల్లో స్వామి, అమ్మవారి విగ్రహాలను కాపాడుకోవడమే మా మూడు గ్రామాల లక్ష్యం. కఠోర కట్టుబాట్లతో జైత్రయాత్రలో విగ్రహాలకు రక్షణ కవచంగా ఉండి కాపాడుకుంటూ వస్తున్నాం. ఉత్సవాల సమయంలో మద్యం, మాంసం ముట్టితే బన్ని ఉత్సవం జరిపే అర్హత కోల్పోతాం. మా వంశస్తులు గట్టులో ఉండే రాక్షస 
గుండ్లకు రక్తం సమర్పిస్తారు.
– బసవరాజు,  కంఛాబీరా వంశస్తుడు, నెరణికి

కట్టుబాట్లు పాటిస్తారు 
దేవరగట్టు ఉత్సవాల్లో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు నిష్టతో కట్టుబాట్లు పాటిస్తారు. బన్ని రోజు సాయంత్రం గట్టుకెళ్లే ముందు ప్రతి ఒక్కరూ స్నానమాచారించి గ్రామంలోని అన్ని ఆలయాల్లో కొబ్బరి కాయలు సమర్పిస్తారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కొండకు బయలుదేరుతారు. కర్రలతో విగ్రహాల మీదకు వచ్చే వారిని తరమడమే లక్ష్యంగా జైత్రయాత్రలో పాల్గొంటారు.  
– రవిశాస్త్రీ, మాళమల్లేశ్వరుని కల్యాణం నిర్వహణ పురోహితుడు, నెరణికి      

మరిన్ని వార్తలు