అందాల లోకంలో విహరిద్దామా !

10 Aug, 2020 10:03 IST|Sakshi

ఆహ్వానం పలుకుతున్న పర్యాటక ప్రాంతాలు

హోటళ్లు, రిసార్ట్స్‌లను సిద్ధం చేసిన టూరిజం శాఖ

పటిష్ట భద్రత చర్యలతో పాటు ప్రత్యేక రాయితీలు

సాక్షి, విశాఖపట్నం: శతాబ్దాల చరిత్రకు చిరునామాగా, సంస్కృతికి చిహ్నంగా వెలుగొందుతోంది విశాఖ జిల్లా. రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా విశాఖ ఖ్యాతినార్జించింది. అయితే కోవిడ్‌–19 కారణంగా జిల్లాలోని పర్యాటక రంగం నాలుగు నెలలుగా బోసిపోయింది. యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ధాటికి పూర్తిగా కుదేలైంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం అన్‌ లాక్‌డౌన్‌లో ఇచ్చిన సడలింపులతో సందర్శకులను ఆహ్వానం పలికేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. కళ తప్పిన పర్యాటకంతో భారీగా నష్టం వాటిల్లడంతో.. దాన్ని పూడ్చుకునేందుకు సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక రాయితీలు అమలు చేస్తూ.. సందర్శకులను ఆకర్షిస్తోంది. 

విశాఖ మహా నగరంతో పాటు మన్యంలోనూ టూరిజం శాఖకు చెందిన హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్‌లున్నాయి. టూరిస్టులు ఎక్కువగా వచ్చేలా చేసేందుకు కొత్త కొత్త రాయితీలను పర్యాటక శాఖ ప్రకటించింది. ఏసీ, నాన్‌ ఏసీ, లగ్జరీ, వీఐపీ, స్టాండర్డ్స్‌ పేరుతో రిసార్ట్స్‌ల్లోనూ, హోటళ్లలోనూ టూరిజం శాఖకు చెందిన గదులున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సందర్శకుల తాకిడి తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ తరుణంలో డిస్కౌంట్లతో టూరిస్టులను ఆహ్వానించేందుకు పర్యాటక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) పరిధిలోని హోటళ్లలో బస చేసే వారికి 3 నెలల పాటు ఏకంగా 35 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

అరకు రిసార్ట్స్‌

రూ.700 నుంచి రూ.1250 వరకు తగ్గింపు 
జిల్లాలో రుషికొండ, అరకు, అనంతగిరి, లంబసింగి, టైడాల్లో ఏపీటీడీసీకి చెందిన రిసార్ట్స్‌లు, హోటల్స్‌ ఉన్నాయి. ఏపీటీడీసీ అమలు చేస్తున్న 35 శాతం డిస్కౌంట్‌తో ఆయా హోటల్స్‌లో గదుల స్థాయిని బట్టి రూ.700 నుంచి రూ.1,250 వరకు రాయితీ పొందే అవకాశాన్ని పర్యాటకులు సొంతం చేసుకోవచ్చు.

లగ్జరీ రూమ్‌- రూ.1050 నుంచి రూ.1225 
ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌-రూ.910 నుంచి రూ.1050 
డీలక్స్‌ రూమ్‌ -రూ.840 నుంచి రూ.980 
స్టాండర్డ్‌ ఏసీ రూమ్‌-రూ.700 నుంచి రూ.805

అరకులోయలోని హరితా రెస్టారెంట్‌  

పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు  
లాక్‌డౌన్‌ సమయంలో టూరిజం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు అన్‌లాక్‌ ప్రక్రియ మొదలవ్వడంతో.. సందర్శకులను ఆకట్టుకునేందుకు రాయితీలు ప్రకటించాం. పర్యాటకుల భద్రతకు అన్ని రిసార్ట్స్‌లు, రెస్టారెంట్లు, హోటల్స్‌లో పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. శానిటైజేషన్‌ పూర్తి చేశాం. గదుల్లోనూ శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నాం. లాక్‌డౌన్‌ నిబంధనలు అనుసరిస్తూ పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నాం. 
– ప్రసాదరెడ్డి,  టూరిజం శాఖ విశాఖ డివిజనల్‌ మేనేజర్‌

మరిన్ని వార్తలు