బతుకుదాం.. కలకాలం

13 Aug, 2020 08:01 IST|Sakshi

నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం

అవయవదానంపై అవగాహన అవసరం   

మన ఆయుష్షు యాభై ఏళ్లే అయి ఉండొచ్చు. కానీ మన కళ్లకి మాత్రం మరో యాభై సంవత్సరాలు లోకాన్ని చూసే అదృష్టం ఉంది. మన హృదయ స్పందన అర్ధంతరంగా ఆగిపోవచ్చు. కానీ కాసింత ఆలోచన చేస్తే మరో మనిషి పంచన చేరి ఆ గుండె చేసే చప్పుడు వినవచ్చు. మన ప్రయాణం సగంలోనే ఆగిపోవచ్చు. మిగిలిపోయిన ఆ ప్రయాణాన్ని మన అవయవాలు మరొకరి సాయంతో పూర్తి చేస్తాయి. అందుకు ఉన్న దారి అవయవదానం. ఇది కొత్తదేం కాదు. కన్నప్పు సాక్షాత్తు ఈశ్వరుడికే కంటిని దానం చేశాడు. దధీచి వెన్నెముకనిచ్చి ఇంద్రుడిని రారాజుగా నిలిపాడు. మన మధ్య కూడా అలాంటి దానకర్ణులు ఉన్నారు. ఎటొచ్చీ దీనిపై అవగాహనే తక్కువ. విలువైన అవయవాలను మట్టిపాలు చేసే బదులు ఇంకొకరికి దానం చేస్తే వారి ఆయుష్షును పెంచినవారమవుతామని వైద్యులు చెబుతున్నారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం. ఈ సందర్భంగా..

ఇచ్ఛాపురం రూరల్‌: ఒక మనిషి చనిపోయినా మళ్లీ బతకవచ్చంటే అది కచ్చితంగా అవయవదానం ద్వారానే. మనిషి మరణించిన తర్వాత మట్టిగా నో లేక బూడిదగానో మారే అవయవాలు సక్రమంగా వినియోగించగలిగితే మరో వ్యక్తికి జీవదానం చేయగలవు. దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చావు సమీపంలో ఉన్న వ్యక్తిని అమాంతం బతికించగల అపురూప కార్యమిది. సామాజిక కట్టుబాట్లు, మత మౌఢ్యం వేళ్లూనుకున్న మన సమాజంలో ఇప్పుడిప్పుడే అవయవదానం, రక్త, నేత్ర దానాలపై అవగాహన కలుగుతోంది. మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లీవర్, జీర్ణ వ్యవస్థలోని పాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్‌ డెడ్‌ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క. 

ఏ అవయవాలు దానం చేయవచ్చు
మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కి డ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి తలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మా త్రమే అవయవాలను సేకరిస్తారు.  

అవయవాలు కావాల్సి వస్తే
అవయవాలు కావాల్సిన రోగులు కూడా ప్రభుత్వ జీవన్‌దాన్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్‌ నంబర్‌ ఇ స్తారు. అవయవ దానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్‌ నంబర్‌ ప్రకారం అవకాశం కల్పిస్తారు.  

నమోదు ఇలా..
అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తమకు తెలిసినవారందరికీ సమాచారం అందివ్వాలి. దీని వల్ల అతను చనిపోయాక అవయవ దానం చేసేందుకు వీలు కలుగుతుంది. జీవన్‌దాన్‌ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టగా, రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి తమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా బ్రెయిన్‌ డెడ్‌ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ జీవన్‌ధాన్‌ డాట్‌ జీవోది డాట్‌ ఇన్‌’ వెబ్‌ సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం ఆర్గాన్‌ డోనర్‌ కార్డును అందజేస్తుంది. 

అవగాహన తప్పనిసరి..
అవయవ దానంపై ఇప్పటికీ జిల్లా వాసుల్లో చాలా అపోహలు ఉన్నాయి. ప్రాయోజితమైన ఈ కార్యక్రమంపై ప్రచారం లేకపోవడంతో అవ గాహన పెరగడం లేదు. దేశంలో ఏటా లక్షా 30 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అవుతున్నారు. వీరికి కేవలం 150 నుంచి 200 మంది మాత్రమే అవయవ దానం చేస్తున్నారు. కిడ్నీ వ్యాధితో భారతదేశంలో ఏటా 3 లక్షల మంది చనిపోతున్నారు. అందులో మన శ్రీకా కుళం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. వీరికి బ్రెయిన్‌డెడ్‌ కేసులు నుంచి సేకరించిన మూత్రపిండాలను అమర్చగలిగితే మరణాలను ఆపవచ్చు. 

భర్త మాట కోసం.. 
అవయవదానం గురించి అప్పుడప్పుడే ప్రచారం జరుగుతున్న సందర్భంలో గ్రామీణ మారుమూల ప్రాంతానికి చెందిన నిరక్షరాస్యులైన కృష్ణచంద్ర కుటుంబం అవయవ దానం చేసేందుకు అంగీకరించడం విశేషం. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి పంచాయతీ అయ్యవారిపేటకు చెందిన కృష్ణచంద్ర రౌళో ప్రైవేటు బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. పాతికేళ్ల తన విధి నిర్వహణలో వేలాది మంది ని భద్రంగా గమ్యాలకు చేర్చారు. 2015 మార్చి నెలలో ప్రమాదవశాత్తు వంతెన మెట్లపై నుంచి జారిపడటంతో కోమాలోకి వెళ్లిపోయాడు. బతికే సూచనలు లేవంటూ వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు హతాశుతులైపోయారు. విశాఖపట్నం న్యూకేర్‌ ఆస్పత్రిలో అవయవ దానం చేసేందుకు భార్య శారదా రౌళో అంగీకరించడంతో కళ్లు, గుండెతో పాటు కిడ్నీలను దానం చేశారు. బతికుండే సమయంలో తాను చనిపోతే తన అవయవాలను ఇతరులకు దానం చేయాలన్న తన భర్త కృష్ణచంద్ర మాట కోసం అవయవాలతో ముగ్గురు వ్యక్తులకు జీవం పోశామని, ఆయన నేటికీ సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. 

కన్న కొడుకు కోసం.. 
తన కన్నకొడుకు పడుతున్న దుస్థితి మరొకరు పడకూడదన్న ఓ తండ్రి ముందు చూపుతో నేత్రదానం చేసేందుకు అంగీకరించి తన కళ్లతో వేరొకరు లోకం చూసేందుకు చూ పును ప్రసాదించి చిరస్థాయిగా నిలిచిపోయారు నెయ్యిల ధర్మరాజు. ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన ధర్మరాజు టైలరింగ్‌ చేస్తూ భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెను పోషించుకునేవారు. పెద్ద కుమారుడు విఘ్నేష్‌ పుట్టు అంధుడు కావడంతో చూపు కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తన కుమారుడు వంటి ఎందరో అంధులుగా జీవనం సాగిస్తున్నట్లు స్వయంగా తెలుసుకున్న 42 ఏళ్ల ధర్మరాజు నేత్రదానానికి అంగీకరించారు. దురదృష్టవశాత్తు 2018 జనవరి 17న గుండె పోటుతో మృతి చెందారు. భర్త ఇచ్చిన మాటకు కట్టుబడిన భార్య నెయ్యిల పార్వతి అంగీకరించడంతో బెర్హంపూర్‌ నేత్రాలయానికి కళ్లను దానం చేశారు. 

ఆయన కళ్లు సజీవం!  
పెద్దాయన ప్రాణంతో లేకపోయినప్పటికీ ఆయన కళ్లు మాత్రం సజీవంగా ఉన్నాయి. ఇచ్ఛాపురానికి చెందిన సంతోష్‌ షాపింగ్‌ మాల్‌ యజమాని కిల్లంశెట్టి విశ్వనాథం (74)  2019 నవంబర్‌ 20న మృతి చెందారు. ఆయన తమ మధ్య భౌతికంగా లేనప్పటికీ ఆయన కళ్లు మరొకరికి చూపునివ్వాలన్నది కుటుంబ సభ్యుల కోరిక. వెంటనే బరంపురం నేత్రాలయానికి సమాచారం అందివ్వడంతో విశ్వనాథం కళ్లను సేకరించారు.

అన్నయ్యకు కిడ్నీదానం        
ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామానికి చెందిన పరపటి కృష్ణారావు 2017వ సంవత్సరం మూత్రపిండాల వ్యాధి బారినపడ్డాడు. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే తప్ప బతికే పరిస్థితే లేదన్నారు వైద్యులు. కిడ్నీ దానం చేసేందుకు చెల్లెలు నీలమ్మ ముందుకు వచ్చింది. 2017 ఏప్రిల్‌ నెలలో విశాఖపట్నం సెవెన్‌ హిల్స్‌లో ఆపరేషన్‌ సజావుగా జరిగింది. ఇప్పుడు అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.  

అపోహలు వద్దు
అవయవ దానంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ చాలా మందిలో ఇప్పటికీ అవయవదానంపై అపోహలు పడుతున్నారు. అవి ఏ మాత్రం వాస్తవం కాదు. మరణానంతరం శాశ్వతంగా జీవించే మార్గం అవయవ దానమే. ప్రతి ఒక్కరూ తమ దేహాన్ని ముగించే ముందు మరొకరికి జీవితాన్ని ప్రసాదించాలి. 
– డాక్టర్‌ స్వాతి, వైద్యాధికారి, కొళిగాం పీహెచ్‌సీ, ఇచ్ఛాపురం మండలం  

  

మరిన్ని వార్తలు