రాముడు మెచ్చిన ఆ పండు గురించి తెలుసా..?

23 May, 2021 13:02 IST|Sakshi

కడప కోటిరెడ్డి సర్కిల్‌: నల్లగా నిగనిగ మెరుస్తూ వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే నేరేడు పండ్ల అమ్మకాలు నగరంలో జోరందుకున్నాయి. మార్కెట్లో కాలానుగుణంగా వచ్చే పండ్లు రుచితోపాటు ఆరోగ్యాన్నిస్తాయి. అలాంటి వాటిలో అల్లనేరేడు ఒకటి. జూన్‌ నెల ఆరంభంలో అల్లనేరేడు పంట చేతి కొస్తుంది. ఈ సీజన్‌లో విరివిగా దొరికే ఈ పండ్లను రుచి చూడని వారంటూ ఉండరు. అందుకే మార్కెట్లో కనబడగానే వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. మార్కెట్లో ఇప్పుడు అల్లనేరేడు పండ్లు విరివిగా అమ్ముడవుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి నేరేడు పండ్లు దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి రావడంతో పండ్ల వ్యాపారులు వీటిని కిలో రూ. 100 నుంచి రూ.200 అమ్ముతున్నారు.

రాముడు మెచ్చిన పండు
రామాయణంలో శ్రీరాముడు 14ఏళ్లు వనవాసం చేసినప్పుడు ఎక్కువ భాగం ఈ పండ్లను తిని కాలం గడిపారని పెద్దలు చెబుతారు. అందుకనే భారత దేశంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ప్రాంతాల్లో దీనిని దేవతాఫలంగా భావిస్తారు. ఆయుర్వేదంలో ఈపండును అపర సంజీవని పిలుస్తారు. ఈ పండులో విటమిన్‌ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్లు బెరడు ఔషధ తయారీలో వాడుతారు. ఈ నేరేడు చెట్టు కాయల నుంచి వెనిగర్‌ను తయారు చేస్తారు. జ్ఞాపకశక్తి మెరుగు పరచుకోవాలంటే నేరేడు పండు తినమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, నోటిపూత, చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం, మూత్రంలో మంట తదితర సమస్యలకు నేరేడు పండ్లు చక్కని ఔషధంగా పనిచేస్తాయి.

అపర సంజీవని
నేరేడు పండులోని అనేక సుగుణాలు అన్ని వయస్సుల వారికి ఉపయోగకారిగా పని చేస్తాయి. యాంటి ఆక్సిడెంట్లు విరివిగా లభించడంతో వీటిని తినడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి పోతాయి. ఇవి ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది. కిడ్ని రాళ్లతో బాధపడే వారు. నిత్యం నేరేడు పండ్లు తినడం వలన రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటికి వస్తాయి. అందుకే దీని ఔషధాల గనిగా పేర్కొంటారు.
–డాక్టర్‌ రామాంజులరెడ్డి, గుండె వైద్య నిపుణులు, కడప 

చదవండి: ఆదివారమొస్తే చాలు.. అసలు ఆ కథేంటి..?
కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్‌

మరిన్ని వార్తలు