జగనన్న ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక బృందాలు 

16 Jun, 2022 16:02 IST|Sakshi

కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణ పనులు

30 ఇళ్ల చొప్పున యూనిట్‌గా..

జిల్లాలో 71,798 ఇళ్ల స్థలాల మంజూరు

63,933 ఇళ్ల రిజిస్ట్రేషన్ల పూర్తి

సాక్షి, భీమవరం: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో గృహాలను మంజూరు చేస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. వీటిని మరింత వేగవంతం చేసేందుకు పట్టణాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్లు నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 71,797 మందికి స్థలాల పట్టాలు మంజూరు చేయగా ఇప్పటికే 63,933 ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. వీటి నిర్మాణాల కోసం ప్రభు త్వం రూ.257.21 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే సుమారు 21 వేల మంది లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టగా వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణం చేపట్టిన లబ్ధిదా రులకు ప్రభుత్వం రూ.1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు మరో రూ.30 వేలు బ్యాంకు రుణంగా అందించే ఏర్పాట్లు చేసింది.  

పట్టణాల్లో పక్కా ప్రణాళికతో.. 
జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు పటిష్ట ప్రణాళిక రూపొందించారు. కాంట్రాక్టర్‌ ద్వారా పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. లబ్ధిదారులు విడివిడిగా గృహ నిర్మాణం చేపడితే మెటీరియల్‌ రవాణా, కొనుగోలు వంటి వాటికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడంతో పాటు వ్యయప్రయాసలు తప్పవు. ఈ నేపథ్యంలో 30 మంది లబ్ధిదారులను యూనిట్‌గా విభజించి సచివాలయ ఉద్యోగులు ఆరుగురిని బృందంగా ఏర్పాటుచేసి కాంట్రాక్టర్‌కు నిర్మాణాన్ని అప్పగిస్తారు. ఇలా ముందుగా పట్టణాల్లో ని ర్మాణాలు చేపట్టి అనంతరం గ్రామాల్లో నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు చేసే పనులను సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పర్యవేక్షించేందుకు వీలున్నందున నాణ్యతా ప్రమా ణాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ విధా నం ద్వారా సత్ఫలితాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.  

భీమవరంలో 42 బృందాలు 
భీమవరంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకంలో త్వరితగతిన గృహాల నిర్మాణానికి 42 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేస్తున్నాం. ఒక్కో బృందం 30 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తాయి. టీమ్‌ సభ్యులంతా ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పటికే కొందరు కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు. గృహ నిర్మాణ ఆవశ్యకత, లబ్ధిదారుల ఇబ్బందులను కాంట్రాక్టర్లకు వివరించి కాంట్రాక్ట్‌ పద్ధతిన పనులు చేయించేందుకు సన్నద్ధం చేస్తున్నాం.  
– ఎస్‌.శివరామకృష్ణ, మునిసిపల్‌ కమిషనర్, భీమవరం 

మరిన్ని వార్తలు