వినరా వీధి కథ.. కడప కహానీ ఘన చరితం

13 Sep, 2020 11:04 IST|Sakshi

పేర్ల వెనుక ఆసక్తిదాయక కథనం

కడప సెవెన్‌రోడ్స్‌/కార్పొరేషన్‌: ప్రతి మనిషికి ఓ పేరు ఉన్నట్లే ప్రతి ఊరికి ఓ పేరు ఉంటుంది. ఆ ఊరిలోని ప్రాంతాలకు, వీధులకు సైతం పేర్లు ఉంటాయి. వాటి వెనుక ఓ కథ, ఓ చరిత్ర ఉంటాయి. అలాగే కడప కూడా. ఇప్పుడున్న కడప పేరు ఎలా వచ్చిందన్న విషయంలో అనేక కథనాలు ప్రచారం ఉన్నాయి. ఒకప్పుడు గోల్కొండ ఆర్మీ కమాండర్‌ నేక్‌నామ్‌ ఖాన్‌ ఏర్పాటు చేసిన నేక్‌నామాబాద్‌ క్రమంగా అభివృద్ధి చెందుతూ కడప షహర్‌(పట్టణం)గా రూపొందింది. ఇందులో ఒక్కో పాలకుని హయాంలో ఒక్కో పేట, ఒక్కో ప్రాంతం ఏర్పాటై  అభివృద్ధి చెందుతూ వచ్చాయి. నగర ప్రజలు ఇప్పటికీ ఆ ప్రాంతాలను, వీధులను ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. వీటిలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, వీధుల పేర్లు.. వాటి వెనుక ఉన్న చరిత్ర సాక్షి పాఠకుల కోసం.. (చదవండి: మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు నిధుల విడుదల)

క్రిష్టియన్‌ లేన్‌
కడప పాతరిమ్స్‌ వద్ద ఉన్న కాంగ్రిగేషనల్‌ చర్చి నుంచి ఎన్‌టీఆర్‌ విగ్రహం వరకూ ఉన్న వీధిని క్రిష్టియన్‌ లేన్‌గా పిలుస్తున్నాము. బ్రిటీషు వారి హయాంలో క్రైస్తవ మత వ్యాప్తి క్రమంలో ఈ పేట ఏర్పాటు చేశారు. 1822లోలండన్‌ మిషన్‌ కేంద్రం ఏర్పాటైంది. బళ్లారికి చెందిన జె. హ్యాండ్స్‌ అనే మిషనరీ అప్పుడప్పుడు వచ్చి క్రీస్తు బోధనలు చేసి వెళ్లేవారు. కడపలో ప్రత్యేకంగా ఒక మిషనరీని నియమిస్తేనే తాము చందాలు ఇస్తామని సివిల్‌ ఉద్యోగులు స్పష్టం చేయడంతో మిషన్‌ డైరెక్టర్లు రెవరెండ్‌ విలియమ్‌ హావెల్‌ను కడపకు పంపారు. ఆయన సుమారు ఇరవై ఏళ్లు కడపలో ఉండి మత వ్యాప్తికి కృషి చేశారు. క్రైస్తవులకు భూములు ఇప్పిండంతోపాటు, కాగితాలు తయారు చేసే యంత్రాన్ని తెప్పించి స్వతంత్ర జీవనోపాధికి ఆస్కారం కలి్పంచారు. కైస్తవులకు ఇళ్లు కట్టించి ఒక క్రైస్తవ పేటను అభివృద్ధి చేశారు. అదే నేటి క్రిషి్ణయన్‌ లేన్‌.

చిన్నచౌకు
నంద్యాల ఓబులరాజు కాలంలో గంగులు, మరికొందరు గాండ్ల కులానికి చెందిన వారు దీన్ని కట్టించారు. వర్తకులు ఇతర ప్రాంతాల నుంచి కడప షహర్‌కు వచ్చేవారు. ఇక్కడ దిగి ఇళ్లు నిర్మించుకున్నారు. కనుక చౌక్‌ అని పేరు వచ్చింది. (చదవండి: ‘కష్ట సమయంలోనూ మాట నిలుపుకున్నారు’)

మృత్యుంజయకుంట
నంద్యాల ఓబులరాజు కాలంలో కొండసాని ఓబయ్య అనే వ్యక్తి నాలుగు ఇండ్లు నిర్మించుకొని కొండసాని ఓబయ్య పల్లె అని పేరు పెట్టుకున్నాడు. ఆ ఇండ్లు అగి్నప్రమాదంలో దగ్దమయ్యాయి. ఆ తర్వాత మయానా హలీంఖాన్‌ పాలన చేసే రోజుల్లో మృత్యుజాఖాన్‌ అనే జమీందారుకు ఆ ప్రాంతాన్ని జాగీరుగా ఇచ్చాడు. అతడు అంతకుముందు పల్లె నిర్మించిన కొండసాని ఓబయ్యతోపాటు మరికొంతమంది రైతులను పిలిపించుకొని భూమిని కౌలుకు ఇచ్చి పల్లె కట్టించాడు. తన పేరుతో మృత్యుజాపల్లె అని నామకరణం చేశాడు. ఆ ప్రాంతమే నేడు కాలక్రమంలో మృత్యుంజయకుంటగా మారింది.

