SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు

18 May, 2022 09:26 IST|Sakshi
కొట్టుకుపోయిన వరికుంటపాడు మండలంలోని ఫైబర్‌ చెక్‌డ్యామ్‌  (ఫైల్‌ ) 

టీడీపీ హయాంలో అవి‘నీటి’ డ్యామ్‌లు 

రూ.711 కోట్లతో 13,780 పనులు 

తనిఖీల్లో మచ్చుకైనా కనిపించని పనుల జాడ 

పలు పనుల బిల్లుల చెల్లింపు పెండింగ్‌ 

ఇంకా పెండింగ్‌లో ఉన్న 3,308 పనుల పరిశీలన 

501 పనులకు బిల్లులు చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించిన తమ్ముళ్లు 

పనులను తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశాలు  

43 బృందాల ఏర్పాటు  

జిల్లాలో టీడీపీ హయాంలో నీరు–చెట్టు పథకాన్ని తమ్ముళ్లు జేబులు నింపుకునే పథకంగా మార్చుకున్నారు. ఆ పనుల్లో నాణ్యత లేకపోవడంతో అప్పట్లోనే రూపురేఖలు లేకుండా పోయాయి. ఆ పనులపై జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో చాలా వాటికి అధికారులు బిల్లులు నిలిపివేశారు. గత ప్రభుత్వ చివరి కాలంలో చేసిన పనులకు అప్పటి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడు ఆయా బిల్లులు చెల్లించాలంటూ తెలుగు తమ్ముళ్లు హైకోర్టును ఆశ్రయించడంతో జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆయా పనులకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. 

సాక్షి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ పాలనలో నీరు–చెట్టు పథకం కింద రూ.వందల కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో ఒక్కటీ ప్రయోజనకరంగా లేకుండా పోయాయి. తెలుగు తమ్ముళ్లకు దోచి పెట్టడానికే ఈ పథకాన్ని అప్పటి ప్రభుత్వం అమలు చేసిందనేది జగద్వితం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కోవూరు మాజీ ఎమ్మెల్యేలు, మిగతా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అందిన కాడికి జేబులు నింపుకున్నారనే ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. టీడీపీ ఐదేళ్ల కాలంలో జిల్లాకు 13,780 నీరు–చెట్టు పనులు మంజారయ్యాయి. ఆయా పనులకు రూ.711 కోట్లు నిధులు మంజూరు చేశారు.

జిల్లాలోని ఆయా నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ద్వితీయ శ్రేణి నేతలకు నీరు–చెట్టు పనులను పందేరం చేసి వాటాలు పంచుకున్నారు. ఎన్నికల చివరి ఏడాదిలో కూడా దాదాపు రూ.200 కోట్ల మేర పనులు హడావుడిగా తూతూ మంత్రంగా చేపట్టి నిధులు ఆరగించేందుకు పథకం వేసి విఫలమయ్యారు. అప్పట్లో టీడీపీ నేతలు, జలవనరుల శాఖ అధికారులు సైతం నీరు–చెట్టు అవినీతిలో భాగస్వామ్యులై నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. దాదాపు రూ.300 కోట్ల వరకు దోపిడీ జరిగిందనే ఆరోపణలున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో బిల్లులు నిలిచిపోయాయి. నీరు–చెట్టు పథకం అంతా పచ్చ నేతల ఫలహారంగానే మారినట్లుగా గతంలో విజిలెన్స్‌ పరిశీలనలో నిగ్గు తేలింది. 

అవి‘నీటి’ చెక్‌డ్యామ్‌లు  
గత ప్రభుత్వ హయాంలో 751 చెక్‌డ్యాంలను నిర్మించారు. ఇందులో కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోనే 80 శాతానికి పైగా చెక్‌డ్యాంల నిర్మాణాలు జరిగాయి. ఒక్క ఉదయగిరి నియోజకవర్గలోనే 400 చెక్‌ డ్యాంలు నిర్మించి రూ.40 కోట్లు పైగా బిల్లులు డ్రా చేసుకున్నారు. ఇందులో రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అవసరం లేని ప్రాంతాల్లో కూడా చెక్‌డ్యాంలు నిర్మించి ప్రజాధనం వృథా చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఉదయగిరి నియోజకవర్గంలో నాగపూర్‌ టెక్నాలజీ పేరుతో అప్పటి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు స్వయంగా కాంట్రాక్ట్‌ దక్కించుకుని, కార్యకర్తలకు సబ్‌ కాంట్రాక్ట్‌గా అప్పగించారు.

గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని బొల్లినేని, ఆయన అనుచరులు ఫైబర్‌ చెక్‌డ్యాముల ముసుగులో భారీ దోపిడీ చేసిన వైనం విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. నియోజకవర్గంలో 24 ప్యాకేజీలుగా 210 ఫైబర్‌ చెక్‌ డ్యామ్‌లకు దాదాపు రూ.72 కోట్లు నిధులు మంజూరు చేయించి తన అస్మదీయులుకు కమీషన్ల రూపంలో పందేరం చేశారు. ఆయా టెండర్లను తన సూట్‌కేసు కంపెనీలైన సిగ్మా, శ్రీనివాస కంపెనీల పేరుతో టెండర్లు వేయించి పనులు దక్కించుకున్నారు. చెక్‌డ్యామ్‌ నిర్మాణాల్లో నాణ్యత లేకుండా మమ అనిపించి నిధులు ఆరగించినట్లు గత తనిఖీల్లో తేల్చారు. నీరు–చెట్టు పనులు అన్ని కూడా పూడికతీత, కుంటలు తీయడం, ఊట కంటలు, చెక్‌డ్యామ్‌లు అయా పనుల్లో చాలా వరకు అక్రమాలు జరిగాయి. కొన్ని చోట్ల పనులు చేయకుండానే బిల్లులు చేసుకొని తెలుగు నేతలు స్వాహా చేసిన ఘటనలు ఉన్నాయి.  
  
