YS Rajasekhara Reddy Jayanthi: మహా మనిషి

8 Jul, 2022 05:17 IST|Sakshi

పరిపాలనకు మానవత్వం జోడించిన వైఎస్సార్‌

ప్రజల హృదయాల్లో చెరగని సంక్షేమ సంతకం 

రూపాయికే వైద్యం చేసి ప్రజల నాడి పట్టిన వైద్యుడు

జనం కోసం ఎందాకైనా పోరాడే యోధుడు

మండుటెండల్లో 1,475 కి.మీ. పాదయాత్రతో భవితకు భరోసా

ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన రైతు బాంధవుడు

రూ.1100 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రైతులపై బనాయించిన కేసులు మాఫీ

అన్నదాతల్ని రుణ విముక్తుల్ని చేసిన రైతు నేస్తం

పేదలకు ప్రాణం పోసిన ‘ఆరోగ్యశ్రీ’మంతుడు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో నిరుపేదలకు సరస్వతీ కటాక్షం

ఓటమి ఎరుగని మహానేత

వైఎస్‌ తెచ్చిన ఆరోగ్యశ్రీ, రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్‌ పలు రాష్ట్రాల్లో అమలు

పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. ముందుచూపు, చకచకా అభివృద్ధితో ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచారు. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన ఆ వైతాళికుడే మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని అజేయుడి 73వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇదీ..

(రామగోపాల్‌ ఆలమూరు – సాక్షి, అమరావతి): ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ ఐదేళ్ల మూడు నెలలపాటు మాత్రమే పని చేశారు. కానీ.. ఆ కొద్ది కాలంలోనే పాలకుడికి మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సమగ్రాభివృద్ధివైపు ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. వైఎస్సార్‌ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు. 

రూపాయి డాక్టర్‌గా..
వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్‌ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. 

అపర భగీరథుడు
‘1978లో శాసనసభలో తొలిసారి అడుగు పెట్టాక కోస్తా పర్యటనకు వెళ్లినప్పుడు కాలువల్లో గలగలా పారుతున్న నీటిని చూసి కరువుతో తల్లడిల్లుతున్న ప్రాంతాలకు కూడా జలధారలు అందించాలనే సంకల్పం నాలో ఏర్పడింది. కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని కోరితే.. ‘‘దోసిలి పట్టు.. పోస్తా’’ అని ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజు నా సంకల్పం మరింత బలపడింది’ అని 2004లో సీఎంగా సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే సమయంలో వైఎస్సార్‌ గుర్తు చేసుకున్నారు.

కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం తలపెట్టారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరానికి శ్రీకారం చుట్టారు. 2009 నాటికే 16 ప్రాజెక్టులను పూర్తిగా.. 25 ప్రాజెక్టులను పాక్షికంగా వెరసి 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారు.  

ఆరోగ్యశ్రీతో ప్రజారోగ్యానికి భరోసా..
2004 మే 14 నుంచి 2007 జూన్‌ 26 వరకూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అధికారంలో ఉండగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి విడుదల చేశారు. అనారోగ్యం పాలైన పేద కుటుంబాలు ఆపత్కాలంలో సాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాల్సిన ప్రయాసలకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఇది ప్రజల ఆరోగ్యానికి ఎనలేని భరోసా ఇచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. వైఎస్సార్‌ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని చేపట్టింది.

పేదరికానికి విద్యతో విరుగుడు..
పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి వైఎస్సార్‌ రూపకల్పన చేశారు. డాక్టర్, ఇంజనీర్‌ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని ధృఢంగా విశ్వసించి.. ఆ దిశగా అడుగులు వేశారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

తాడేపల్లిగూడెంలో ఉద్యానవర్శిటీ, తిరుపతిలో పశు వైద్యకళాశాలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ని హైదరాబాద్‌ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్‌ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. 

మాంద్యం ముప్పు తప్పించిన ఆర్థికవేత్త..
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం రాష్ట్రంపై పడకుండా వివిధ పనుల కల్పన ద్వారా వైఎస్సార్‌ నివారించగలిగారు.  ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేశారు.

అజేయుడు..
రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు. వారిలో దివంగత వైఎస్సార్‌ ముందు వరుసలో నిలుస్తారు. పులివెందుల నియోజకవర్గం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో అసెంబ్లీకి, కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో పార్లమెంట్‌కి, ఆ తర్వాత మళ్లీ పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి వరుసగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి విజయాలు సాధించారు. 

రైతును రాజు చేసిన మారాజు..
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్‌ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్‌ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేశారు.

దాదాపు 35 లక్షల పంపు సెట్లకుపైగా ఉచిత విద్యుత్‌ అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌పై వెనక్కు తగ్గలేదు.  వైఎస్‌ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించారు.  పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందించారు. 

నేడు రైతు దినోత్సవం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లా, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) స్థాయిల్లో వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. వీటిలో పెద్ద ఎత్తున రైతులను భాగస్వాములను చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా గత మూడేళ్లుగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

శాఖల వారీగా ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తొలుత వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించాక వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం వంటి వాటి ద్వారా లబ్ధి పొందిన రైతులను భాగస్వాములను చేస్తున్నారు. 

రైతన్నల సంక్షేమానికి ఎన్నో మేళ్లు..
వివిధ పథకాల ద్వారా రైతన్నలకు నేరుగా రూ.1,27,633.08 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన విషయాన్ని రైతులకు వివరించనున్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి,  వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్, అమూల్‌ ద్వారా పాడి రైతులకు అదనంగా లబ్ధి, ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రభుత్వం లబ్ధి కలిగిస్తోంది.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థిక సాయం, వైఎస్సార్‌ జలకళ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించి, మోటార్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. వీటన్నింటిపై రైతు దినోత్సవ వేడుకల్లో అవగాహన కల్పించనున్నామని వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 

మరిన్ని వార్తలు