వేంగి ప్రాభవం.. హేలాపురి వైభవం 

19 Sep, 2020 09:33 IST|Sakshi
బ్రిటీష్‌ కాలం నాటి కలెక్టర్‌ కార్యాలయం- మోతేవారి జమిందారీ భవనం-వేంగీ చక్రవర్తులు నిర్మించిన శనివారపుపేట గాలిగోపురం

బ్రిటీష్‌ హయాంలోనూ అనేక నిర్మాణాలు 

ఇప్పటికీ చెక్కుచెదరని రీతిలో భవనాలు

ఏలూరు (టూటౌన్‌): వేంగి రాజుల పాలనలో హేలాపురిగా పిలువబడిన ఏలూరులో పలు చారిత్రాత్మక కట్టడాలు నేటికీ ఆ సామ్రాజ్య ప్రాభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అప్పట్లో ఈ నగరంలో రత్నాలు రాశులు పోసి అమ్మేవారని ప్రతీతి. చుట్టూ ఏరులతో ఏరుల ఊరుగా కూడా ఈ నగరాన్ని గతంలో పిలిచేవారు. ఈ ప్రాంతంలో రాజుల కాలం నుంచి బ్రిటీష్‌ హయాం వరకూ, జమిందారీల కాలం వరకూ ఎన్నో అపురూప కట్టడాలు హేలాపురిలో వెలిశాయి. నాటి చరిత్రకు ఆనవాళ్లుగా ఈ కట్టడాలు నేటికీ చెక్కుచెదకుండా నిలిచి వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి.

వీటిలో ఎంతో విశిష్టత ఉన్న కట్టడాలతో పాటు దేవాలయాలు ఉండటం విశేషం. వేంగీ రాజుల కాలంలో 1104 సంవత్సరంలో నిర్మించిన పడమర వీధిలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం, శనివారపుపేటలోని చెన్నకేశవస్వామి దేవాలయ గోపురం, దొంగల మండపం, కోటదిబ్బలో ఉన్న శాసనాలు నేటికీ చెక్కుచెదరలేదు. బ్రిటీష్‌ హయాంలో నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌ భవనం, నాటి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిర్మించిన సరీ్వసు రిజర్వాయరు, మున్సిపల్‌ పాత కార్యాలయం, జిల్లా విద్యాశాఖ పాత కార్యాలయాలు నాటి చరిత్రకు గుర్తులుగా మిగిలాయి. వీటితో పాటు నాటి హేలాపురిలో ఉండే జమిందారీ మహల్స్, ఇతర భవనాలు దర్శనమిస్తున్నాయి. ఈ కట్టడాలను చూసినప్పుడు నేటి తరం ప్రజలు హేలాపురికి ఇంతటి ఘనచరిత్ర ఉందా అంటూ చర్చించుకోవడం పరిపాటిగా మారింది. ఏది ఏమైనప్పటికీ అలనాటి చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్న ఈ కట్టడాలను సంరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

బ్రిటీష్‌ కాలం నాటి మున్సిపల్‌ కార్యాలయం - అప్పటి జమిందారీ మహల్‌ - బ్రిటీష్‌ కాలం నాటి పాత డీఈఓ కార్యాలయం - దొంగల మండపం  


 

మరిన్ని వార్తలు