ప్లాస్మాదానం.. నిలిచే ప్రాణదీపం..

21 Aug, 2020 12:52 IST|Sakshi

కరోనానుంచి కోలుకోవడానికి ప్లాస్మా థెరపీ కీలకం 

ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకున్నవారి నుంచి సేకరణ

దాతలు ముందుకు రావాలని నిపుణుల సూచన 

ఇప్పటికే దీనిపై విస్తృత ప్రచారం 

పార్వతీపురం టౌన్‌: కరోనా రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఎక్కడో ఏదో చిన్న పొరపాటువల్ల కొందరికి అనూహ్యంగా సోకుతోంది. వారు సమయానుకూలంగా చికిత్స పొంది... కోలుకుంటే మరికొందరు రోగులు కోలుకోవడానికి తోడ్పడగలరని తెలుసా... అవును అక్షరాలా నిజం.  కరోనానుంచి కోలుకున్నవారి నుంచి సేకరించిన ప్లాస్మా క్రిటికల్‌ కండిషన్‌లో ఉన్న కరోనా రోగులకు ప్రాణం పోస్తుంది. కొత్త జీవితాన్నిస్తుంది. దీనిపై విస్తృతంగా ప్రచారం ఊపందుకుంటోంది. ప్లాస్మా దానంపై అవగాహన పెరుగుతోంది. (ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దు: ఆళ్ల నాని)

ప్లాస్మా థెరపీ అంటే ఒక వ్యక్తి వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైనపుడు వ్యాధి నిరోధక వ్యవస్థలోని అంటే రక్తంలోని బిలింఫో సైట్స్‌ కణాలు కొన్ని యాంటీ బాడీలు కొన్ని రకాల ప్రోటీన్లను విడుదల చేస్తాయి. ఇవి వైరస్‌తో పోరాడి వైరస్‌ను నాశనం చేయడంతో సహాయ పడతాయి. ఆ రోగి కోలుకున్న తరువాత కూడా రక్తంలోని యాంటీబాడీలు వైరన్‌ను  నియంత్రించడానికి సహాయ పడతాయి. వైరస్‌బారిన పడి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరించి వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తి శరీరంలోకి పంపడం ద్వారా వ్యాధిని తగ్గించే ప్రక్రియనే ప్లాస్మాథెరఫీ అంటారు. కోవిడ్‌–19నుంచి కోలుకుంటున్న వారు స్వచ్ఛందంగా ఫ్లాస్మా దానం చేసి మరొక ప్రాణం కాపాడాలని వైద్యులు కోరుతున్నారు. ప్లాస్మా దానం చేసినవారికి ప్రభుత్వం రూ.5వేలు ప్రోత్సాహకం కూడా అందస్తుండటంతో కరోనా పేషెంట్లు కోలుకుని ప్లాస్మా దాతలుగా మారుతున్నారు. తాము జీవిస్తూ మరి కొన్ని జీవితాలకు వెలుగునిస్తున్నారు.  

వెబ్‌సైట్ల ద్వారా కూడా ప్లాస్మా దానం 
కోలుకున్న పాజిటివ్‌ రోగులందరూ సానుకూల దృక్పథంతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. కోలుకున్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా డోనేట్‌ చేసేలా ఈ సైట్‌లో ఒక ప్రత్యేక సెక్షన్‌ని ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత, ఫెండ్స్‌ 2 సపోర్ట్‌ ఫౌండర్‌ షేక్‌ షరీఫ్‌ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. పాజిటివ్‌ రోగులందరూ ఈ వెబ్‌సైట్‌లో ప్లాస్మాదాతలుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన బ్లడ్‌ గ్రూపుల వారికి ప్లాస్మా దొరకడం చాలా కష్టమైన పని. ఈ సైట్‌లో కనుక పేరు నమోదు చేసుకుంటే పని సులభమవుతుంది. 2005లో షరీఫ్‌ ప్రారంభించిన ఈ సైట్‌ద్వారా కోవిడ్‌ రోగులకు ప్లాస్మా డోనేషన్‌ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కోవిడ్‌ రోగులకు, బంధువులకు ప్లాస్మా దానం ఎవరు చేస్తారు. వారి వివరాలు ఎలా సేకరించాలి. అనేదానిపై అవగాహన ఉండదు. అటువంటి వారికి ఈ సైట్‌ సహాయకారిగా ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ను వారం రోజులపాటు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ప్రస్తుతం ఈ సైట్‌లో ఆరు దేశాల నుంచి 5లక్షల మంది సాధారణ రక్తదాతలు  స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్లాస్మా దానం చేయాలనుకున్నవారు ఆండ్రాయిడ్‌ యాప్‌ ద్వారా కాని, వెబ్‌సైట్‌ ద్వారాగాని నమోదు పేరు చేసుకోవచ్చు. 

అపోహలు వద్దు..
కరోనాను జయించిన వ్యక్తులు అపోహలు వీడి ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి హానీ ఉండదు. వారు చేసే దానం వల్ల మరొకరికి కొత్త జీవితాన్ని ఇచ్చినవారవుతారు. కరోనాను జయించిన వారంతా ప్లాస్మా దానం చేయడం మంచిది. కరోనాతో తీవ్రస్థాయిలో బాధపడుతున్న వారికి మీరిచ్చిన ప్లాస్మా త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ఇది కూడా రక్తదానం లాంటిదే.
–  డా.బి.వాగ్దేవి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, పార్వతీపురం   

మరిన్ని వార్తలు