కాళ్లు చేతులు కదలవు.. వారెవ్వా ఏమి ‘ఫేసు’..

18 Apr, 2021 08:38 IST|Sakshi
సూర్యప్రకాశ్‌ అభినయం

ఫేస్‌ డ్యాన్స్‌తో పేరు సంపాదించిన సూర్యప్రకాష్‌

కళ్లు, పెదవులు, ముక్కు, చెవులు, గొంతుతో అభినయం

జాతీయ స్థాయి వేదికపైనా ప్రదర్శన  

రాజాం: కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్సు అదిరిపోతుంది. ప్రత్యేకించి స్టెప్పులంటూ ఏమీ ఉండవు.. కానీ నృత్యం మాత్రం లయబద్ధంగానే సాగుతుంది. ఉన్న చోట నుంచి మనిషి కదలడు.. అయితేనేం దరువుకు తగ్గట్టు నాట్యం రక్తి కడుతుంది. రాజాంకి చెందిన సూర్యప్రకాష్‌ ప్రత్యేకత ఇది. కేవలం కళ్లు, పెదవులు, ముక్కు, చెవులు, గొంతుతో అతను చేసే అభినయానికి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఒక్కసారి సూర్య డ్యాన్సు చూశారంటే వారెవ్వా ఏమి ఫేసు అనకుండా ఉండలేరు. తాజాగా ఓ జాతీయ చానెల్‌లో  ప్రసారమయ్యే డ్యాన్స్‌ షోలో కూడా ఆయన ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు.

నా పేరు అలుగోలు సూర్యప్రకాష్‌. మాది రాజాం పట్టణ పరిధిలోని మల్లిఖార్జున కాలనీ. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నాకు ముగ్గురు అన్నదమ్ములతో పాటు ఒక సోదరి ఉన్నారు. అందరిలో నా పెద్ద సోదరుడు మాత్రమే ఉన్నత చదువులు చదవగలిగాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ సెక్టారులో పనిచేస్తున్నాడు. మిగిలిన సోదరులమంతా కార్పెంటర్లుగా పనిచేసుకుంటున్నాం. నేను రాజాం బజార్‌లోని ప్రభుత్వ యూపీ స్కూల్‌లో 5వ తరగతి వరకూ మాత్రమే చదివాను. నాకు భార్య శ్రావణికుమారితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం మాకు వివాహం జరిగింది.

ఆసక్తితోనే ఫేస్‌ డ్యాన్సర్‌గా.. 
నాకు చిన్నప్పటి నుంచి స్టేజీపై నటించాలని ఉండేది. కానీ ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు. 1996 నుంచి నాలుగేళ్ల పాటు విశాఖపట్నంలో ఉన్నాను. అక్కడే రైన్‌కింగ్‌ కరాటే డోస్‌ శిక్షణ కేంద్రంలో చేరాను. కరాటేతో పాటు కర్రసాము నేర్చుకున్నాను. 30 సార్లు కరాటే పోటీల్లో పాల్గొనడమే కాకుండా బహుమతులు కూడా సాధించాను. అనంతరం వివాహం జరగడం, ఇతర కారణాలతో కొన్నేళ్లు సాధారణంగా గడిచిపోయాయి. పిల్లలు కొద్దిగా పెద్దవారు కావడంతో పాటు ఆ మధ్య వచ్చిన టిక్‌ టాక్‌లో ఏదో ప్రదర్శన ఇస్తే బాగుంటుందని అనుకున్నాను. ఒక అమెరికా టిక్‌టాకర్‌ తన కళ్లతో అభినయం చేయడం చూశాను. నేను కూడా కష్టపడి కళ్లు, తర్వాత కను బొమ్మలు, ముక్కు, చెవులు, గొంతు వంటి శరీర భాగాలను కదుపుతూ డ్యాన్స్‌ చేయడం ప్రారంభించాను.


హిందీ చానెల్‌లో ప్రదర్శన..  

ప్రారంభంలో చాలా కష్టంగా ఉండేది. రానురానూ పట్టు సాధించడంతో ఏ పాటకైనా మ్యూజిక్‌కు అనుగుణంగా ముఖంలోని ఏ భాగాన్నై నా కదిలించే సామర్థ్యం వచ్చింది. టిక్‌టాక్‌లో ఈ ప్రదర్శనకు ఎన్నో లైక్‌లు వచ్చాయి. దేశవిదేశాల్లో 1.70 మిలియన్ల నెటిజెన్‌లు నాకు ఫాలోవర్లుగా మారారు. ఇందులో నా స్నేహితులు నన్ను గుర్తించి టిక్‌టాక్‌ అవార్డు ఇచ్చారు. అనంతరం నన్ను గుర్తించిన పలు యూట్యూబ్‌ చానెల్స్‌తో పాటు కొన్ని పెద్ద చానల్‌లు కూడా నా ఫేస్‌ డ్యాన్స్‌పై ఆసక్తి చూపినా గురించి ప్రపంచానికి పరిచయం చేశాయి.

నటనపై మక్కువతోనే... 
నాకు నటన అంటే చాలా ఇష్టం. ఏ దో ఒక సినిమాలో చేయాలని ఉంది. గతంలో కన్నడ మూవీలో చేస్తావా అని ఒక కన్నడ నిర్మాత నాకు ఫోన్‌ చేసి అడిగారు. ఈ ఏడాది మేలో అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంకా ఆ అవకాశం రాలేదు. తెలుగు సినిమాలో ఒక్క సారైనా నటించి నా ప్రతిభ ను చాటుకోవాలని ఉంది. ప్రతిభకు చదువుతో పనిలేదు. పేదరికం అడ్డు కాదు అని నిరూపించడంతో పాటు నేను సొంతంగా నేర్చుకున్న ఫేస్‌ డ్యాన్స్‌ కళను పది మందికి తెలియజేయాలని చూస్తున్నాను.

జాతీయ స్థాయిలో గుర్తింపు... 
నెల రోజుల క్రితం ముంబై నుంచి నాకు కలర్స్‌ చానల్‌ నుంచి పిలుపు వచ్చింది. వారు ఏర్పాటుచేసిన డ్యాన్స్‌ డివైన్‌ షో–3లో నన్ను పాల్గొనాలని కోరారు. నేను అక్కడకు వెళ్లిన తర్వాత జాతీయ స్థాయిలోని ఎంతో మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇస్తుంటే నా ఫేస్‌ డ్యాన్స్‌ ఏమంత గుర్తింపు రాదులే అనుకున్నా. నేను స్టేజ్‌ ఎక్కి ఫేస్‌ డ్యాన్స్‌ చేస్తే ఒకటే ఈలలు. నా చిన్ననాటి అభిమాన హీరోయిన్‌ మాధురీదీక్షిత్‌తో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆమె అప్పట్లో తన కళ్లతో అభిన యం చేసేది. అంతే కాకుండా అక్కడ షోకు న్యాయ నిర్ణేతలుగా, నిర్వాహకులుగా వ్యవహరించిన తుషార్‌కాలియా, ధర్మేష్, రాఘవ తదితరులుతో మాట్లాడే అవకాశం కూడా కలిగింది.
చదవండి:
ఫలరాజు.. ఎగుమతుల్లో రారాజు  
గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి  

మరిన్ని వార్తలు