రాష్ట్రమంతా క్రీడా సంబరాలు 

14 Oct, 2021 05:00 IST|Sakshi

సీఎం కప్‌ టోర్నీకి సన్నాహాలు 

13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో నిర్వహణ 

‘సీఎం కప్‌’లో తొలిసారిగా క్రికెట్‌ 

20న శ్రీకాకుళం, 21న విశాఖలో పోటీలు ప్రారంభం 

సాక్షి, అమరావతి: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేలా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్‌ టోర్నీ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) సన్నాహాలు చేస్తోంది. దసరా నుంచి ఉగాది వరకు క్రీడా సంబరాన్ని అందించనుంది. మహిళల, పురుషుల విభాగంలో 13 క్రీడాంశాల్లో ఈ ఓపెన్‌ మీట్‌ నిర్వహిస్తుంది. మొత్తం మూడు నుంచి నాలుగు దశల్లో జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయి. ఫేజ్‌–1లో భాగంగా అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్‌ పోటీలకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 20న శ్రీకాకుళం, 21న విశాఖపట్నంలో పోటీలు ప్రారంభం కానున్నాయి. సీఎం కప్‌లో తొలిసారిగా క్రికెట్‌ను చేర్చడం విశేషం.  

175 నియోజకవర్గాల్లో పోటీలు.. 
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల నుంచి క్రీడాకారులు పోటీపడనున్నారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్లకు మళ్లీ పోటీలు నిర్వహించి బహుమతుల ప్రదానం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రతిభగల క్రీడాకారులతో జిల్లా జట్టును ఎంపిక చేస్తారు. డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు ఒక్కో జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి.
  
క్రీడాంశాలివే..  

అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్‌ క్రికెట్‌ తదితర క్రీడలున్నాయి. 

ప్రతిభను వెలికితీసేందుకు.. 
రాష్ట్రంలో ఎందరో ప్రతిభగల క్రీడాకారులున్నారు. అటువంటి వారిని గుర్తించి, మంచి శిక్షణ అందిస్తే దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదుగుతారు. ఈ క్రమంలోనే సీఎం కప్‌ టోర్నీని నిర్వహిస్తున్నాం. తొలిసారిగా క్రికెట్‌ను కూడా ప్రవేశపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు కొత్త పాలసీని కూడా తీసుకొస్తోంది. తద్వారా క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుంది.   
– ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, ఎండీ, ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ  

మరిన్ని వార్తలు