మానసిక ఆరోగ్య ప్రాపిరస్తు..!

10 Oct, 2020 10:00 IST|Sakshi
మానసిక సమస్యలతో వచ్చిన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న వైద్యుడు

నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

పెరుగుతున్న మానసిక రోగులు  

ఏటా 20 వేలకు పైగా కేసుల నమోదు

ప్రశాంత జీవనంతో మానసిక సమస్యలకు చెక్‌

ఆర్థిక కష్టాలు ఉండవు.. అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్టనీయదు.. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నా.. ఆ ఒక్కరిలో తెలియని వేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు.. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలంగా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేకపోవడం.. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడడం... పెద్దలు, అధికారులు మందలిస్తే మానసికంగా కుంగిపోవడం.. ఇలాంటి మానసిక సమస్యలతో జిల్లాలో వేలాది మంది సతమతమవుతున్నారు. వైద్యులను ఆశ్రయించి చికిత్స పొందుతున్నారు. నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అలాంటి వారందరికీ మానసిక ఆరోగ్యం ప్రాప్తించాలని ఆకాంక్షిద్దాం.

విజయనగరం ఫోర్ట్‌: ‘ఎంత డబ్బు ఉన్నా ఒంటికి సుఖం లేకపోతే ఎందుకు’ అన్నది పెద్దల మాట. చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, తీవ్ర పని ఒత్తిడి తదితర కారణాలతో మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వీరి సంఖ్య జిల్లాలో పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

15 నుంచి 20 శాతం మందికే వైద్యం  
ఇప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో కేవలం 15 నుంచి 20 శాతం మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన రాహిత్యం, చిన్న చూపు, అపోహలు, పేదరిక తదితర కారణాలు వారిని ఆస్పత్రికి రాకుండా నిలువరిస్తున్నాయి. మానసిక సమస్యలపై అవగాహన పెంచుకోవడం, అందుబాటులో ఉన్న వైద్యసేవలు పొందడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోవిడ్‌–19 వ్యాప్తి జనంను భయపెడుతోంది. ఆరోగ్య సమస్యలు సృష్టిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలు అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. వాటిలో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి.

ప్రాణం తీస్తున్న కరోనా భయం..  
ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్‌–19తో పోరాడుతోంది. భౌతిక దూరం, వ్యాధి చికిత్స, వ్యాక్సిన్‌ పట్ల అనిశ్చితి, ఆర్థిక చిక్కులు తదితర అంశాలు ప్రజల్లో తీవ్ర ఒత్తిడి, ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల మంది వేర్వేరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అంతకు 20 రెట్లు మంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఏటా ప్రతి 10 మంది పిల్లలలో ఒకరు, ప్రతి నలుగురు పెద్దలలో  ఒకరు కొత్తగా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఓ అంచనా.  

జిల్లాలో ఏడాదికి 20 వేల మంది...  
జిల్లాలో ఏడాదికి 20 వేల నుంచి 24 వేలు మంది వరకు మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వీరిలో అనేకమంది వివిధ రకాల మానసిక సమస్యలు భారిన పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోయి కొంతమంది, కుటుంబ కలహాలవల్ల కొందరు, అనారోగ్య సమస్యల వల్ల కొందరు మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఒక మనిషి సాధారణ భావోద్వేగాలు, అనుభూతులు పొందుతూ అవసరమైనప్పుడు నియంత్రించుకుంటూ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే శక్తి కలిగి జీవితం గడుపుతుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టే. మంచి ఆరోగ్యం, సరిపడినంత నిద్ర, వ్యాయామం, యోగ, తమకు తాము సమయం కేటాయించుకోవడం, కుటుంబం, స్నేహితులతో మంచి బంధాలు కలిగి ఉండడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఒత్తిడి, కుంగుబాటు, భయం లేదా మరేదైనా మానసిక సమస్య ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులను కలిస్తే సమస్య తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు.

చికిత్సతో విముక్తి 
మానసిక సమస్యలు ఎదుర్కొనేవారి సంఖ్య ఇటీవల కాలంలో జిల్లాలో పెరుగుతోంది. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో వస్తున్నారు. మానసిక సమస్యకు సకాలంలో పరిష్కారం పొందాలి. అవసరమైతే చికిత్స చేయించుకోవాలి. లేదంటే నిద్రలేక ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కడు ఒత్తిడికి దూరం కావాలి. ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవాలి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. వ్యాయామం, యోగ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా జీవించాలి.
– డాక్టర్‌ జాగరపు రమేష్, మానసిక వైద్య నిపుణుడు 

మరిన్ని వార్తలు