కొప్పర్తిలో కంపెనీలకు ప్రత్యేక రాయితీలు

16 Jul, 2021 02:08 IST|Sakshi

వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో ఏర్పాటయ్యే తొలి ఐదు కంపెనీలకు ప్యాకేజీ

పిట్టి రైల్‌ అండ్‌ ఇంజనీరింగ్, నీల్‌కమల్‌కు భూములు, రాయితీలు

స్టాంపు డ్యూటీ, ఎస్‌జీఎస్టీ పూర్తి మినహాయింపుతోపాటు వడ్డీ, విద్యుత్‌ సబ్సిడీలు

రూ.401 కోట్లతో 2,000 మందికి ‘పిట్టి’ ప్రత్యక్షంగా ఉపాధి 

రూ.486 కోట్లతో 2030 మందికి నీల్‌కమల్‌లో ప్రత్యక్షంగా ఉపాధి 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో ఇన్వెస్ట్‌ చేసే తొలి ఐదు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలోగా వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో ఇన్వెస్ట్‌ చేసే తొలి ఐదు కంపెనీలు లేదా యాంకర్‌ యూనిట్లకు తక్కువ ధరకే భూమి కేటాయింపు, స్టాంపు డ్యూటీ, ఎస్‌జీఎస్టీ పూర్తి మినహాయింపుతోపాటు వడ్డీ, విద్యుత్‌ సబ్సిడీ లాంటి పలు రాయితీలు అందచేస్తోంది. ఇక్కడి మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో రూ.401 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించే తొలి కంపెనీగా ‘పిట్టి రైల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌’ ముందుకొచ్చింది. రెండో కంపెనీగా నీల్‌కమల్‌ లిమిటెడ్‌ రూ.486 కోట్ల పెట్టుబడితో 2,030 మందికి ఉపాధి కల్పించనుంది. దీనికి సంబంధించి జూన్‌ 29న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) పిట్టి రైల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్, నీల్‌కమల్‌ ఇండియాకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌ కరికల్‌ వలవన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎకరం రూ.పది లక్షల చొప్పున 117.85 ఎరాల కేటాయింపు
వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో ఎకరం ధరను ఏపీఐఐసీ రూ.25 లక్షలుగా నిర్ణయించగా తొలి కంపెనీ కావడంతో పిట్టి రైల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ సంస్థకు ప్రత్యేక రాయితీ కింద ఎకరం రూ.10 లక్షల చొప్పున మొత్తం 117.85 ఎకరాలను కేటాయించారు. నీల్‌కమల్‌కు 105 ఎకరాలు కేటాయించారు. స్టాంపు డ్యూటీ నుంచి 100 శాతం మినహాయింపు ఇచ్చారు.
► తొలి 8 సంవత్సరాలు లేదా ఎఫ్‌సీఐ పరిమితి 100 శాతం ఇందులో ఏది ముందు అయితే అప్పటివరకు 100 శాతం ఎస్‌జీఎస్టీ నుంచి మినహాయింపు.
► స్థిర మూలధన పెట్టుబడిలో 20 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ. గరిష్టంగా రూ.10 కోట్లు
► ఏడాదికి 5 శాతం వడ్డీ రాయితీ గరిష్టంగా రూ.1.50 కోట్లు
► తొలి ఐదేళ్లు విద్యుత్‌ చార్జీ యూనిట్‌కు రూపాయి చొప్పున తిరిగి చెల్లిస్తారు.
► తొలి ఐదేళ్లు లాజిస్టిక్‌ సబ్సిడీ అందిస్తారు. ఏటా గరిష్టంగా రూ.50 లక్షలు చొప్పున దేశీయ రవాణాలో 25 శాతం సబ్సిడీ కల్పిస్తారు.  

మరిన్ని వార్తలు