దివికేగిన కలువకొలను

26 Aug, 2020 10:33 IST|Sakshi

సీమ సాహితీ రత్నం.. కథల కలువ.. తొలితరం రచయిత.. కథా చక్రవర్తి.. కలువకొలను సదానంద మృతి సాహితీ లోకానికి తీరనిలోటు. ఆయనతో అనుబంధం ఉన్న పలువురు కవులు, రచయితలు సదానందం మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

సాక్షి, తిరుపతి : కలువకొలను సదానంద పరిచయం అక్కర్లేని పేరు. జిల్లాకు చెందిన తొలితరం రచయితల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. 1939లో చిత్తూరు జిల్లా పాకాలలో నాగమ్మ, కృష్ణయ్య దంపతులకు ఆయన జన్మించారు. బాల్యంలో నిరుపేద జీవితం గడిపిన సదానంద సునిశిత దృష్టితో సమాజాన్ని అధ్యయనం చేశారు. ఆయన రచనల్లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 1958లో ఆయన తొలి కథానిక “రచన్ఙ ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. తర్వాత కాలంలో తెలుగు స్వతంత్ర, సైనిక సమాచార్, జయంతి, స్రవంతి, ఆనందవాణి, చిత్రగుప్త, భారతి, ఆంధ్రపత్రిక ఆయన రచనలను ప్రచురించాయి. ఆయన కేవలం రచనలకు మాత్రమే పరిమితం కాకుండా కార్టూన్లు కూడా వేసేవారు.

నిజాయితీగా, వాస్తవిక ధోరణితో స్వేచ్ఛగా రచనలు చేసేవారు. అవినీతిపై సునిశిత విమర్శలు ఎక్కుపెట్టేవారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసినా అందులోనూ ప్రతిభ కనబరిచారు. 1992లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సత్కారం సైతం పొందారు. రక్తయజ్ఞం, పైరుగాలి, నవ్వే పెదవులు ఏడ్చే కళ్లు తదితర కథా సంపుటాలను రచించారు. గాడిద బ్రతుకులు, గందరగోళం, బంగారుమామ వంటి నవలలు రాశారు. ఆయన రచించిన అడవితల్లి నవలకు కేంద్రప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డును సైతం అందుకున్నారు. సాహిత్య ప్రపంచానికి విశేష సేవలందించిన సదానంద(81)మంగళవారం పరమపదించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరదని జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు ఆవేదన వెల్లడించారు.  రచయిత సదానంద మృతి బాధాకరం

తిరుపతి కల్చరల్‌ : జిల్లా కథా రచయితల్లో మొదటితరం రచయిత అయిన కలువకొలను సదానంద మృతి చెందడం బాధాకరమని, సాహిత్య లోకానికి తీరని లోటని జిల్లా రచయితల సమాఖ్య సమన్వయకర్తలు పలమనేరు బాలాజీ, సాకం నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాహితీ కృషి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అభ్యుదయ రచయితల సంఘం నాయకులు గంటా మోహన్, యువశ్రీ మురళి, నెమిలేటి కిట్టన్న బౌద్ధసంఘం నేత సహదేవ నాయుడు ఎంఆర్‌ అరుణకుమారి, రచయిత డా క్టర్‌ మౌని, పలువురు రచయితలు, కవులు, సాహితీవేత్తలు సంతాపం ప్రకటించారు. 

రాయలసీమ సాహిత్య రత్నం 
నేను కవితలు, కథలు రాయడం ప్రారంభించిన కొత్తలో(1976 ప్రాంతం) కొంతకాలం పాకాల రైల్వేకాలనీలో ఉన్నాను. అప్పుడే సదానంద నాకు పరిచయం. చాలా సార్లు కలిశాను ఆయన్ని. ఆయన ద్వారా రచనలో మెలకువలు తెలుసుకున్నాను. అంత పెద్ద రచయిత అయి కూడా ఆయన చాలా సాదా సీదాగా ఉండేవారు. అది నాకు గొప్పగా అనిపించేది. ఓ పత్రికకు ఆయన గురించి వ్యాసం రాస్తూ ‘కలువ కొలను కథల కొలను– సదానంద సదా ఆనంద’ అని పేరు పెట్టాను. ఆయన మనల్ని వదలి వెళ్లడం బాధాకరం. రాయలసీమ సాహిత్య రత్నం ఆయన.   
– డాక్టర్‌ శైలకుమార్‌ 

కథల ‘కలువ‘ రాలిపోయింది
కథాప్రక్రియలో తనకంటూ ఒక ముద్ర వేసుకుని కథల కలువలు పూయించిన కథా చక్రవర్తి కలువకొలను సదానంద. చిత్తూరు జిల్లా సాహితీవనంలో ఒక వృక్షం నేలకొరగడం భాషా సాహిత్యాలకు తీరని లోటు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నపుడు చూడడానికి కొంతమంది రచయితలు పాకాలకు వెళ్లాం. నేను ఆయన్ని చూడడం ఆ ఒకసారే. అప్పుడు మెట్లెక్కుతున్న నన్ను ‘జాగ్రత్త పేరూరు’ అన్నారు. అప్పటికి పూర్తిగా చూపు కోల్పోయిన సదానంద గారు ఏం ఆ అబ్బాయికి ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆయనతో నేను ‘నాకు పోలియో సార్‌ దివ్యాంగుడిని’ అంటే అయితే నువ్వు బాగా రాసి మంచిపేరు తెచ్చుకోవాలి నాయనా! అని చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. 
– పేరూరు బాలసుబ్రమణ్యం 

మరిన్ని వార్తలు