తిరుపతి పాత పేర్లు తెలుసా? ఆ ఆధ్యాత్మిక నగరం ఆవిర్భవించింది నేడే!

24 Feb, 2023 04:08 IST|Sakshi

తిరుమలను తలచుకుంటే.. గోవింద నామం మనస్సులో మార్మోగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం మనో నేత్రం ఎదుట ప్రత్యక్షమవుతారు. ఏడు కొండలవాడు కొలువైన తిరుమల ఆలయంతోపాటు ఆయన పాదాల చెంత ఉన్న తిరుపతి నగరం ఆవిర్భావమూ ఆసక్తికరమే. కలియుగం (కలియుగం మొ­­దలై ఫిబ్రవరి 13వ తేదీ నాటికి 5,125 ఏళ్లు పూర్తయింది)లో శ్రీనివాసుడు ఏడు కొండలపై శిలారూపంలో కొలువుదీరగా.. ఆ స్వామిని కొలిచే భ­క్తు­ల ఆవాసాల కోసం ఏడు కొండల దిగువన తిరు­పతి వెలసింది.

పూర్వం తిరుమల చుట్టూ అడవు­లు, కొండల నడుమ అలరారే శ్రీవారి ఆల­యం మా­­త్రమే ఉండేది. భక్తులు క్రూర జంతువుల భ­యం­తో గుంపులుగా కాలినడకన తిరు­మల యాత్ర చేసేవారు. పూర్వం శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహ­ణ, ధ్వజారోహణం మాత్ర­మే తిరుమల కొండపై నిర్వహించేవారు. వాహన సేవలన్నీ తిరుచానూరులోనే నిర్వహించేవారు. ప్రతిరోజూ తిరుచానూరు నుంచి తిరుమలకు వెళ్లి రావటం ఇబ్బందిగా ఉండటంతో అర్చకులు కపిల తీర్థం వద్ద నివాసాలు ఏ­ర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతం పేరు కొత్తూ­రు, కోటవూరుగా పిలిచేవారు.  
– (సాక్షి, ఏపీ నెట్‌వర్క్‌) 


రామానుజాచార్యులచే శంకుస్థాపన 
శ్రీనివాసుని పూజా కైంకర్యాలను వైఖానస సంప్రదాయంలో కొనసాగించాలని నిర్దేశించిన జగద్గురువు రామానుజాచార్యులు అర్చకుల నివాసాల కోసం తిరుచానూరు–తిరుమల మధ్య నేటి పార్థసారథి ఆలయ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. శ్రీరంగం నుంచి శ్రీరంగనాథస్వామి శిలావిగ్రహాన్ని తెప్పించి పార్థసారథి సన్నిధికి పక్కన  ప్రతిష్టించేందుకు   ఆలయాన్ని నిర్మించారు .

ఆ విగ్రహాన్ని తరలించే సమయంలో స్వల్పంగా దెబ్బ తినటంతో దాన్ని పక్కన పెట్టి.. ఆ ఆలయంలో గోవిందరాజస్వామిని తిరుమలేశుని ప్రతిరూపంగా ప్రతిష్టించారు. పక్కనపెట్టిన రంగనాథస్వామి విగ్రహం ప్రస్తుతం మంచినీళ్ల కుంట ఒడ్డున దర్శనమిస్తోంది. ఆ తర్వాత 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన గోవిందరాజస్వామి ఆలయం నాలుగు వైపులా మాడ వీధులు, అందులో అర్చకుల నివాసాలకు రామానుజాచార్యులు శంకుస్థాపన చేశారు.

ఆ బ్రాహ్మణ అగ్రహారాన్నే తర్వాత గోవిందపట్నంగా.. రామానుజపురంగా పిలిచేవారు. ఆ తరువాత 1220–40 మధ్యకాలం నుంచి తిరుపతిగా పేరొందింది. అప్పటినుంచి తిరుపతిలో ఆవాసాలు, ఆలయాలు పెరుగుతూ వచ్చి ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంది. 120 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన రామానుజాచార్యులు మూడుసార్లు తిరుమలకు వచ్చారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆయన తన 112వ ఏట గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ, మాడ వీధులకు శంకుస్థాపన చేశారు. దీని ప్రకారం తిరుపతి ఆవిర్భవించి ఈ నెల 24వ తేదీకి 893 సంవత్సరాలు అవుతోంది.

వెలుగులోకి తెచ్చిన భూమన 
వెలుగుచూసిన అంశాలపై తిరుపతి ఎమ్మెల్యే భూ­మన కరుణాకరరెడ్డి సమగ్ర అధ్యయనం చేయించి 2022 ఫిబ్రవరి 24న తొలిసారిగా తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది టీటీడీ, తిరుపతి నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 893వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్టు భూమన ప్రకటించారు.

ఆ వేడుకల్లో భాగంగా నగర వాసులందరూ భాగస్వాములయ్యే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు నాలుగు మాడవీధుల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

 పరమ పవిత్రం తిరుపతి 
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పరమ పవిత్రమైనది. ముక్కోటి దేవతలు శ్రీగోవిందరాజస్వామిని కొలుస్తారు. ఇక్కడ స్థానికులతో పాటు అనేక మంది  వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన  వారు ఉన్నారు. తిరుపతి ప్రాముఖ్యత గురించి తెలియజేయాలన్నదే నా తపన. ప్రతి ఒక్కరూ నగర ప్రాభవాన్ని కాపాడుకోవాలి. తిరుపతి వైభవాన్ని చాటిచెబుదాం. శ్రీవారి నిలయమైన తిరుపతి ఆవిర్భావ వేడుకలను  కలిసిమెలసి జరుపుకుందాం.   
– భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు