మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక యూనిట్లు

19 May, 2021 03:53 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

‘దిశ’ తరహాలో ఈ యూనిట్లకు కూడా పోలీస్‌స్టేషన్‌ హోదా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీస్‌స్టేషన్‌ల తరహాలోనే యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ (ఏహెచ్‌టీయూ)లకు పోలీస్‌స్టేషన్‌ హోదా కల్పించింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏహెచ్‌టీయూల ఏర్పాటుకు నిర్ణయించడం మరో విశేషం.

అక్రమ రవాణాకు గురైన బాధితులను రక్షించేందుకు, అక్రమ రవాణాకు పాల్పడే ముఠాల ఆట కట్టించేందుకు హద్దులు, అడ్డంకులు లేకుండా ఎక్కడికైనా వెళ్లేలా ఏహెచ్‌టీయూ బృందాలకు అధికారం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఏహెచ్‌టీయూలు ఉండగా.. కొత్తగా చిత్తూరు, తూర్పుగోదావరి, వైఎస్సార్, కర్నూలు, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో పనిచేసే యూనిట్లను ఎస్పీలు, విజయవాడ, విశాఖలలో నగర పోలీస్‌ కమిషనర్లు నోడల్‌ ఆఫీసర్లుగా ఉండి పర్యవేక్షిస్తారు. 

అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక శిక్షణ
ప్రతి యూనిట్‌కు ఒక సీఐ, ఇద్దరు చొప్పున ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. వీరికి మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ టీమ్‌లు స్థానిక దిశ పోలీస్‌స్టేషన్, సివిల్‌ పోలీసులను సమన్వయం చేసుకుని మానవ అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకుంటాయి. అంతేకాకుండా బాధితులకు పునరావాసం, సహాయం తదితర చర్యలు చేపట్టేందుకు మిగిలిన శాఖలను కూడా సమన్వయం చేసుకుంటారు. 

బాధితులకు తక్షణ న్యాయం
దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో ఏహెచ్‌టీయూలు ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. వీటికి పోలీస్‌స్టేషన్‌ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల కేసుల నమోదు, దర్యాప్తు వేగంగా జరిగి దోషులకు శిక్షలు పడతాయి. బాధితులకు తక్షణ న్యాయం, వారికి పునరావాసం, పరిహారం అందుతుంది. 
    –ఎన్‌.రామ్మోహన్, హెల్ప్‌ సంస్థ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు