లచ్చించారు: పేదోడి సూప్‌.. పోషకాల్లో టాప్‌

21 May, 2021 12:14 IST|Sakshi

పల్లెల్లో దూరమవుతున్న ఘుమఘుమలు

దీనికి సెంటిమెంట్‌లు ఎక్కువే!

మండపేట (తూర్పుగోదావరి జిల్లా): ఘుమఘుమలాడే లచ్చించారులో గొంగూర పచ్చడి నంచుకుంటే ఆ రోజు విందు మహా పసందే. వేడివేడి అన్నంలో లచ్చించారును కొసరి కొసరి వడ్డిస్తుంటే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. వండర్‌ఫుల్‌ సూప్‌ అని బ్రిటిష్‌ దొరల కితాబు పొందిన లచ్చించారు రుచికే కాదు ఆరోగ్యానికి దివ్య ఔషధమే. తెలుగింటి వంట లచ్చించారు ఘుమఘుమలు రానురాను కనుమరుగవుతున్నాయి. అసలు పేరు లక్ష్మీచారు అయినా వాడుకలో లచ్చించారుగా మారింది. గతంలో వేసవికాలం రాగానే పల్లెటూర్లలో దాదాపు అందరి ఇళ్లలోను లచ్చించారు కుండను ఆనవాయితీగా పెడుతుండేవారు.

మట్టికుండకు పసుపు రాసి, కుంకుమ బొట్టులు పెట్టి గదిలో ఓ మూలన ఉంచి సంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవిని పూజించేవారు. ఆరోజు నుంచి ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లను ఆ కుండలో పోసేవారు. ఇలా నాలుగు రోజుల వరకు ఉంచితే కడుగు నీళ్లు బాగా పులుస్తాయి. ఈ పులిసిన కడుగులో వంకాయలు, టమాట, బెండకాయలు, మునగకాడ, కొత్తిమీర వేసి తాలింపు పెడితే ఘుమఘుమలాడే లచ్చించారు తయారయ్యేది. కాయగూరలతో పాటు ఎండిరొయ్యల తలలు వేసి కాసిన లచ్చించారులో ఉప్పు చేప నంచుకుంటే ఆ టేస్టే వేరంటారు మాంసాహార ప్రియులు.

అతిథులు వచ్చినప్పుడు ఈ లచ్చించారు కుండ కూరై ఆపద్బాంధవుడిలా ఆదుకునేదని పెద్దలు చెబుతుంటారు. బియ్యపు కడుగులో ‘డి’ విటమిన్‌తో పాటు లచ్చించారులో ఉండే ఎన్నో బలవర్థకమైన పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నమ్మకం. ఒక ఇంటి వారు కుండ ఏర్పాటు చేసుకుంటే ఇరుగు పొరుగు ఆ కడుగు ద్రావణాన్ని తీసుకువెళ్లి లచ్చించారు కాచుకోవడం పల్లెల్లో కనిపించేది. సూప్స్, పాశ్చాత్య వంటకాల మోజులో కాలక్రమంలో సంప్రదాయబద్ధంగా వచ్చిన లచ్చించారు కనుమరుగైపోతోంది.

సెంటిమెంట్‌ల చారు
జిహ్వకు వహ్వా అనిపించే లచ్చించారుకు సెంటిమెంట్లు ఎక్కువే. దాళ్వా పంట ఇంటికి చేరగానే లక్ష్మీదేవిని పూజించి ఆ బియ్యాన్ని తీసుకుని దానిని కడగగా వచ్చిన నీటి(కడుగు)తో కుండను ప్రతిష్ఠింపచేసేవారు.

పెళ్లి జరిగిన ఇంటిలో ఆరు నెలల వరకు లచ్చించారును కాచుకునేవారు కాదు.

ఇరుగు పొరుగు వారు వచ్చి అడిగినా మంగళ, శుక్రవారాలలో లచ్చించారు కడుగును బయటకు ఇచ్చేవారు కాదు.

ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్న సందర్భంలో ఆ ఇంటికి సంప్రదాయంగా ఉంటున్న లచ్చించారు కుండ ఎవరి దక్కాలన్న విషయమై గతంలో తగవులు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. ఒక్కోసారి వేలం పాట ల ద్వారా ఉమ్మడి కుటుంబాల వారు ఈ కుండలను దక్కించుకునే వారిని పెద్దలు చెబుతుంటారు.

చదవండి: రఘురామకృష్ణరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే  
AP Budget 2021: జన సాధికార బడ్జెట్‌

మరిన్ని వార్తలు