కొలువుల ఖిల్లా నెల్లూరు జిల్లా.. కృష్ణపట్నం వద్ద రూ.5,783 కోట్లతో..

14 May, 2022 09:17 IST|Sakshi

ఉద్యోగ, ఉపాధిలో సింహభాగం 

క్రిబ్‌కో పరిధిలో రూ.560 కోట్లతో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ 

రాబోయే రోజుల్లో జిల్లాలో 3 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు  

పరోక్షంగా మరో 1.8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు  

మేకపాటి గౌతమ్‌రెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు బీజం 

పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న జిల్లా.. కొలువుల ఖిల్లాగా మారనుంది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందుకు బీజాలు పడ్డాయి. సింహపురి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారు. జిల్లా నలుదిశలా సమగ్రాభివృద్ధి కోసం ప్రయత్నాలు ముమ్మరయ్యాయి. లక్షలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. నిర్దిష్టమైన పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది. క్రిస్‌సిటీకి కేంద్ర పర్యావరణ అనుమతులు సాధించింది. బయో ఇథనాల్‌ ఫ్లాంట్, వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయించింది.   

సాక్షి, నెల్లూరు: విశాల సముద్రతీరం.. అత్యధిక విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు.. అందుబాటులో రహదారి, జల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్న జిల్లా పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం తప్ప.. పారిశ్రామిక జాడల్లేని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బీజాలు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణపట్నంపోర్టుకు అనుబంధంగా క్రిస్‌ సిటీకి ఏర్పాటుకు అన్ని అనుమతులు లభించాయి. క్రిబ్‌కో పరిధిలో బయో ఇథనాల్‌ ప్లాంట్, నెల్లూరు రూరల్‌ మండలం కొత్తూరులో రూ.100 కోట్లతో ఆస్పత్రి, మెట్ట ప్రాంతం ఉదయగిరిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.  

యువతకు ఉద్యోగాల వెల్లువ  
జిల్లాలో యువతకు వెల్లువగా ఉద్యోగాలు రానున్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో క్రిస్‌ సిటీ ఏర్పాటు కానుంది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ పేరుతో టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్‌ఎంఈ రంగాల పరిశ్రమలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 2.96 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు, 1.71 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దక్కనుంది. తొలి దశలో రూ.1,500 కోట్లతో 2,006 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం పర్యావరణ అనుమతులు, కండలేరు ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అనుమతులు లభించాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్‌ భారతి కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (క్రిబ్‌కో) పరిధిలో రూ.560 కోట్లతో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్‌ ఆమోదం తెలిపింది. 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌ ద్వారా 400 మందికి ఉద్యోగాకాశాలు లభించనున్నాయి.  

చదవండి: (AP: పరిశ్రమలకు భారీ ఊరట.. ఆంక్షలు ఎత్తివేత)

ఆక్వా ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు  
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెన్నారాయునిపాళెం నుంచి తడ వరకు 169 కిలో మీటర్ల మేర సముద్ర తీరం ఉంది. సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న 2 లక్షల మంది మత్స్యకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 46 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతుంది. రెట్టింపు స్థాయిలో ఎగుమతి చేసుకునే అవకాశాలను అందిపుచ్చుకునే చర్యలను చేపట్టుతోంది. అక్వా ఉత్పత్తులు ఆర్బీకేలకు అనుసంధానం చేసి ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం అడుగులు పడ్డాయి.  

ఉదయగిరిలో అగ్రికల్చర్‌ యూనివర్సిటీ  
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో ఉదయగిరి ఎంఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ప్రాంగణంలో అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మెట్ట ప్రాంతంలో వ్యవసాయ యూనివర్సిటీ అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగానికి ప్రయోజనకారిగా మారనుంది. విద్యార్థులకు యూనివర్సిటీ అందుబాటులోకి రావడమే కాకుండా పరిశోధనలు ద్వారా అదునాతున వంగడాలు మెట్ట ప్రాంతం ఉన్నతికి యోగ్యకరంగా మారనుంది. రూ.100 కోట్లతో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కేటాయిస్తూ నెల్లూరు రూరల్‌ మండలం కొత్తూరు వద్ద నూతన ఆస్పత్రి నిర్మాణానికి 4 ఎకరాలు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. 

సీఎం చొరవతో పారిశ్రామికాభివృద్ధి 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో కృష్ణపట్నంలో క్రిస్‌సిటీ, సర్వేపల్లి వద్ద క్రిబ్‌కో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కావడం శుభ పరిణామం. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ మంత్రి అయిన కొద్ది రోజులకే రూ.560 కోట్లతో ప్లాంటు మంజూరు కావడం గర్వంగా ఉంది. ఈ ప్లాంటు వల్ల  సుమారు 500 మందికి ఉద్యోగ, ఉపా«ధి అవకాశాలు లభిస్తాయి. యువతకు ఇది సంతోకరమైన విషయం.   
– రాగాల వెంకటేశ్వర్లు, రైతు, కృష్ణపట్నం  

పారిశ్రామిక ప్రగతి  
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పలు పరిశ్రమలు రాగా, ప్రస్తుతం కృష్ణపట్నంలో క్రిస్‌ సిటీ, సర్వేపల్లి వద్ద క్రిబ్‌కో బయో ఇథనాల్‌ ప్లాంట్‌తో పాటు కొడవలూరు మండలంలోకి మరో పరిశ్రమ రావడంతో జిల్లా పారిశ్రామికంగా ప్రగతి పథంలో నడుస్తుంది. భవిష్యత్‌లో జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుంటారు.  
– తలతోటి ప్రసన్నకుమార్, చంద్రశేఖర్‌పురం, కొడవలూరు మండలం 

ఉపాధి అవకాశాలు మెండు  
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పరిశ్రమలు వస్తున్నాయి. దీంతో మావంటి విద్యను అభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుంది. ముఖ్యంగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. ఇది అభినందనీయం. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వస్తే మరింత ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  
– కాగోల్లు పవన్, బీటెక్‌ విద్యార్థి, దండిగుంట, విడవలూరు మండలం    

మరిన్ని వార్తలు