బాపు కల నెరవేరిందిలా..

2 Oct, 2020 10:34 IST|Sakshi
4వ వార్డులో రైస్‌ కార్డులను అందజేస్తున్న అధికారులు

సుసాధ్యమైన గ్రామ స్వరాజ్యం 

సకల సేవల వేదికలు సచివాలయాలు

ద్వితీయ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగులు

ప్రజల చెంతకు చేరిన ప్రభుత్వ సేవలు 

క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది, వలంటీర్ల కీలక పాత్ర

ఏపీలోని గ్రామ/వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంతో మంది ప్రజలకు మేలు జరుగుతోంది. త్వరగా ప్రజలకు సేవలు అందుతున్నాయి. ఈ విధానాన్ని మిగతా రాష్ట్రాలు సైతం అమలు చేస్తాయని భావిస్తున్నా..  
– ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రధాని నరేంద్ర మోదీ 

ఈ ఒక్క కితాబు చాలు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏ స్థాయిలో విజయవంతం అయ్యిందో చెప్పడానికి.. ప్రభుత్వ పాలనను ప్రతి ఇంటి ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ వ్యవస్థను యూపీఎస్సీ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఒక పాఠ్యాంశంగా చేర్చారు. కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ సచివాలయ వ్యవస్థను ప్రత్యేకంగా అభినందించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ వ్యవస్థతో జిల్లాలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ప్రభుత్వ సేవలు క్షణాల్లో ప్రజలకు అందుతున్నాయి. పాలనలో అచ్చమైన పారదర్శకత ప్రతిబింబిస్తోంది. సచివాలయం సేవల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో మహాత్ముడి స్వప్నం సాకారమైంది. ఏడాదిలో ఎన్నో విజయాలు అందుకున్న సచివాలయ వ్యవస్థ నేటి నుంచి రెండో ఏడాదిలోకి అడుగుపెడుతోంది.

సాక్షి, విశాఖపట్నం: గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏడాది పూర్తి చేసుకుని.. రెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రజా సంకల్ప యాత్రలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానన్న హామీని నెరవేర్చి.. ప్రజల ముంగిటకే సుపరిపాలనను తీసుకొచ్చారు. జిల్లాలో మొత్తం 1,341 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో సగటున మూడు వేల మందికి, ఏజెన్సీలో రెండు వేల మంది జనాభాకు ఒకటి చొప్పున 733 ఏర్పాటు చేశారు. జనాభా తక్కువగా ఉన్న చోట్ల సమీప గ్రామాలను కలిపారు. రెండు, మూడు గ్రామాలను కలిపేటప్పుడు ఆయా గ్రామాల ప్రజలకు సామీప్యత, రవాణా సదుపాయం ప్రాతిపదికగా తీసుకుని ఉమ్మడిగా, అన్నింటికీ అందుబాటులో ఉండే పెద్ద పంచాయతీని గ్రామ సచివాలయంగా ఎంపిక చేశారు. గిరిజన ప్రాంతాల్లో రెండు వేల పైబడి జనాభా ఉన్న అన్ని పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా గుర్తించారు.

తక్కువగా ఉన్నచోట్ల రెండు, మూడు చిన్న పంచాయతీలను కలిపి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. మిగతావి ఈ సచివాలయం పరిధిలోకి వచ్చినా.. పంచాయతీ స్థాయి గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం ఆయా గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేనిచోట్ల కొత్తగా భవనాలు నిర్మిస్తున్నారు. విశాఖ నగరంతో పాటు నర్సీపట్నం, యలమంచిలి పట్టణ ప్రాంతాల్లో 608 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాల్లో మంజూరు అయిన పోస్టులు 10,660.  ప్రస్తుతం 9,075 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా ఖాళీగా ఉన్న 1,585 పోస్టుల భర్తీకి ఇటీవలే పరీక్షల ప్రక్రియ ముగిసింది. ఇక గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 22,938 మంది గ్రామ, వార్డు వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. 

గడప వద్దకే సేవలు 
గ్రామ సచివాలయాల్లో 13 శాఖల ఉద్యోగులు, వార్డు సచివాలయాల్లో పది శాఖల ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలపై ఫిర్యాదులు, సంక్షేమ పథకాల కోసం ఆర్జీలు స్వీకరిస్తున్నారు. దాదాపు 592 రకాల ఎల్రక్టానిక్‌ (ఇ)–సేవలను అందించడంతో పాటు ‘స్పందన’కార్యక్రమం కూడా జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్నారు. అక్కడ అందే విజ్ఞాపనలు నిరీ్ణత కాలంలో పరిష్కారమవుతున్నాయో లేదోనని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డ్యాష్‌బోర్డు నుంచి పర్యవేక్షించడం విశేషం. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు ప్రజల గడప వద్దకే అందించాలన్న ఆయన ఆశయానికి అనుగుణంగా పనిచేయడంలో గ్రామ, వార్డు సచివాలయాలు సఫలమవుతున్నాయి. 

పారదర్శకంగా అర్హుల ఎంపిక 
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ, పేదలందరికీ ఇళ్లు, రజకులు–నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థిక సహాయం, జగనన్న ‘అమ్మ ఒడి’పథకం, బియ్యం కార్డు, వైఎస్సార్‌ పింఛను కానుక, వైఎస్సార్‌ కాపు నేస్తం, జగనన్న ‘విద్యాదీవెన’– జగనన్న ‘వసతి దీవెన’, వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌.. ఇలా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారంతో రూపొందించిన పోస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా తమకు ఏ పథకమైనా అందకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్న ‘స్పందన’లో ఫిర్యాదు చేయవచ్చు. దీన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి, దాన్ని పరిష్కరించే బాధ్యత సచివాలయ సిబ్బందికే ప్రభుత్వం అప్పగించింది. ఇలా ప్రజల నుంచి విజ్ఞాపనలు, దరఖాస్తులను స్వీకరించడం, పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేయడం వారి చెంతనే జరుగుతోంది. కేవలం ఎంపీడీవోలు, కలెక్టర్‌ పాత్ర ఆమోదముద్ర వేయడం వరకే!  

సచివాలయ సేవలకు నిదర్శనాలు..
ప్రజలకు సంబంధించిన ప్రతి డేటా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం అయ్యింది. ప్రతి ఇంట్లో సభ్యుల ప్రతి సమాచారం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయంలో సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు ఏదైనా డేటా కావాలంటే నెలలు గడిచిపోయేవి. ఇప్పుడు నిమిషాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇటీవల ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో బాధితుల సంఖ్యను సంఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే నిర్ధారించగలగడమే దీనికి నిదర్శనం. అందుకనుగుణంగా విపత్తు నిర్వహణ వ్యవస్థ విజయవంతంగా పనిచేసిన సంగతి తెలిసిందే.  ప్రతి గ్రామ, వార్డు వలంటీర్‌కు ప్రభుత్వం అన్ని ఫీచర్లున్న అత్యాధునిక మొబైల్‌ ఫోను, 4జీ సిమ్‌ ఇచ్చింది. దీంతో ప్రతి డేటాను అప్‌డేట్‌ చేయడానికి, యాప్‌ల వినియోగానికి అవకాశం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. దీంతో ప్రజలకు సేవలు అందించడం సులభమైంది.

క్షేత్రస్థాయిలో ఏ అంశంపై సర్వే అయినా సత్వరమే పూర్తవుతోంది. కోవిడ్‌–19 వ్యాప్తిని అరికట్టడంలో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఒక్కరిలో రోగ లక్షణాలు కనిపించినా నిఘా ఉంచడానికి ఒక సాధనమైంది. వారిని వెంటనే క్వారంటైన్‌ చేయడంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. ఇంటింటికీ ఆరోగ్య సర్వేను పక్కాగా నిర్వహించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే మధ్యాహా్ననికల్లా పింఛన్ల పంపిణీ ఠంచన్‌గా పూర్తవుతోంది. వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు తీసుకెళ్లి అందజేస్తున్నారు. ‘ఉపాధి’ హామీ పథకంలో చేయదగిన పనుల్లో ప్రజలకు అవసరమైన పనులను గుర్తించడంలో సచివాలయ వ్యవస్థ సక్రమ పాత్ర పోషిస్తోంది. 

అద్భుత ఆలోచన ఇది..
నా పేరు మాడుగుల అప్పారావు. మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు. తగరపువలసలో ఉంటున్న మా అబ్బాయి వద్దకు కుటుంబంతో సహా వచ్చేశాం. అయినప్పటికీ రేషన్, పెన్షన్‌ ఇక్కడే అందిస్తున్నారు. వార్డు సచివాలయాల ద్వారా తెలవారక ముందే ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. గతంలో సచివాలయాలు లేకపోవడంతో తహసీల్దార్, మండల పరిషత్, జీవీఎంసీ ఇలా పలు కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్లం. పింఛన్‌కోసం రోజుల తరబడి వేచి ఉండేవాళ్లం. ఇప్పుడు ఒకటో తేదీ వేకువజామునే పింఛన్‌ అందుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో మేలు 
జరుగుతోంది

గంటలోనే కార్డు మంజూరైంది
సచివాలయంలో దరఖాస్తు చేసిన గంటలోనే రైస్‌ కార్డు మంజూరైంది. గత ప్రభుత్వంలో రేషన్‌ కార్డు కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేశాను. అయినా కార్డు మంజూరు కాలేదు. ఇప్పుడు వలంటీర్‌ ద్వారా 11వ వార్డు పరిధి 21వ నంబర్‌ సచివాలయంలో రైస్‌ కార్డు కోసం సెప్టెంబరు 18న ఉదయం 11 గంటలకు దరఖాస్తు చేశాను. అక్కడ సిబ్బంది వెంటనే కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేశారు. చేసిన ఒక్క గంటలోనే ‘2801383138’ నంబర్‌తో రైస్‌ కార్డు మంజూరైంది. సచివాలయం వల్ల నా పని చాలా సులువుగా, తొందరగా జరిగింది.  – డి.హేమలత, సుందరయ్యనగర్‌

ఒంటరి మహిళలకు రైస్‌కార్డులు
కొమ్మాది(భీమిలి) : జీవీఎంసీ 4వ వార్డు కె.నగరపాలెం సచివాలయంలో అదే ప్రాంతానికి చెందిన ఒంటరి మహిళలు పోతిన సన్యాసమ్మ, పోతిన అప్పలనరసమ్మ గురువారం ఉదయం రైస్‌కార్డు కోసం దరఖాస్తు చేశారు. అర్హతలు పరిశీలించిన సచివాలయ అధికారులు మూడు గంటల్లోనే వారిద్దరికీ రైస్‌ కార్డులను మంజూరు చేశారు. వీరికి సచివాలయం వద్ద వీఆర్వో వీర్రాజు, కార్యదర్శి సాయికిరణ్‌ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో రేషన్‌ కార్డు కోసం ఏళ్ల తరబడి తిరిగేవాళ్లమని.. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న మూడు గంటల్లోనే కార్డులు చేతికొచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. 

రూ.10వేల పింఛన్‌ ఇస్తున్నారు
నా పేరు పరశురామ్‌ త్యాగరాజన్‌ భాస్కర్‌. బుచ్చిరాజుపాలెం. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. ప్రతి నెలా వలంటీర్‌ ఇంటి వద్దకు వచ్చి.. రూ.10 వేల పింఛన్‌ అందిస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా మా కుటుంబానికి రూ.18,750 లబ్ధి చేకూరింది. పిల్లలు విద్యా దీవెన పథకానికి అర్హత సాధించారు. ఇళ్ల పట్టా కూడా మంజూరైంది. పలు సరి్టఫికెట్లు కూడా సచివాలయం ద్వారా పొందాను. తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థ తప్పింది. సచివాలయ వ్యవస్థ ద్వారా చాలా ప్రయోజనాలు పొందాను. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా