అట్లతద్దోయ్‌.. ఆరట్లోయ్‌..!! 

3 Nov, 2020 09:44 IST|Sakshi

సౌభాగ్యాన్ని ప్రసాదించే అట్లతద్ది వేడుక నేడే

గ్రామాల్లో మొదలైన మహిళల సందడి 

కోడూరు, భట్టిప్రోలు: మన తెలుగు సంప్రదాయంలో మహిళలు సౌభ్యాగాన్ని ప్రసాదించాలంటూ అనేక వ్రతాలు, నోములు ఆచరించడం మనకు తెలిసిందే. అయితే ప్రతి ఏటా విజయదశమి తరువాత వచ్చే ఆశ్వయుజ బహుళ తదియనాడు జరుపుకొనే ‘అట్లతది’ పండుగకు మాత్రం ప్రత్యేక విశిష్టత ఉంది. తమతో పాటు కుటుంబమంతా సిరిసంపదలతో వర్థిల్లాలంటూ ఈ పర్వదినం నాడు గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహిళలంతా గౌరీదేవి వ్రతాన్ని నిర్వహించి, చంద్రోదయ వేళ అట్లను నైవేద్యంగా సమర్పించి, ముతైదువులకు వాయనాలను అందిస్తారు. పరమశివుని పతిగా చేసుకొనేందుకు నారదముని సలహా మేరకు గౌరీదేవి తొలిసారి ఈ వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. చంద్రకళల్లో కొలువైవున్న శక్తి అనుగ్రహంతో స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రాలు కూడా చెప్పుతున్నాయి.  

అట్లుకు ప్రత్యేక స్థానం  
అట్లతద్ది నాడు అట్లుకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు. మన ఇళ్లల్లో అట్లు తయారీకి మినుములు, బియ్యాన్ని ఉపయోగించడం చూస్తాం. దీనికి కూడా పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. ఈ ధాన్యాలతో చేసే అట్లను నైవేద్యంగా పెట్టి, వాయనాలను దానంగా ఇవ్వడం వల్ల గర్భదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.. నవగ్రహాల్లో కుజునికి ‘అట్లు’ అంటే మహాప్రీతి అని, వీటిని నైవేద్యంగా సమర్పిస్తే కుజదోషం పోయి వివాహ బంధానికి ఎలాంటి అడ్డంకులు రావని పెద్దల మాట. మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ గ్రామాల్లో మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకొనే పండుగల్లో అట్లతద్ది ఒకటి. (చదవండి: ఇక ఉత్తరాంధ్రలో గోదారి 'గలగల')


ఈ పండుగకు ప్రతి మహిళ తమ అరచేతుల్లో గోరింటాకు పెట్టుకొని అమితానందాన్ని పొందుతారు. కుటుంబంలో ఎవరి చేయి బాగా పండితే వారు అదృష్టవంతులని విశ్వసిస్తారు. అట్లతద్ది రోజున మహిళలు సూర్యోదయానికి ముందే స్నానపానీయాలు ముగించుకొని, గోంగూర పచ్చడి, పెరుగుతో భోజనం చేస్తారు. అనంతరం వీధిలో ఒక చోట ఉయ్యాల ఏర్పాటు చేసి ‘అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌.. ముద్దపప్పు మూడట్లోయ్‌..’ అంటూ ఆటపాటలతో సరదగా గడుపుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. సాయంత్రం చంద్రోదయం తరువాత మళ్లీ ముత్తయిదువులకు 11 అట్లను వాయనంగా అందించి, పండుగను ముగిస్తారు. ఏదేమైనా అట్లతద్ది పండుగను మంగళవారం జరుపుకొనేందుకు ప్రతి ఇంటి వద్ద మహిళలు ఏర్పాట్లను పూర్తి చేశారు. (చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు ‌గుడ్‌ న్యూస్‌)

మరిన్ని వార్తలు