మనీషా బొమ్మేస్తే అచ్చుపడుద్ది!

25 May, 2022 16:07 IST|Sakshi

అచ్చెరువొందేలా మనీషా చిత్తరువులు  

ఫొటోలు చూసి బొమ్మలు గీయడంలో దిట్ట 

రెండేళ్లుగా వందల సంఖ్యలో చిత్రాలు గీసిన వైనం

ప్రకాశం (దర్శి) : కరోనా.. ఎందరినో బలి తీసుకుంది. అదే సమయంలో కొత్త ఆలోచనలు పరుడుపోసుకునేలా చేసింది. సరికొత్త ఆవిష్కరణలకు కారణభూతంగా నిలిచింది. కొందరి ఉపాధికి గండి కొట్టింది.. మరికొందరిని జీవనోపాధి మార్గాలు వెతుక్కునేలా చేసింది. దర్శికి చెందిన మనీషా కూడా తనలోని సృజనకు కరోనా సమయంలోనే పదును పెట్టింది. బొమ్మలు గీసే తన హాబీని ఉపాధికి మార్గంగా మలుచుకుంది. తాను గీసిన బొమ్మలను తోటివారికి చూపి, వారి బొమ్మలు కూడా గీయడం.. వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి ఆర్డర్లు తీసుకుని బొమ్మలు వేయడం.. ఇలా తన కళా ప్రతిభను చాటుకుంటూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కొందరు మనీషా ప్రతిభకు ముగ్ధులై తమ చిత్రాలను పంపి బొమ్మలు గీయించుకుంటున్నారు. వాటిని కొరియర్‌ ద్వారా విదేశాలకు తెప్పించుకుంటున్నారు. 

పేర్లతో బొమ్మలు..  
త్రీడీ, ఫైవ్‌డీ కెమెరాలతో తీసిన అందమైన ఫొటోలు ఫ్రేమ్‌ కట్టించుకుని మురిసిపోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, కాస్త విభిన్నంగా ఉండాలని కోరుకునేవారు మాత్రం చేత్తో గీసిన చిత్రాలను ఇష్టపడతారు. అలాంటి వారి బొమ్మలను గడిచిన రెండేళ్లలో మనీషా వందల సంఖ్యలో గీసింది. పెన్సిల్‌తో బొమ్మలు వేయడమే కాదు పేర్లు రాస్తూ చిత్రంగా మలచడం మనీషా ప్రత్యేకత. కరోనా సమయంలో ఉపాధి కోసం ఒక్కో చిత్రానికి రూ.200 తీసుకున్న ఆమె.. ప్రస్తుతం చిత్రం సైజును బట్టి రూ.300 నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటోంది. తన ఇంట్లోనే బొమ్మలు గీస్తూ.. పిల్లలు, పెద్దలకు చిత్ర లేఖనంపై శిక్షణ ఇస్తూ ఉపాధి పొందుతోంది. భర్త సాయికుమార్‌ ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరుకుంటానని మనీషా ధీమాగా చెబుతోంది.

మరిన్ని వార్తలు