వెదురు కంజి టేస్టే వేరబ్బా.! 

21 Aug, 2020 10:17 IST|Sakshi
వెదురు కొమ్ముల కూర.. బహుపసందు 

మన్యం స్పెషల్‌  

ముంచంగిపుట్టు(అరకు): కూరగాయల్లో ఎన్నో రకాలుంటాయి. కానీ మన్యంలో లభించే వెదురు నుంచి తీసిన చిగురు కూర రుచి వేరు అంటున్నారు గిరిజనులు. దీనిని వెదురు కొమ్ములు, వెదురు కంజి అని కూడా పిలుస్తారు. వెదురు కంజి కూర వాహ్వా.. అంటూ లొట్టలేసుకుంటున్నారు. ప్రస్తుతం మన్యంలోని మండల కేంద్రాల్లో హాట్‌ కేకుల్లా వెదురు కంజి అమ్మకాలు జరుగుతున్నాయి. అటవీ కొండ ప్రాంతాల్లో ఉన్న వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి చిగురును సేకరిస్తారు. దానిని శుభ్ర పరిచి ముక్కలుగా చేస్తారు. వాటిని గిరిజనులు మండల కేంద్రాలకు తెచ్చి వాటాల రూపంలో రూ.20 నుంచి రూ.40 లు వరకు విక్రయిస్తారు.

వెదురు కంజిల వాటా రూ.20, అమ్మకానికి సిద్ధంగా వెదురు కంజి

వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారీకి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఓ రకంగా, ఎండబెట్టి మరో విధంగా కూర తయారీకి వాడతారు. పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కూర తయారు చేసుకోవాలి. ఎండబెడితే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర వండుకోవచ్చు. వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకాలుగా కూరను తయారు చేసుకుని చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు వెదురు కంజిని బాగా కడగాలి. అప్పుడే వెదురు కంజిలో ఉండే చేదు పోతుంది. వెదురుకంజిని బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తాగితే శరీరానికి మంచి చలువ చేస్తుందని గిరిజనులు చెబుతున్నారు. మధుమేహం, కపం, మూల వ్యాధి నివారణకు ఆయుర్వేదపరంగా ఎంతో ఉపశమనం ఇస్తుంది. కడుపులో నులి పురుగును తొలగిస్తుంది. గాయం మానేందుకు వెదురు కంజిని పేస్ట్‌గా చేసి గాయంపై రాస్తారు.మారుమూల గిరిజనులు పాము, తేలు కాటుకు ఔషధంగా సైతం దీనిని వినియోగిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు