IPL 2022: ఇక్కడ బంతి బంతికో రేటు..!

27 Mar, 2022 10:15 IST|Sakshi

ప్రారంభమైన ఐపీఎల్‌–15 జూదం!  

రెండున్నర నెలల పాటు బెట్టింగ్‌ రాయుళ్లకు పండగే..  

పందాల రూపంలో చేతుల మారనున్న రూ.కోట్ల ప్రజాధనం  

గడిచిన ఏడేళ్లలో 7 కేసులు మాత్రమే నమోదు

 విజయనగరం: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–15 సీజన్‌ శనివారం మొదలైంది. బెట్టింగ్‌ రాయుళ్లు బంతికో రేటు కట్టి జూదమాడేందుకు సిద్ధమైపోయారు. ఫోర్లు, సిక్సర్ల హోరుతో స్కోర్‌ బోర్డు ఎలా పరుగులు పెడుతుందో... బెట్టింగ్‌ కూడా రూ.వందలు.. రూ.వేలు... రూ.లక్షలు.. దాటి రూ.కోట్లు కట్టేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. బెట్టింగ్‌లను నియంత్రిస్తామని పోలీస్‌ యంత్రాంగం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో ఈ వ్యవహారం బాహాటంగానే సాగిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

కేసుల నమోదు తక్కువే..  
గడిచిన ఏడేళ్లలో జిల్లాలో 6  కేసులు నమోదు కాగా, 40 మంది బెట్టింగ్‌ రాయళ్లను మాత్రమే అరెస్టు చేశారు. కంప్యూటర్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. 2016లో  క్రికెట్‌ బెట్టింగ్‌లపై 3 కేసులు నమోదుచేసి 23 మందిని, 2017లో 2 కేసుల్లో 10 మందిని,  2018లో ఒక కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు.  

రెండున్నర నెలల పాటు అదే హీటు.. 
ఐపీఎల్‌–15 సీజన్‌ దాదాపు రెండు నెలల పాటు సాగనుంది. ఈ సమయంలో బుకీలు బెట్టింగ్‌ నడిపే తీరు చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. టాస్‌ ఏ జట్టు గెలుస్తుందని బెట్టింగ్‌ కాస్తారు. ఆపై మొదటి ఓవర్‌లో బౌండరీ వెళుతుందా? లేదా ? వికెట్‌ పడే అవకాశం ఉందా? లేదా? పవర్‌ ప్లేలో ఎంత స్కోర్‌ చేస్తుంది? ప్రత్యర్థి జట్టు ఎన్ని వికెట్లు తీస్తుంది?... ఇలా పలు రకాలుగా బెట్టింగ్‌ వేస్తారు. ఇంకా కొందరు ప్రతి బంతికీ బెట్టింగ్‌ ఇస్తారు. ఓడిపోతే రూ.15వేలు పోతుంది. ఐపీఎల్‌ సీజన్‌లో జిల్లాలో రోజుకు రూ.3 కోట్ల మేర బెట్టింగ్‌లు సాగుతాయన్నది సమాచారం. ఫేవరెట్‌ జట్లపై అయితే బెట్టింగ్‌ మరోలా నిర్వహిస్తారు. ఉదాహరణకు బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంటే... ఫేవరెట్‌! బెంగళూరుపై రూ. 10వేలు బెట్టింగ్‌ కాయాలంటే సబ్‌ బుకీలకు రూ. 13వేలు చెల్లించాలి. బెంగళూరు గెలిస్తే రూ.10 వేలు ఇస్తారు. ఓడిపోతే రూ.13వేలు పోయినట్లే!.   

జిల్లాలో బుకీల తిష్ట...!  
జిల్లాలో బుకీలు ఇప్పటికే తిష్టవేసినట్టు బోగట్టా. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సబ్‌బుకీలు, ఏజెంట్లను కమీషన్‌ ప్రాతిపదికన నియమించుకున్నారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు బెట్టింగ్‌ తీరును చెప్పేస్తారు. ఫేవరెట్‌ జట్టు, బెట్టింగ్‌ రేషియా నిర్థారిస్తారు. ఈ మేరకు బెట్టింగ్‌ రాయుళ్లు ఏజెంట్లకు డబ్బులిస్తారు. వీరు సబ్‌ బుకీలకు చేరుస్తారు. మ్యాచ్‌ ముగిసిన తరువాత బెట్టింగ్‌ డబ్బులు ఇచ్చేస్తారు. ఈ పందాల వల్ల ఏటా చాలా మంది నష్టపోతున్నారు.  

యువత, విద్యార్థులే టార్గెట్‌..  
యువత, విద్యార్థులను ఉచ్చులో దించుతున్నారు. వేలాది మందిని బెట్టింగ్‌లో దించి రూ.కోట్లు దోచుకుంటున్నారు. కొందరు వ్యాపారులతో పాటు ప్రొఫెషనల్‌ కోర్సులు చదివే విద్యార్థులు కూడా డబ్బు ఆశతో బెట్టింగ్‌కు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఆన్‌లైన్‌లో ఉన్న కొన్ని యాప్‌ల ద్వారా కూడా బెట్టింగ్‌ వ్యవహారం జోరుగా సాగుతోంది. బెట్టింగ్‌ నిర్వహించేవారి వివరాలు స్థానిక పోలీసుల్లో కొందరికి తెలుసునని, వారితో ఉన్న సన్నిహిత సంబ«ంధాలతో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని పోలీస్‌ వర్గాలే బహిరంగంగా చెబుతుండడం గమనార్హం.  

పోలీసుల ప్రత్యేక దృష్టి  
ఐపీఎల్‌ సీజన్‌లో సాగే బెట్టింగ్‌లపై జిల్లా పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పందెం ఎలా కాసినా పట్టుకునేందుకు సిద్ధమైంది. గతంలో బెట్టింగ్‌లు పెట్టిన వారి వివరాలను సేకరించి ప్రస్తుతం వారి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. యువత, విద్యార్థులు బుకీల మాయలో పడొద్దని హెచ్చరిస్తోంది.  

కేసులు నమోదైతే అంతే..
బెట్టింగ్‌ల్లో పట్టుబడితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు. పోలీసుల రికార్డులో పేరు, చిరునామా ఉంటుంది. 
ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు పడక తప్పదు. 
ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత ఎక్కడ బెట్టింగ్‌ జరిగినా వీరిపై నిఘా ఉంటుంది. 
బెట్టింగ్‌ ఆడుతూ లేదా నిర్వహిస్తూ మరోసారి పట్టుబడితే కఠిన చర్యలుంటాయి  

బెట్టింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక టీమ్‌..   
ఐపీఎల్‌–15 సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌ల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. బుకీలతో పాటు బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. బెట్టింగ్‌లు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరం. అనవసరంగా బెట్టింగ్‌ల పేరుతో డబ్బులు కట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎక్కడైనా బెట్టింగ్‌లు జరిగే సమాచారం అందించవచ్చు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం.  పాత నేరస్తులపై నిఘా పెట్టాం.         
–  అనిల్‌కుమార్‌ పులిపాటి, ఏఎస్పీ, విజయనగరం    

మరిన్ని వార్తలు