క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు

4 Feb, 2023 15:35 IST|Sakshi

రన్నర్‌లుగా ప్రభుత్వ పాలిటెక్నిక్,   ఆంధ్రా లయోల కాలేజీ

విజేతలకు ట్రోఫీలు అందజేసిన ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా

విజయవాడ స్పోర్ట్స్‌: సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్పీఎల్‌) ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి జూనియర్, సీనియర్‌ పురుషుల క్రికెట్‌ పోటీలు ముగిశాయి. కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో పది రోజుల పాటు హోరాహోరీగా జరిగిన ఈ టోర్నీలో 12 జూనియర్,  28 సీనియర్‌ జట్లు తలపడ్డాయి. రెండు విభాగాల్లో శుక్రవారం జరిగిన ఫైనల్స్‌ ఉత్కంఠభరితంగా సాగింది.

జూనియర్స్‌ విభాగంలో ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, సీనియర్స్‌ విభాగంలో ఆంధ్రా లయోల ఇంజినీరింగ్‌ కాలేజీ, నలంద డిగ్రీ కాలేజీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లను పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టాస్‌ వేసి ప్రారంభించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన జట్లను అభినందించారు. క్రీడల్లో రాణిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని చెప్పారు.  

ఎన్‌ఆర్‌ఐ విశ్వరూపం... 
టోర్నీ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కాలేజీ జట్టు ఫైనల్స్‌లో అదే క్రీడా ప్రతిభను కనబర్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ సత్తా చాటి తన ప్రత్యర్ధి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ జట్టుపై 78 రన్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఎన్‌ఆర్‌ఐ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 130 పరుగులను సాధించింది. బ్యాట్స్‌మెన్‌లు రూపేష్‌ ఆర్ధసెంచరీ (28 బాల్స్, 2 సిక్స్‌లు, 9 ఫోర్లు, 64 రన్స్‌)తో, ఇక్తాన్‌సింగ్‌ 33 పరుగులతో రాణించారు.

భారీ స్కోరు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాలిటెక్నిక్‌ జట్టును ఎన్‌ఆర్‌ఐ బౌలర్లు 52 పరుగులకు కట్టడి చేసి జూనియర్స్‌ విభాగంలో జిల్లా స్థాయి విజేతగా నిలవడమే కాకుండా సెంట్రల్‌ ఆంధ్రా ఎస్పీఎల్‌ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టుకు ఎంపికైంది. ఈ మ్యాచ్‌లో 64 రన్స్‌ చేసిన ఎన్‌ఆర్‌ఐ బ్యాట్స్‌మెన్‌ రూపేష్‌  మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. జూనియర్స్‌ విభాగంలో రన్నర్‌గా పాలిటెక్నిక్‌ జట్టు నిలిచింది. 

ఉత్సాహాన్నిచ్చింది
సాక్షి మీడియా గ్రూప్‌ నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్‌ లీగ్‌’ (ఎస్పీఎల్‌) ఎంతో ఉత్సాహానిచ్చిందని ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కాలేజీ కెప్టెన్‌ రేవంత్, నలంద డిగ్రీ కాలేజీ జట్టు కెప్టెన్‌ సుశాంత్‌నాయుడు అన్నారు. ట్రోఫీలను అందుకున్న అనంతరం వారు సాక్షితో మాట్లాడారు. కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల కోసమే సాక్షి ఈ టోర్నీ  నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఒక్కో జట్టుతో తలపడినపుడు ఒక్కో విషయాన్ని గ్రహించామన్నారు. ప్రత్యర్ధి జట్లు ఎలా ఉంటాయనేది తెలుసుకున్నామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాక్షి యాజమాన్యం చర్యలు తీసుకుందన్నారు.

క్రీడా నైపుణ్యం సాధించేందుకు ఎస్పీఎల్‌ దోహదం
క్రీడా నైపుణ్యం సాధించేందుకు సాక్షి ప్రీమియర్‌ లీగ్‌  దోహద పడతుందని సీపీ టీకే రాణా అన్నారు. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన విజేతలకు ట్రోఫీలు అందజేశారు. సీనియర్స్‌ విభాగంలో నలంద డిగ్రీ కాలేజీ జట్టుకు విన్నర్‌ ట్రోఫీని, ఆంధ్రా లయోల ఇంజినీరింగ్‌ కాలేజీ జట్టుకు రన్నర్‌ ట్రోఫీని, జూనియర్స్‌ విభాగంలో ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ జట్టుకు విన్నర్‌ ట్రోఫీని, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ జట్టుకు రన్నర్‌ ట్రోఫీని అందజేశారు. సాక్షి రెసిడెంట్‌ ఎడిటర్‌ రమణమూర్తి, ఏపీ అడ్మిన్‌ డీజీఎం కె.ఎస్‌.అప్పన్న, కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎ.వి.రత్నప్రసాద్, బ్రాంచ్‌ మేనేజర్‌ యశోధ్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఎస్పీఎల్‌ జూనియర్‌ విజేత జట్లకు క్రికెట్‌ కిట్‌లు అందజేత
విజయవాడ స్పోర్ట్స్‌: సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్పీఎల్‌) జూనియర్‌ బాలుర ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీల్లో విజేతలకు క్రికెట్‌ కిట్లను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. జూనియర్స్‌ విభాగాన ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల జట్ల మధ్య శుక్రవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ను ఎమ్మెల్యే టాస్‌ వేసి ప్రారంభించారు. ఈ రెండు జట్ల క్రీడాకారులు కోరిన మేరకు రెండు క్రికెట్‌ కిట్‌లను ఎమ్మెల్యే సారథి వెంటనే మంజూరు చేశారు. క్రీడాకారులు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. 

మరిన్ని వార్తలు