మా మంచి సైన్సు మాస్టార్‌

29 Dec, 2020 10:22 IST|Sakshi
సైన్సుడే సందర్భంగా హైస్కూల్లో మూఢనమ్మకాలపై ప్రదర్శన, సమ్మర్‌ కాంపులో చేతిరాతపై శిక్షణ

పిల్లలకు పాఠాలతో పాటు సామాజిక అవగాహన

3 వేల మంది చిన్నారులకు చేతిరాతలో శిక్షణ 

సామాజిక రుగ్మతలపై విద్యార్థులతో నాటిక ప్రదర్శనలు

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి

ఆయనో సైన్సు ఉపాధ్యాయుడు..ఉదయాన్నే పాఠశాలకు వచ్చి పిల్లలకు నాలుగు పాఠాలు చెప్పి తన పని అయిపోయిందనుకోలేదు. పిల్లల చేతిరాత శిక్షణ మొదలుకొని మూఢ నమ్మకాలపై అవగాహన, సమ్మర్‌ క్యాంపులు, సమాజంలోని రుగ్మతలపై నాటిక రచనలు, ప్రదర్శనలు, క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్తమ ప్రశంసలతో పాటు అవార్డులు అందుకుంటూ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు

కొండపి: కొండపికి చెందిన లక్కంతోటి వరప్రసాద్‌ రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం మర్రిపూడి మండలం తంగెళ్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో సైన్సు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయునిగా కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో  ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారు. 

చేతిరాత..మన తలరాత.. 
చేతిరాత బాగుంటే మన తలరాత బాగుంటుందంటారు పెద్దలు. అందుకే  వరప్రసాద్‌ విద్యార్థుల చేతిరాతపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఇప్పటి వరకు చేతిరాత సక్రమంగా లేని 3 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని రాతను తీర్చిదిద్దారు. తాను పనిచేసిన పాఠశాలల్లోనే కాకుండా ఇతర పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సైతం సమ్మర్‌ క్యాంపులు పెట్టి మరీ శిక్షణ ఇస్తున్నారు.  

నాటికల ద్వారా చైతన్యపరుస్తూ 
సమాజంలో ఉన్న రుగ్మతలను బట్టబయలు చేసేలా ప్రజలకు కనువిప్పు కలిగేలా ఎయిడ్స్‌పై సమరం అంటూ నీ జీవితం–నీచేతిలోనే.. నాటికను రచించి పాఠశాల విద్యార్థులతో హైదరాబాద్‌ శ్రీసత్యసాయి ఆడిటోరియంలో ఎయిడ్స్‌డే సందర్భంగా 2006 డిసెంబర్‌లో ప్రదర్శించారు. ఈ నాటికకు రచయితగా, డైరెక్టర్‌గా  ప్రసాద్‌ యూనిసెఫ్‌ ప్రశంసాపత్రం అందుకున్నారు. బేటిబచావో– బేటిపడావో కార్యక్రమంలో భాగంగా చదవనిద్దాం– ఎదగనిద్దాం అంటూ బాలికల విద్య గురించి ప్రకాశంజిల్లాలో ప్రథమస్థానం సాధించి,  గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రసంశాపత్రం అందుకున్నారు. బాలకార్మిక వ్యవస్థపై పోలీస్‌ బాబాయ్‌ శీర్షికన ఎన్‌టీఆర్‌ కళాపరిషత్‌లో 2010–11లో  పిల్లలచేత వేయించిన నాటికకు రచయిత, దర్శకత్వం తదితర విభాగాల్లో మొత్తం 11 అవార్డులు అందుకున్నారు. అదే విధంగా వివిధ దినపత్రికల్లో ఆదివారం మ్యాగజైనన్లలో రచయితగా ఎన్నో కథనాలు ప్రచురితమయ్యాయి.  

క్రీడలకు ప్రోత్సాహం.. 
ప్రసాద్‌ చదువుకునే రోజుల్లో జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడుగా ఆంధ్రజట్టుకు ప్రాతినిధ్యం వహించి 1995లో బంగారు పతకం సాధించారు. క్రీడల పట్ల మక్కువతో ఏటా తాను పనిచేస్తున్న పాఠశాలల్లోని క్రీడాకారులకు రూ.15 వేలు ఖర్చు చేసి క్రీడా దుస్తులు అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నోట్‌పుస్తకాలు అందిస్తూ వారి విద్యార్థిభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ తోటి ఉపాధ్యాయులకు ప్రసాద్‌ ఆదర్శంగా నిలుస్తున్నారు.   
మ్యాజిక్‌ వెనుక లాజిక్‌.. 
సమాజంలో పట్టిపీడిస్తున్న మూఢ నమ్మకాలు ఎన్నో. ఈ మూఢ నమ్మకాలకు విద్యార్థులను దూరం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. చిన్నప్పటి నుండే చిన్నారుల్లో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించేలా మ్యాజిక్‌ వెనుక లాజిక్‌ అంటు సైన్సు ప్రయోగాల ద్వారా విద్యార్థులకు విషయాలపై అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం తీసుకు వస్తున్నారు. 

మరిన్ని వార్తలు