Punch Dialogues: రోశయ్య చెణుకు విసిరితే..

5 Dec, 2021 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రోశయ్య వాక్చాతుర్యం, సమయస్ఫూర్తికి నిలువుటద్దంగా పేరు గడించారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా ఆయన తన గళాన్ని బలంగా వినిపించేవారు. తన సహజశైలితో, ఎలాంటి మొహమాటం లేకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మొట్టికాయలు వేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఎన్టీఆర్, చంద్రబాబుల ప్రస్తావన వచ్చిదంటే చాలు.. రోశయ్య మాటలు తూటాల్లా పేలేవి.

చదవండి: నింగికేగిన నిగర్వి

ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ను రోశయ్య కించపర్చారంటూ నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శలు చేశారు. రోశయ్యకు కోపం ఎక్కువైందని, ఎన్టీఆర్‌ను కించపర్చారని తప్పుపట్టారు. దానిపై స్పందించిన రోశయ్య.. ‘‘నాకు కోపం వచ్చిన మాట వాస్తవమే. అసెంబ్లీలో పరిస్థితి, టీడీపీ వాళ్ల తీరు చూసి ఈ సభకు ఏం ఖర్మ పట్టిందన్న ఆవేదనతో కోపం వచ్చింది. అయినా ఎన్టీఆర్‌ను చంద్రబాబు, టీడీపీ ఎంతగా గౌరవించారో అందరికీ తెలుసు’’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

మంచి అల్లుళ్లను ఇవ్వలేదు ఏం చేస్తాం..?
2004–09 మధ్య రోశయ్య ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అల్లుడు ఏదో విషయంలో పోలీసులకు దొరికిపోయాడంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట పాటు అసెంబ్లీలో నానాయాగీ చేశారు. అంతసేపూ నిశ్శబ్దంగా ఉన్న రోశయ్య నెమ్మదిగా లేచి..‘‘అధ్యక్షా.. ఏం చేస్తాం.. ఆ భగవంతుడు నాకు, ఎన్టీ రామారావుకు మంచి అల్లుళ్లను ఇవ్వలేదు’’ అని చురక వేశారు. ఆ దెబ్బకు తెలుగుదేశం శిబిరం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.

ఆయన వైఎస్‌ కాదు.. ఓ యస్‌
వైఎస్‌ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రోశయ్య దగ్గరికి వచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం వైఎస్సార్‌ హామీ ఇచ్చారని వారు రోశయ్యకు చెప్పగా.. ‘‘ఆయన ఇస్తారండి.. ఆయన వైఎస్‌ కాదు.. ఓయస్‌.. ఎవరైనా ఏదైనా కావాలని వెళితే ఆయన కాదనరు. ఆయన ఇచ్చే హామీలను అమలు చేసేందుకు నా తలప్రాణం తోకకు వస్తోంది..’’ అంటూ చిరుకోపం ప్రదర్శించారు. ఆ తర్వాత ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారు.

వెన్నుపోటు పొడిచేవాడ్ని మరి..
మరోసారి రోశయ్య తెలివితేటలు సరిగా లేవంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. దానిపై రోశయ్య స్పందిస్తూ.. ‘‘నాకు తెలివితేటలుంటే ఇలా ఉంటానా? నన్ను నమ్మిన రాజశేఖరరెడ్డిని ఎప్పుడో ఒంటరిగా కూర్చున్నప్పుడు వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కేవాడిని.. అంతకుముందు చెన్నారెడ్డిని, విజయభాస్కర్‌రెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచేవాడిని..’’ అంటూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు ఘటనను గుర్తుచేశారు. దీంతో చంద్రబాబు అవాక్కై కిమ్మనకుండా కూర్చుండిపోయారు. 

మరిన్ని వార్తలు