Vijayawada Ramakrishna Mechanic Story: బెజవాడలో ఫేమస్‌.. రామకృష్ణ బుల్లెట్‌ గ్యారేజ్‌  

21 May, 2022 08:48 IST|Sakshi

 63 ఏళ్ల వయసులోనూ బుల్లెట్ల సర్వీసింగ్‌లోనే.. 

ఎందరో ప్రముఖుల బైక్‌లకు ఆయనే ‘వైద్యుడు’ 

తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, 

ఒడిశా రాష్ట్రాల నుంచి ఇక్కడికి బండ్లు 

బెజవాడలో ఫేమస్‌.. రామకృష్ణ బుల్లెట్‌ గ్యారేజ్‌  

‘వాడు నడిపే బండి రాయల్‌ ఎన్‌ఫీల్డూ.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండూ..’, ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని’.. ఇటీవల బాగా ట్రెండ్‌ అయిన ఈ పాటలు యువతనే కాదు.. వృద్ధులను సైతం ఉర్రూతలూగించాయి. బుల్లెట్టు బండిపై ఉన్న క్రేజ్‌ను రచయితలు అలా తమ పాటలలో వినియోగించుకున్నారు. గతంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌æ ఇంటిముందు ఉంటే అదో స్టేటస్‌ సింబల్‌. దానిని నడిపే వారు రాజసంగా ఫీలయ్యేవారు. మరి అలాంటి బండికి సుస్తీ చేస్తే.. అదేనండి రిపేరు వస్తే! వాటి యజమానులకు ఠక్కున గుర్తుకొచ్చేది బెజవాడ రామకృష్ణ పేరే. ఆయన తర్వాతే మరే మెకానిక్‌ అయినా. ఒకటి కాదు, రెండు కాదు ఐదు దశాబ్దాలకు పైగా ‘బుల్లెట్‌ డాక్టర్‌’గా ఎన్నో బండ్లకు కొత్త ఊపిరి పోశారు.  

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): బందరు లాకుల సెంటర్‌.. రోడ్డు పక్కన రెండు గదులుండే చిన్నపాటి రేకుల షెడ్డు.. దాని       ముందు ఓ తాటాకుల పాక.. అందులో పదుల సంఖ్యలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్‌లు. అదేదో బుల్లెట్‌ బండ్ల షోరూం కాదు. ఆథరైజ్డ్‌ సర్వీస్‌ సెంటర్‌ అంతకన్నా కాదు. 63 ఏళ్ల పెద్దాయన నడిపే గ్యారేజి అది. 54 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉంటూ.. అనేకమందికి తర్ఫీదునిస్తూ బుల్లెట్‌ మరమ్మతులకు కేరాఫ్‌గా మారారు పి. రామకృష్ణ.  

రామకృష్ణ.. కేరాఫ్‌ కంకిపాడు
కంకిపాడుకు చెందిన రామకృష్ణ 1968లో గవర్నర్‌పేట గోపాల్‌రెడ్డి రోడ్డులోని ఓ గ్యారేజిలో మెకానిక్‌గా జీవితం ప్రారంభించారు. 1977లో సొంతంగా తానే బందరు లాకుల వద్ద షెడ్డు నెలకొల్పారు. అప్పటి నుంచి నేటి వరకు అదే పాకలో పనిచేస్తున్నారు. బుల్లెట్‌ వాహనాలకు మాత్రమే మరమ్మతులు,        సర్వీసింగ్‌ చేయడం ఆయన ప్రత్యేకత. ఆ విధంగా రామకృష్ణ ‘బుల్లెట్‌ వైద్యుడు’గా పేరు తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ వాడే వారికి రామకృష్ణ సుపరిచితులే. తమ బండికి ఆయన మరమ్మతు చేస్తే నిశ్చింతగా ఉండొచ్చని వాటి యజమానుల నమ్మకం. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా వాహనాలను రామకృష్ణ వద్దకు పంపుతారు. ఈయన వద్ద వందలాది మంది బుల్లెట్‌ మెకానిజం నేర్చుకున్నారు. ఆయన వద్ద నలభై ఏళ్లకు పైగా పనిచేస్తున్న మెకానిక్‌లు ఉన్నారు. 

ఏడేళ్ల వయసులో బుల్లెట్‌ సౌండ్‌ విని..
‘ఏడేళ్ల వయసులో బుల్లెట్‌ సౌండ్‌ విన్నాను. ప్రొద్దుటూరుకు చెందిన జంపారెడ్డి అనే ఉపాధ్యాయుడు కంకిపాడుకు బుల్లెట్‌పై వచ్చి కాఫీ తాగి, పేపర్‌ చదివి వెళ్లేవారు. ఆయన బుల్లెట్‌ స్టార్ట్‌ చేయడం, కిక్‌ కొట్టడం చూసి ఎంతో ముచ్చట పడేవాడిని. ఆ విధంగా బుల్లెట్‌ అంటే ప్రేమ పెరిగింది. బుల్లెట్‌ మెకానిక్‌ అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా. పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగా’ అని రామకృష్ణ గతాన్ని నెమరు వేసుకున్నారు. ఏపీడబ్ల్యూ 6988 నంబర్‌తో 1964లో రిజిస్టర్‌ అయిన బుల్లెట్, ఏపీడబ్ల్యూ 9332 నంబర్‌తో 1968లో రిజిస్టరైన మరో బుల్లెట్‌ రామకృష్ణ సొంతం. ఆ రెండు బుల్లెట్లు ఇప్పటికీ          కండిషన్‌లో ఉన్నాయి. 1971 నాటి మోడల్‌ కేబీఆర్‌ 99 కస్టమర్‌ బుల్లెట్‌కు ఇప్పటికీ ఆయనే సర్వీస్, మరమ్మతులు చేస్తున్నారు. ఇవికాక 1959 నాటి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ను ఎంతో సుందరంగా తీర్చిదిద్దినట్లు రామకృష్ణ తెలిపారు. తాము చేసేది రిపేర్‌ కాదని, వాహనానికి ప్రాణం పోస్తామని రామకృష్ణ చెప్పారు. 

మరిన్ని వార్తలు