హైకోర్టును ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు 

జిల్లాలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో సంబంధిత జలవనరుల శాఖ అధికారులు సైతం చివరి దశలో బిల్లుల చెల్లింపును పెండింగ్‌ పెట్టారు. దాదాపు 3,308 పనులకు సంబంధించి ఎంబుక్స్‌ నమోదు చేయలేదు. ఆయా పనులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఆధారాలు కూడా లేకపోవడంతో అధికారులు మిన్నకుండిపోయారు. అయితే 501 పనులకు సంబంధించి బిల్లులు ఇప్పించాలని వర్క్‌ ఆర్డర్‌ దక్కించుకున్న టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 206 పనులను ఇంజినీరింగ్‌ బృందాలు తనిఖీలు చేశాయి. మిగిలిన 295 పనులను తనిఖీలు చేయాల్సి ఉంది.   


సీతారామపురం మండలంలో నిర్మించిన నాసిరకం చెక్‌డ్యామ్‌ (ఫైల్‌)

తనిఖీలకు 43 బృందాలు   
జిల్లాలో నీరు–చెట్టు పనులను పరిశీలించి నివేదికలు అందించాలని 43 ప్రత్యేక బృందాలను కలెక్టర్‌ ఏర్పాటు చేశారు. ఈ బిల్లులు చెల్లింపునకు సంబంధించి కొందరు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితిపై పలు ఇంజినీరింగ్‌ శాఖల అధికారులతో బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశాలిచ్చారు. 


ఉదయగిరి ప్రాంతంలో నాసిరకంగా నిర్మించిన చెక్‌డ్యామ్‌ (ఫైల్‌ )

ఫైబర్‌ చెక్‌డ్యామ్‌లోనూ అంతే  
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అప్పటి ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నయా టెక్నాలజీ పేరుతో ఫైబర్‌ చెక్‌డ్యాంలకు నిధులు మంజూరు చేయించుకున్నారు. మహారాష్ట్ర టెక్నాలజీ అంటూ గొప్పగా ప్రచారం చేసుకొని నీటి సామర్థ్యాన్ని తట్టుకునే ఇనుప గేట్లకు బదులుగా ఫైబర్‌ గేట్లు వినియోగించారు. అయితే ఈ ఫైబర్‌ గేట్లు ఏడాది తిరగక ముందే చిన్నపాటి వర్షాలకు కొట్టుకుపోయాయి. నియోజకవర్గంలో రూ.68 కోట్లతో 201 ఫైబర్‌ చెక్‌డ్యాంలు నిర్మించి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. ఈ నియోజకవర్గంలోనే సుమారు 30 మందికి పైగా నేతలు లబ్ధిపొందారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. వీటి నిర్మాణాలపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు రావడంతో విజిలెన్స్‌ అధికారులు విచారణ నిర్వహించి పనుల్లో డొల్లతనంపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ పనులు చేసిన వారంతా అధికార పార్టీ వారు కావడం.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో ఈ నివేదికలు బుట్ట దాఖలయ్యాయి.  

‘నిరు’పయోగం 
►ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని ఎర్ర‡వాగుపై రూ.90 లక్షలతో నిర్మించిన చెక్‌డ్యాంలో ఫైబర్‌ గేట్లలో నాణ్యత లోపించడంతో నీరంతా లీకేజీతో బయటకు వెళ్లిపోయింది. రూ.లక్షలు ఖర్చు చేసినా ఉపయోగం లేకుండాపోయింది.  
►2016–17లో వరికుంటపాడు మండలం నారసింహాపురంలో రూ.60 లక్షలతో నిర్మించిన ఫైబర్‌ చెక్‌డ్యాం కొద్దిపాటి వర్షానికే గేట్లు కొట్టుకుపోయింది. దీంతో ఈ పనుల కోసం కేటాయించిన నిధులున్నీ దుర్వినియోగం అయినట్లయింది.  
►వింజమూరు మండలం రాగిపాడు పంచాయతీ పరిధిలో అవసరం లేకపోయినా రూ.40 లక్షలు వెచ్చించి ఓ చిన్న కాలువకు ఫైబర్‌ చెక్‌డ్యాం నిర్మించారు. పనులు చేసిన కొద్ది రోజులకే నాణ్యత లోపించి ప్రధాన కట్టడం నెర్రెలు బారి నాణ్యతా లోపం స్పష్టంగా కనిపించింది. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే. ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన 80 శాతం చెక్, ఫైబర్‌ డ్యామ్‌లు కేవలం ఐదారేళ్లల్లోనే కనుమరుగు అయ్యాయి.  

త్వరితగతిన తనిఖీలు పూర్తి చేస్తాం 
జిల్లాలో గతంలో జరిగిన నీరు– చెట్టు పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆయా పనులకు సంబంధించి వాస్తవ పరిస్థితిపై పూర్తిస్థాయిలో త్వరితగతిన తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ఇంజినీరింగ్‌ అధికారులతో 43 బృందాలను ఏర్పాటు చేశాం. 3,308 పనులకు సంబంధించి పనులను పరిశీలించాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పనులు పరిశీలన పూర్తి చేశారు. పనుల నిగ్గు తేల్చి హైకోర్టుకు నివేదిస్తాం. కోర్టు ఆదేశాలు మేరకు చర్యలు చేపడతాం.  
– కేవీఎన్‌ చక్రధర్‌బాబు, కలెక్టర్‌ 

  

మరిన్ని వార్తలు