గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

25 May, 2021 04:57 IST|Sakshi

కోవిడ్‌ బారినపడ్డ గర్భిణులకు ప్రత్యేక చికిత్స

రాష్ట్ర వ్యాప్తంగా 575 స్పెషల్‌ బెడ్స్‌ ఏర్పాటు

ప్రత్యేక ప్రసూతి గది, ఆపరేషన్‌ థియేటర్ల ఏర్పాటు

104 లేదా ఈ–సంజీవని ద్వారా కూడా కన్సల్టేషన్‌

ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన కల్పించాలి

డెలివరీ డేటుకు 15 రోజుల ముందే సమాచారం ఇవ్వాలి

అన్ని ఆస్పత్రులకు సర్కారు ఆదేశాలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో గర్భిణుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షల మంది గర్భిణులు ప్రసవాల నిమిత్తం ఆస్పత్రులకు వెళ్తుండగా.. వీరిలో 3 లక్షల మందికి పైగా ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకుంటున్న వారే. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు కోవిడ్‌ బారినపడే అవకాశం ఉండటంతో ప్రసవాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కోవిడ్‌ బాధితుల కోసం తీసుకునే చర్యల కంటే గర్భిణులకు మరింత జాగ్రత్తగా ఐసొలేషన్‌ వార్డులు, గదులు, ప్రత్యేక ప్రసవ గదులు, ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేయాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు వెళ్లాయి. కరోనా పాజిటివ్‌ బారిన పడిన గర్భిణులకు ప్రత్యేక వైద్యం అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రత్యేక చర్యలు ఇలా
► కోవిడ్‌ పాజిటివ్‌ బారిన పడిన గర్భిణులకు యాంటీనటల్‌ చెకప్స్‌ (గర్భిణుల వైద్య పరీక్షలు), పోస్ట్‌నటల్‌ చెకప్స్‌ (ప్రసవం తర్వాత పరీక్షలు) విధిగా చేయాలి. డెలివరీకి 15 రోజుల ముందు ప్రతి గర్భిణికి కోవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరిగా చేయాలి
► ప్రసవానికి ప్రత్యేక గది, ఆపరేషన్‌ థియేటర్‌ ఉండాలి. ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రి అయి ఉండాలి.
► ప్రసవానికి మెటర్నిటీ ఆస్పత్రిలో 50, బోధనాస్పత్రిలో 30, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రిలో 20 చొప్పున, సీహెచ్‌సీలో 10, పీహెచ్‌సీలో 2 చొప్పున పడకలు కేటాయించాలి.
► 104 కాల్‌ సెంటర్‌ ద్వారా టెలీ కన్సల్టెన్సీ సేవలు, 108 ద్వారా రవాణా సేవలు నిత్యం అందుబాటులో ఉండాలి.
► కరోనా సోకిన గర్భిణులను కోవిడ్‌ ప్రొటోకాల్స్‌ పాటించే విధంగా ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలి.
► గిరిజన ప్రాంతాల్లో అత్యవసర సేవల్లో భాగంగా ఫీడర్‌ అంబులెన్సులు అందుబాటులో ఉంచాలి.
► ప్రసవానికి 15 రోజుల ముందే బర్త్‌ వెయిటింగ్‌ హోమ్స్‌ను రెడీ చేసి ఉంచాలి.
► అన్ని జిల్లాల్లో వైద్యాధికారులు, జిల్లా ఆరోగ్య సమన్వయకర్తలు (డీసీహెచ్‌ఎస్‌), బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలి.
► రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో గర్భిణుల కోసం 575 పడకలు కేటాయించాలి. 

మరిన్ని వార్తలు