ఆన్‌లైన్‌లోనే విజ్ఞాన భాండాగారం 

11 Aug, 2020 10:30 IST|Sakshi

వెబ్‌సైట్లలో కావలసిన విజ్ఞాన పుస్తకాలు 

కరోనా వేళ కావలసినంత కాలక్షేపం 

బయటకు వెళ్లాల్సిన పనిలేకుండా దొరికే గ్రంథాలు 

విజయనగరం: కరోనా మహమ్మారి కాలు బయట పెట్టనీయడంలేదు. కాలక్షేపానికి మొబైల్‌ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. కానీ పుస్తక ప్రియులు గ్రంథాలయాలకు వెళ్లలేక ఏదో కోల్పోయినట్టు భావిస్తున్నారు. అంతేనా... పోటీపరీక్షలకోసం సన్నద్ధమయ్యే విద్యార్థులు... పాఠశాలలకు వెళ్లలేని విద్యార్థులు... వీరందరిదీ ఇదే సమస్య. వీరికోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. అందులో కావలసినన్ని పుస్తకాలను నిక్షిప్తం చేసింది. ఇంకెందుకాలస్యం... వాటినెలా వినియోగించుకోవచ్చో చూద్దాం.

మానవ వనరుల మంత్రిత్వశాఖ(ఎంహెచ్‌ఆర్డీ), జాతీయ గ్రంథాలయ సంస్థ ప్రత్యేకంగా ఎన్‌డీఎల్‌ ఇండియా (జాతీయ డిజిటల్‌ గ్రంథాలయ భారతదేశం) వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. ఇందులో పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు అవసరమైన పుస్తకాలను చదువుకోవచ్చు. సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం పుస్తకాలను కొనకుండా, గ్రంథాలయాలకు వెళ్లకుండానే ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకొని చదువుకోవచ్చు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇదెంతో ఉపయోగకరం. 

4 కోట్లకు పైగా పుస్తకాలు 
డిజిటల్‌ గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు దర్శనమిస్తాయి. తెలుగు సహా.. 12కు పైగా భాషల్లో నాలుగు కోట్లకు పైగా రకరకాల పుస్తకాలు పొందుపరిచారు. ఎందరో ప్రముఖుల కు సంబంధించిన 3 లక్షల వరకు మహానీయుల జీవిత చరిత్ర పుస్తకాలతోపాటు పోటీ పరీక్షల పుస్తకాలు, యూనివర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, సమాధాన పుస్త కాలు, కంప్యూటర్‌ సైన్స్, బీఎడ్, డీఎడ్, ఛాత్రోపాధ్యాయుల శిక్షణ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధన సంస్థలు, ప్రభుత్వరంగ పుస్తకాలతోపాటు సాహిత్య పుస్తకాలను ఇందులో చూడొచ్చు. ఆర్టికల్స్, వీడియో, ఆడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయి. 

ఎన్‌డీఎల్‌ ఇండియా మొబైల్‌యాప్‌లో...  
ఎన్‌డీఎల్‌ ఇండియా ద్వారా డిజిటల్‌ పుస్తకాలను చదువుకోవడం చాలా సులభం. గూగుల్‌లో ఎన్‌డీఎల్‌ ఆఫ్‌ ఇండియా అని టైప్‌ చేసి వెబ్‌ పేజీని ప్రారంభించాలి. అందులో ఈ–మెయిల్‌ ఐడీ సాయంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తాము చదువుతున్న విశ్వవిద్యాలయం, అవసరమైన పుస్తకాల జాబితాను ఎంపిక చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్‌ నమోదుకు ఇచ్చిన మెయిల్‌కు గ్రంథాలయం లింక్‌ వస్తుంది. అందులో క్లిక్‌ చేసి లాగిన్, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి, అంతర్జాలంలోకి వెళ్లొచ్చు. తర్వాత అవసరమైన పుస్తకాలను ఎంపిక చేసుకొని చదువుకోవచ్చు. లేదా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఎన్‌డీఎల్‌ ఇండియా అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇందులో వెబ్‌సైట్‌ మాదిరిగా కాకపోయినా, కొంచెం వేరుగా ఉంటుంది. అయినా అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఐఐటీ, జేఈఈ, గేట్‌ వంటి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం ఇందులో ప్రత్యేకంగా ఐచ్ఛికాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు