వరదలోనూ వాయువేగం 

26 Aug, 2020 04:55 IST|Sakshi
వరదలోనూ జరుగుతున్న పోలవరం స్పిల్‌ వే పనులు

శరవేగంగా పోలవరం జలాశయం పనులు

గోదావరిలో పది లక్షల క్యూసెక్కులకుపైగా ఉధృతిలోనూ నిర్విఘ్నంగా ప్రణాళిక ప్రకారం ముందుకు

స్పిల్‌ వే బ్రిడ్జి పనులు వేగవంతం

విద్యుత్కేంద్రం, స్పిల్‌ చానల్‌లో రోజూ 20 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు

గ్యాప్‌1 ఈసీఆర్‌ఎఫ్‌ డయాఫ్రమ్‌ వాల్‌ పనులు ప్రారంభం

2021 చివరికి ప్రాజెక్టు పూర్తయ్యేలా వడివడిగా అడుగులు  

గోదావరి వరద ఉధృతితో పోటీపడుతూ పోలవరం స్పిల్‌ వే పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం పోలవరం ప్రాజెక్టు వద్ద 10.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పనులు ఆగలేదు. కార్మికులకు బాడీ సేఫ్టీ బెల్ట్‌లు సమకూర్చి రెండు పడవల్లో గజ ఈతగాళ్లను రంగంలోకి దించి స్పిల్‌ వే బ్రిడ్జి పనులను శరవేగంగా చేస్తుండటంతో నవంబర్‌ నాటికల్లా ఇది పూర్తి కానుంది. గత సర్కారు హయాంలో గోదావరిలో కేవలం పదివేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే చాలు పనులు నిలిచిపోగా ఇప్పుడు 10.50 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద వచ్చినా పనులు నిర్విఘ్నంగా, శరవేగంగా కొనసాగుతుండటం గమనార్హం. 

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి వరద ఉధృతితో పోటీపడుతూ ప్రాజెక్టు పనులు ’మెగా’ స్పీడ్‌తో జరుగుతున్నాయి. స్పిల్‌ వే బ్రిడ్జితోపాటు ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) గ్యాప్‌3లో కాంక్రీట్‌ డ్యామ్‌ పునాది పనులు.. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌1లో డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు.. జలవిద్యుత్కేంద్రం, స్పిల్‌ చానల్‌లో మట్టి పనులు.. స్పిల్‌ వేకు గేట్లను బిగించేందుకు ’ట్రూనియన్‌ బీమ్‌’ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద ఈనెల 12 నుంచి 20వతేదీ  వరకూ అతి భారీ వర్షం కురవడంతో తొమ్మిది రోజులు పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. వర్షాలు తగ్గడంతో 21న పనులు పునఃప్రారంభం కాగా అదేరోజు పోలవరం ప్రాజెక్టు వద్దకు 19 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అంత ఉధృతిలోనూ మొదలైన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.  

► పోలవరం స్పిల్‌ వే గేట్లు బిగించే పనులు అక్టోబర్‌లో ప్రారంభించి ఏప్రిల్‌కు పూర్తి చేయనున్నారు.  
► 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కాంట్రాక్టు సంస్థ ఎంఈఐఎల్‌(మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌), జలవనరులశాఖ అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. ప్రణాళిక అమలు తీరును జలవనరుల శాఖ మంత్రి 
అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 
► వరద ఉధృతిలోనూ స్పిల్‌ వేకు గేట్లు బిగించడానికి ట్రూనియన్‌ బీమ్‌ పనులు చేస్తున్నారు. 
► స్పిల్‌ చానల్‌ 902 హిల్‌లోనూ, జలవిద్యుత్కేంద్రం పునాదిలోనూ రోజూ 20 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేస్తున్నారు. డిసెంబర్‌కు జలవిద్యుత్కేంద్రం పునాది పూర్తవుతుంది. ఆ తర్వాత 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనులు చేపడతారు. 
► ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌3లో కాంక్రీట్‌ డ్యామ్‌ పునాది కోసం మట్టి తవ్వకం పనులు చేస్తున్నారు.  
► పోలవరం జలాశయానికి కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్‌ పనుల్లో కుడివైపు పనులు పూర్తయ్యాయి. ఎడమవైపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. 

ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా పూర్తి.. 
పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌ చివరకు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణ అమలు చేస్తున్నాం. లాక్‌డౌన్‌లోనూ పనులు చేశాం. గోదావరి వరద ఉధృతిలోనూ కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసి పోలవరం ఫలాలను రైతులకు అందిస్తాం. 
– ఆదిత్యనాథ్‌ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ. 

మరిన్ని వార్తలు