వనం వదిలి.. చిక్కుల్లో పడి..

18 Jun, 2021 08:15 IST|Sakshi
నందిగామ మండలం పల్లగిరిలో దుప్పిని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ సిబ్బంది.. బందరు మండలం కోనలో గ్రామస్తులకు పట్టుబడిన దుప్పి

కోనేరుసెంటర్‌ (మచిలీపట్నం)/నందిగామ: దారి తప్పిన దుప్పులు వనం వదిలి జనారణ్యంలోకొచ్చాయి. కాసేపు గంతులేశాయి. చివరికి చిక్కుల్లో పడ్డాయి. వాటిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని క్షేమంగా అడవిలో వదిలేందుకు చర్యలు చేపట్టారు. బందరు మండలం కోన, నందిగామ మండలం పల్లగిరి వద్ద గురువారం ఈ ఘటనలు జరిగాయి. అటవీ అధికారుల కథనం ప్రకారం.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదుగానీ బందరు మండలం కోన గ్రామంలో ఉన్నట్టుండి దుప్పి ప్రత్యక్షమైంది. కాసేపు గెంతుతూ సందడి చేసింది. గ్రామస్తులు దానిని వెంబడించి పట్టుకుని తాళ్లతో బంధించారు. విషయం తెలుసుకున్న సచివాలయం సిబ్బంది బందరు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుప్పిని పరిశీలించిన ఎస్‌ఐ దాసు అటవీశాఖ అధికారులకు విషయం తెలిపారు. అధికారులొచ్చి దుప్పిని విజయవాడ తీసుకెళ్లారు.

కొంచెం అనారోగ్యంగా ఉందని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కొండపల్లి అటవీ ప్రాంతంలో వదులుతామని వారు తెలిపారు. అలాగే, నందిగామ మండలం పల్లగిరి సమీపంలో మరో దుప్పి ప్రత్యక్షమైంది. వీధి కుక్కల దాడిలో స్వల్పంగా గాయపడింది. గ్రామస్తులు దుప్పిని రక్షించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి దుప్పికి చికిత్స చేయించారు. అనంతరం దానిని కొండపల్లి రిజర్వు ఫారెస్టులో విడిచిపెట్టినట్టు అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ లెనిన్‌కుమార్‌ వెల్లడించారు. 
 

మరిన్ని వార్తలు