ఉపమాకలో సుగంధ ద్రవ్యాల గుబాళింపు

11 Apr, 2021 15:01 IST|Sakshi
ఉపమాక తీర్థంలో సుగంధ ద్రవ్యాల విక్రయాలు- కొనుగోలుదారులతో రద్దీగా దుకాణాలు

తిరునాళ్లలో జోరుగా మసాలా దినుసుల వ్యాపారం

మార్కెట్‌ ధరలకన్నా తక్కువకు లభ్యం 

నక్కపల్లి (పాయకరావుపేట): ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద తిరునాళ్లలో పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోంది. స్వామివారి కల్యాణోత్సవాలు పురస్కరించుకుని ఈ ఆలయం వద్ద 20 రోజులపాటు పెద్ద ఎత్తున తీర్థం జరుగుతుంది. ఏటా కల్యాణోత్సవాల నెలరోజులు ఇక్కడ మసాలాదినుసులు, సుగంధద్రవ్యాల అమ్మకాలు జరుగుతాయి. ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుంచి కొత్తఅమావాస్య వరకు వివిధ ప్రాంతాల వ్యాపారులు ఇక్కడ తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసి మసాలా దినుసులు విక్రయిస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు.. 
ఉత్తరాంధ్ర జిల్లాలనుంచి అధిక  సంఖ్యలో ప్రజలు ఉపమాక వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ఇక్కడకు వస్తారు. వారంతా సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేస్తుంటారు. పసుపు, కుంకుమ, జీలకర్ర, వెల్లుల్లి, లవంగాలు, యాలికలు, ఆవాలు, ఎండుద్రాక్ష తదితర సుగంధద్రవ్యాలు ఇక్కడ లభిస్తాయి. హోల్‌సేల్‌ ధరలకే వీటిని విక్రయిస్తుండంతో ఇక్కడ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కిలోకు రూ.50 నుంచి రూ.80 వరకు వ్యత్యాసం:  ఇక్కడ దొరికే సరకులకు బయట కొనుగోలుచేసే సరకులకు మధ్య కిలోకు రూ.50 నుంచి రూ.80 వరకు వ్యత్యాసం ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. స్టీలు, ఇత్తడి, రాగి వస్తువుల వ్యాపారం కూడా జోరుగా జరుగుతోంది. కల్యాణోత్సవాల్లో ఐదురోజులపాటు జరిగే స్వామివారి ఉత్సవాలు ఆనంతరం ఈ తీర్థంలో సుగంధ ద్రవ్యాల కొనుగోలుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

ఏటా రూ.70 లక్షల మేర వ్యాపారం 
ఏటా నెలరోజులపాటు జరిగే ఈ వాపారంలో సుమారు రూ.60 నుంచి రూ.70 లక్షల  విలువైన సుగంధ ద్రవ్యాల విక్రయాలు జరుగుతాయి. దాదాపు 30 ఏళ్లగా ఇక్కడ వ్యాపారం జరుగుతోంది. స్వామి సన్నిధిలో లభించే పసుపు, కుంకుమ, మసాలా దినుసులు కొనుగోలు చేస్తే  ఎటువంటి అనారోగ్యం కలగదని ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే జిల్లానలుమూలలనుంచి  సుగంధద్రవ్యాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు.   

కలిసి వస్తుందని నమ్మకం 
ఇక్కడ ఏడాదికి ఒకమారు ఇక్కడ వ్యాపారం చేస్తే కలిసివస్తుందని వ్యాపారుల నమ్మకం. అలా చేసిన వారు ఆర్థికంగా లాభపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ లభించే వస్తువుల ధరలు బయట మార్కెట్లో కంటే తక్కువగా ఉంటాయి. ఇక్కడ కొనుగోలు చేయడం భక్తులు సెంటిమెంట్‌గా భావిస్తారు. ఏడాదికి సరిపడా సరకులు కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు.
– కక్కిరాల శ్రీను, వ్యాపారి, ఉపమాక
చదవండి:
హవ్వా.. ఇదేమి విచిత్ర ప్రచారం  
సినిమా తరహా పక్కా స్కెచ్‌: అనాథగా అవతారమెత్తి..

 

మరిన్ని వార్తలు