Puppetry: తోలు బొమ్మలాట.. బతుకు బొమ్మలాట

2 May, 2021 04:17 IST|Sakshi
తోలుబొమ్మలాట ప్రదర్శన

తోలు బొమ్మలాటే వారికి జీవనాధారం 

ప్రాచీన కళను బతికించేందుకు తాపత్రయం 

భావి తరాలకు పరిచయం చేయడానికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలంటున్న కళాకారులు

జీవం లేని ఆ మూగ బొమ్మలు ఎన్నో విన్యాసాలు చేస్తాయి. మరెన్నో మాటలు మాట్లాడతాయి. జీవ నిబద్ధమైన రామాయణ, మహాభారత కథలను, మానవ బతుకు చిత్రాల్లో నీతిని కళ్లెదుట ఆవిష్కరిస్తాయి. కేతిగాడు, బంగారక్క, జుట్టు పోలిగాడు రూపంలో హాస్యాన్నీ పండిస్తాయి. వీటి కదలికల వెనుక.. అవి చెప్పే ఊసుల వెనుక బయటకు కనిపించని ఓ జానపదుడి కళాత్మకత దాగి ఉంటుంది. ఆదరణ తగ్గిన ఆ కళనే నమ్ముకుని నేటికీ కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రాచీన కళను భావి తరాలకు అందించేందుకు తహతహలాడుతున్నాయి.

అద్దంకి: తోలు బొమ్మలాట అత్యంత పురాతన కళ. విలక్షణమైన ఉన్నతిని అనుభవించిన ఈ కళ భారతీయ జానపద కళా రూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొందింది. మన రాష్ట్రంలోని ప్రాచీన ఓడ రేవులైన కళింగ పట్నం, భీముని పట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపటా్నల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు ఈ కళారూపం కూడా పయనించింది. పర్షియా, టర్కీ మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించిన తోలు బొమ్మలు అక్కడ నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికాలోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీకి, అక్కడి నుంచి ఫ్రాన్స్‌లోని వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్‌ నగరాలకు వ్యాపించాయి. కాలానుగుణంగా ఆయా దేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ దీనికి మాతృక మాత్రం భారత దేశమే. ఇంతటి విశిష్టత పొందిన ఆ కళకు నేడు ఆదరణ తగ్గిపోయింది. అయినప్పటికీ తర తరాలుగా వారసత్వంగా వస్తున్న కళను కాపాడుకునేందుకు కొందరు కళాకారులు నేటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. 

మిణుకు మిణుకుమంటూనే.. 
ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తోలు బొమ్మలాట ప్రదర్శనలిచ్చే కుటుంబాలు సుమారు 500 వరకు ఉన్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో 10 కుటుంబాలు, దర్శిలో 10 కుటుంబాలు, ముండ్లమూరు మండలంలోని ఈదర, భీమవరం గ్రామాల్లో 10 కుటుంబాలు, నరసరావుపేటలోని సాతులూరులో 20 కుటుంబాలు, కోటప్పకొండలోని చీమలమర్రి, కొండమోడు వద్ద కొన్ని కుటుంబాలు ప్రాచీన కళను బతికిస్తున్నాయి. ఈ కుటుంబాలు ప్రస్తుతం వినాయక విజయం, రామాయణంలోని సుందరకాండ, మహిరావణ చరిత్ర, లక్ష్మణ స్వామి మూర్చ, రామరావణ యుద్ధం, ఇంద్రజిత్‌ యుద్దం, సీతా కల్యాణం, మహాభారతంలో పద్మవ్యూహం, విరాటపర్వం, కీచక వధ, కర్ణ, శల్య, సైంధవ, నరకాసురవధ వంటి కథలను ప్రదర్శిస్తున్నాయి. తోలు బొమ్మలాటనే నమ్ముకుని అద్దంకిలో ఉంటున్న రేఖనార్‌ కోటిలింగం కుటుంబం నేటికీ జీవనం సాగిస్తోంది. ఈ ప్రాచీన కళను భావి తరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆ కుటుంబం కోరుతోంది.

ఈ కళను వదల్లేం 
తోలు బొమ్మలాట మా తాతల నుంచి వంశపారంపర్యంగా వస్తోంది. మరో వృత్తి చేయలేం. మా తాతల తండ్రులు మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకు వలస వచ్చారు. కళలకు నిలయమైన అద్దంకిలో ఆదరించే వారు ఎక్కువగా ఉంటారని మేమిక్కడ స్థిరపడ్డాం. కుటుంబం మొత్తం కళాకారులమే. ప్రదర్శనకు అవసరమైన బొమ్మలను మేక, గొర్రె చర్మంతో మేమే తయారు చేసుకుంటాం. ఒక్కో బొమ్మ తయారీకి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. భారత, రామాయణ పాత్రలకు సంబంధించిన పాత్రల బొమ్మలను ఆకర్షణీయంగా తెరవెనుక ఆడించడానికి వీలుగా తయారు చేసుకుంటాం. వాటికి దారాలు కట్టి, రేకులకు బిగించి నటనకు అనుగుణమైన కదలికలిస్తాం. మేం బతికున్నంత కాలం ఈ కళను వదల్లేం. జీవన భృతి కోసం మా పిల్లలు ఊరూరా తిరుగుతూ బీరువాలు, సోఫాలు, గ్యాస్‌ స్టవ్‌ మరమ్మతులు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కళకు వైభవం తెచ్చేందుకు కృషి చేయాలి    
– రేఖనార్‌ కోటిలింగం, తోలు బొమ్మలాట కళాకారుడు, అద్దంకి 

మరిన్ని వార్తలు