భుజంగరావు వీధి
నగరంలోని బ్రాహ్మణ వీధి ప్రాంతంలో భుజంగ రావు వీధి ఉంది. దివాన్‌ రావు బహదూర్‌ తాడిమర్రి భుజంగరావు అనే వ్యక్తి జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆయన మహరాష్ట్రకు చెందిన సంత్‌ రామదాస్‌ పరంపర నుంచి వచ్చారని చెబుతారు. వీరిని దేశస్తులు అని పిలిచేవారు. ఆయనకు సంతానం లేరు. గండి ఆంజనేయస్వామి ఆలయం వద్ద తన స్వంత డబ్బుతో సత్రాలు నిర్మించారు. ఒకప్పటి కడప ప్రభుత్వ ఆసుపత్రిలో మెటరి్నటి వార్డు నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. అలాగే ఫర్నీచర్‌ వంటివి ఆసుపత్రికి ఇచ్చారు. ఆయన నివసించిన వీధిని భుజంగరావు వీధి అని నేటికీ పిలుస్తున్నారు. 

సాయిపేట
మయానా అబ్దుల్‌ మహ్మద్‌ఖాన్‌(గుడ్డి నవాబు) కాలంలో శాయి పంతులు అనే ఉద్యోగి అక్కడ ఇండ్లు నిర్మించున్నాడు. క్రమంగా ఆయన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. దీంతో అది కడప షహర్‌లో ఒక పేటగా తయారైంది. దానికి ఆయన పేరు పెట్టుకున్నారు.

ఉక్కాయపల్లె
సంబెట నలకంపరాజు మేనల్లుడు ఉక్కరాజు అనే వ్యక్తి తన పేరిట ఈ పల్లెను కట్టించాడు. ఈ పల్లె పాతకడపకు తూర్పు వైపు ఉంది. ఆ ఊరికి జాడ్యం సంభవించగా ఆ ఉపద్రవానికి ప్రజలు భయపడ్డారు. అక్కడున్న కాపులు కొంతకాలం పాతకడపలో తలదాచుకున్నారు. మయానా అబ్దుల్‌ నబీఖాన్‌ పాలనా కాలంలో ఆ రైతులు తిరిగి ఉక్కాయపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. ఉక్కరాజు నిర్మించిన పల్లె గనుక దానికి ఉక్కాయపల్లె అనే పేరు స్థిరపడింది.

వైవీ స్ట్రీట్‌..
కడప నగరంలో ఈ వీధి నిత్యం రద్దీగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలతోపాటు కూరగాయల మార్కెట్‌ ఉంది. ఎన్నో బంగారు నగల దుకాణాలు ఇక్కడ ఉన్నాయి. ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువు ఇక్కడ లభిస్తుంది. కడపను నవాబులు పాలిస్తున్న కాలం నుంచి ఈ వీధి వ్యాపార కేంద్రంగా ఉంటూ వస్తోంది. యాదాళ్ల వెంకటాచలం అనే ఆర్యవైశ్య ప్రముఖుడు ఈ వీధిని అభివృద్ధి చేశారని చెబుతారు. ఆయన పేరుతోనే ఈ వీధి స్థిరపడింది.

ఫక్కీరుపల్లె
దావూద్‌ఖాన్‌ రోజుల్లో పాతకడప రెడ్లు కాల్వ పుత్తారెడ్డి, వున్నయ్య అనే వారు కొందరు రైతులను కలుపుకొని ఈ ప్రాంతంలో బావి తవి్వంచి ఊరు కట్టించారు. వున్నయ్య పేరుతో ఊరును పిలుస్తుండేవారు. మయానా అబ్దుల్‌ హలీంఖాన్‌ పాలనాకాలంలో బాకరా పంతులు వంశీయుడైన శివరాయుడుకు ఈ ప్రాంతం దక్కింది. ఆ భూమిలో కొంత బ్రాహ్మణులకు ఇచ్చి, కొంత తాను ఉంచుకున్నాడు. దీంతో ఆ గ్రామానికి శివపురం అని పేరు పెట్టారు. కొన్నిరోజులకు గ్రామం పాడైంది. శివరాయుడు తన భూమిని ఫక్కీరు సాహెబ్‌కు అమ్మేశాడు. ఆ ఫక్కీరు గ్రామాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఫక్కీరు పల్లె అని పేరు వచ్చింది.

బుడ్డాయపల్లె
నంద్యాల ఓబుల రాజు పాలనా కాలంలో ఈ  ప్రాంతం అడవిగా ఉండేది. చింతకుంట బుడ్డయ్య అనే వ్యక్తి ఈ అడవిని కొట్టించి ఒక పల్లె నిర్మించాడు. ఆ పల్లెకు తన పేరు పెట్టుకున్నాడు. అదే నేడు బుడ్డాయపల్లెగా పిలువబడుతోంది.

కొండాయపల్లె
నంద్యాల ఓబుల రాజు పాలన కాలంలో కమ్మ అనుసుర్ల కొండయ్య అనే బ్రాహ్మణుడు ఉద్యోగం చేసేవాడు. అక్కడ ఒక బావిని తవి్వంచి గ్రామాన్ని కట్టించాడు. ఆయన పేరుతో ఈ ప్రాంతాన్ని కొండాయపల్లెగా పిలుస్తున్నారు.

కోట గడ్డ వీధి
కడప నగరంలో ఇప్పుడున్న కళాక్షేత్రం, పాత జైలు, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయ ప్రాంతమంతా ఒకప్పుడు నవాబులు నిర్మించిన కోట. ఇప్పటికీ ఈ వీధిని కోట గడ్డ వీధి అని పిలుస్తారు. నవాబుల పాలనలో ఈ వీధిలో బంగారు ఆభరణాలు, అత్తర్లు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, అలంకరణకు సంబంధించిన వివి«ధ వస్తువులు ఈ వీధిలో విక్రయించేవారు. అప్పట్లో ఈ వీధిని ‘మీనా బజార్‌’గా పిలిచేవారని చెబుతారు.

బచ్చేరావువీధి
కర్ణాటక నవాబులైన హైదర్‌ అలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్‌ ఆస్థానంలో మంత్రిగా పనిచేసిన పూర్ణయ్యపంతులు వద్ద బచ్చేరావు శిక్షణ పొందారు. టిప్పు సుల్తాన్‌ పాలనలో భూమి శిస్తు వ్యవహారాల విభాగంలో హెడ్‌ క్లర్క్‌గా పనిచేశారు. దత్త మండలం (ఇప్పటి రాయలసీమ, బళ్లారి జిల్లాలు) ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది. 1800 సంవత్సరం నవంబరు 1వ తేది తొలి ప్రిన్సిపల్‌ కలెక్టర్‌గా లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ థామస్‌ మన్రో బాధ్యతలు చేపట్టారు. సమర్థునిగా, విధేయునిగా పేరున్న బచ్చేరావును మన్రో ఏరి కోరి తన కచేరీకి తెచ్చుకున్నారు. ఆయనను హుజూర్‌ శిరస్థదార్‌గా నియమించారు. కలెక్టర్‌ కార్యాలయంలో సిబ్బంది వ్యవహారాలు, పర్యవేక్షణ, పాలనా వ్యవహారాల నివేదికల పరిశీలన బాధ్యతలను నిర్వర్తించే అడ్మిని్రస్టేటివ్‌ ఆఫీసర్‌ను అప్పట్లో హుజూర్‌ శిరస్థదార్‌ అని పిలిచేవారు.  బచ్చేరావుకు ఆనాటి ప్రభుత్వం రూ. 700 జీతం ఇస్తుండేది. ఇంత అత్యధిక జీతం పొందిన ఉద్యోగులు ఆంగ్లేతరుల్లో మరొకరు లేరు.   బచ్చేరావు కడప నగరంలో నివాసం ఉండేవారని తెలుస్తోంది. అందుకే ఆయన గౌరవార్థం ఆ  వీ«ధికి బచ్చేరావువీధిగా నామకరణం చేశారు.

కడప షహర్‌లోని పేటల వివరాలు..
నవాబులు పాలించిన రోజుల్లో కడప షహర్‌లో వివిధ పేటలను నిర్మించారు. దర్గాబజార్‌ను మయానా అబ్దుల్‌ నబీఖాన్‌ కాలంలో బీబీ సాహెబ్‌ కట్టించారు. నిజామ్‌ అలీఖాన్‌ కాలంలో హఫీజ్‌ కడప సుబేదారు ఫరీద్‌ నగర్‌ను నిర్మించారు. మోచామియ్య సతీమణి మా సాహెబ్‌ నిర్మించిన పేట మాసాపేటగా మారింది. మోచామియ్య రోజుల్లోనే గుంత బజార్‌ నిర్మించారు. గుడ్డి నవాబు రోజుల్లో సంఘం పేట నిర్మించగా బస్తీగా మారింది. అబ్దుల్‌ నబీఖాన్‌ రోజుల్లో నకాసా బజార్‌ నిర్మించారు. అదే నేటి నకా‹Ùగా పిలువబడుతోంది. ఈయన కాలంలోనే అల్మాస్‌పేట కూడా నిర్మించారు.  

మరిన్ని వార్తలు