కోళ్లయందు ‘కడక్‌నాథ్’‌ వేరయా..! 

21 Mar, 2021 13:10 IST|Sakshi

సిక్కోలు నోరూరిస్తున్న బ్లాక్‌ బ్యూటీ

రాజాం తదితర ప్రాంతాల్లో లభ్యమవుతున్న కడక్‌ నాథ్‌ కోళ్లు

మెండుగా ఔషధ గుణాలు

కిలో రూ.800 పైనే   

రాజాం సిటీ: చర్మం నలుపు, మాంసం నలుపు, ముక్కు, గోళ్లు, ఎముకలు.. ఆఖరకు నాలుక కూడా నలుపే. ఈ నలుపే ఇప్పుడు జిల్లా వాసుల మనసు గెలుచుకుంటోంది. కొత్త రుచుల అన్వేషణలో మాంసం ప్రియులకు దొరికిన మేలుజాతి వజ్రం కడక్‌నాథ్‌ కోళ్లు. దండిగా పోషకాలు, మెండుగా ఔషధ గుణాలు కలిగిన ఈ కోడి రాజాం తదితర  ప్రాంతాల్లో కొక్కొరొక్కో అంటోంది. మటన్‌తో సమానంగా దీని మాంసం ధర పలుకుతున్నా.. ఫర్లేదండి అంటూ జిల్లావాసులు ఇష్టంగా లాగించేస్తున్నారు. కోళ్లయందు కడక్‌నాథ్‌లు వేరయా అనిపించుకుంటున్న ఈ బ్రీడ్‌ గురించి తెలుసుకుంటే..

మొత్తం నలుపే.. 
కడక్‌నాథ్‌ కోళ్లు కొత్తవేం కావు. పేపర్లు, సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వారికి ఇవి బాగా తెలుసు. అయితే సిక్కోలులో లభ్యం కావడం మాత్రం కొత్తే. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్‌ వంటి ప్రాంతాల్లో చాలా కాలంగా ఈ కోడి రుచులు పంచుతోంది. ఆయా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి. సాధారణంగా కోళ్లులో బొచ్చు రంగు రంగులుగా ఉన్నప్పటికీ మాంసం మాత్రం ఎరుపుగానే ఉంటుంది. ఈ కడక్‌నాథ్‌ కోళ్లు మాత్రం బొచ్చుతోపాటు చర్మం, ముక్కు, గోళ్లు, ఎముక లు, చివరికి నాలుక కూడా నలుపుగానే ఉంటుంది. ఈ కోళ్లను మాంసం కోసం పెంపకం చేపడుతుంటారు. వీటి గుడ్లు కాఫీకలర్‌తోపాటు కొంత పింక్‌ కలర్‌లో ఉంటాయని కోళ్ల ఫారం యజమానులు చెబుతున్నారు.

పోషక విలువలు భేష్‌  
కడక్‌నాథ్‌ కోళ్లలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కొవ్వు, కొలె్రస్టాల్‌ శాతం తక్కువగా ఉంటాయి. దీని మాంసం తింటే ఊబకాయం రాదు. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెంచడమే కాకుండా శ్వాస సంబంధమైన ఆస్తమా వంటి రోగాలను కూడా నియంత్రిస్తుంది. పురిటి నొప్పులు తగ్గించడంలోనూ మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుందనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రయోజనాలతోపాటు మంచి రుచిగా ఉండడంతోపాటు కడక్‌నాథ్‌ చికెన్‌ ధర రూ. 800లు వరకు పలుకుతోంది.

తేడా ఇదే.. 
కడక్‌నాథ్‌ కోళ్లు మంచి బరువు తూగేందుకు 8 నెలల సమయం పడుతుంది. సాధారణంగా మార్కెట్‌లో లభించే బ్రాయిలర్‌ కోళ్లు 45 రోజుల్లోనే ఒకింత బరువు పెరుగుతాయి. ఇక్కడే సాధారణ కోడికి, కడక్‌నాథ్‌ కోడికి తేడా ఉంది. కడక్‌నాథ్‌ కోళ్లలో క్వాలిటీ ఉంటుంది. వీటి పెంపకం నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. అందుకే దీని ధర అధికంగా ఉంటుందని పెంపకందారులు చెబుతున్నారు.

రుచి బాగుంది... 
ఈ ప్రాంతంలో కడక్‌నాథ్‌ కోళ్లు విక్రయిస్తున్నారని తెలుసుకుని వచ్చాం. నాటు కోడి మాంసం కంటే చాలా బాగుంది. ఈ మాంసం తిన్న తర్వాత బ్రాయిలర్‌ కోడి మాంసం తినాలనిపించడంలేదు. కోడితోపాటు మాంసం కూడా నలుపురంగులో ఉండడంతో ఎలా ఉంటుందో అని అనుకున్నాం. కానీ వంటకం తర్వాత దాని రుచి చాలా బాగుంది. ఇప్పుడు వారంలో ఓ సారి ఈ మాంసం మాత్రమే తింటున్నాం. 
– ఆర్‌.తిరుపతిరావు, జి.నారాయణరావు, మాంసం ప్రియులు

డిమాండ్‌ ఉంది 
రాజాం ప్రాంతంలో ఎక్కువగా బ్రాయిలర్‌ ఫారాలు మాత్రమే ఉన్నాయి. వీటికి భిన్నంగా ఏదైనా వ్యాపారం చేయాలని నాటుకోళ్లఫారం పెట్టాను. మొదటిసారిగా నా స్నేహితుల ద్వారా కడక్‌నాథ్‌ కోళ్లు గురించి విన్నాను చిన్న పిల్లలను కొనుగోలు చేసి పెంపకం చేపట్టాను. మా ఫారంలో ఉన్నాయని తెలుసుకుని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫారంలో నాటుకోళ్లుతోపాటు వీటిని పెంచు తున్నా. నాటుకోళ్ల కంటే కడక్‌నాథ్‌ కోళ్లకు మంచి డిమాండ్‌ ఉంది.  
– ఎస్‌.చిన్నబాబు, ఎస్‌ఆర్‌ఎన్‌ కోళ్లఫారం యజమాని, పొనుగుటివలస, రాజాం

బలవర్ధకమైన ఆహారం 
ప్రస్తుతం మార్కెట్‌లో లభించే బ్రాయిలర్, నాటు కోళ్ల కంటే కడక్‌నాథ్‌ కోడి మాంసం బలవర్ధకమైన ఆహారం. మిగతా వాటి కంటే కొవ్వు శాతం తక్కువగా ఉండడంతోపాటు ప్రోటీన్ల శాతం అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మాంసకృత్తులు లభిస్తాయి. ఈ మాంసం తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఇటు వినియోగదారులకు, అటు వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. 
– డాక్టర్‌ శివ్వాల మన్మథరావు, ఏడీ, పశుసంవర్ధకశాఖ, రాజాం
చదవండి:
‘నాన్నా.. నా మనసేమీ బాలేదు’  
హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం

మరిన్ని వార్తలు