అద్వితీయం.. బోయకొండ క్షేత్రం

27 Sep, 2022 11:44 IST|Sakshi

చిత్తూరు జిల్లాలో కాణిపాకం తరువాత అతిపెద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ క్షేత్రం నూతన శోభను సంతరించుకుంది. మూడేళ్లలోనే బోయకొండ అతి సుందరంగా రూపుదిద్దుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో వందల కోట్ల  రూపాయల నిధులు బోయకొండ అభివృద్ధికి వెచ్చించడంతో, రూపురేఖలు మారిపోయాయి. అత్యాధునిక సదుపాయాల మధ్య అమ్మవారి దసరా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.        

తొమ్మిది రోజుల పాటు అమ్మవారు  రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ బోయకొండ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుణ్యక్షేత్రం విశిష్టతపై ప్రత్యేక కథనం. 

చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆలయంలో సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వతేదీ వరకు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు  పూర్తయ్యాయి. భక్తులకు రోజూ వారీ సేవల వివరాలను తెలియజేయడానికి పోస్టర్లు ముద్రించి జిల్లాతోపాటు, కర్ణాటక, తమిళనాడులో పంపిణీ చేశారు. 
   
ఆలయ చరిత్ర  
జిల్లాలోని పుంగనూరు పట్టణానికి 14 కి.మీ దూరంలో ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటి. భారతావని నవాబులు పాలించే సమయంలో పుంగనూరు సంస్థానంపై నవాబుల కన్నుపడింది. గోల్కొండ నవాబు సైన్యం పుంగనూరు ప్రాంతంపై దండెత్తి గ్రామాల్లో చొరబడి దాడులు చేయడం మొదలుపెట్టింది. ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. పుంగనూరు వైపు వస్తున్న నవాబు పదాథిదళాలు చౌడేపల్లె వద్ద ఉన్న అడవుల్లో నివసించే బోయల, ఏకిల గూడేలలో బీభత్సం సíష్టించాయి. దీంతో బోయలు, ఏకిల దొరలు భయంతో కొండ గుట్టకు వెళ్లి తలదాచుకొని జగజ్జనని మాతను ప్రార్థించారు.

వీరిమొర ఆలకించిన శక్తి స్వరూపిణి వృద్ధురాలి రూపంలో వచ్చి బోయలకు ధైర్యం చెప్పిందని ప్రతీతి. నవాబుసేనలను అవ్వ తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది. అమ్మవారి ఖడ్గదాటికి రాతిగుండు సైతం నిట్ట నిలువుగా చీలిపోయింది. (ఇప్పటికీ ఈ రాతిగుండును చూడవచ్చు) నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని శాంతింపచేయడానికి ఒకమేకపోతును బలి ఇచ్చి తమతో పాటు ఉండాలని ప్రారి్థంచారు. వారి కోరిక మేరకు అక్కడే వెలసిన అమ్మవారిని దొర బోయకొండ గంగమ్మగా పిలవడం మొదలైంది. కొండపై హిందువులు కట్టుకున్న సిర్తారికోట, నల్లమందు పోసిన గెరిశెలు, గుట్టకింద అమ్మనీరు తాగిన స్థలం గుర్తులు, గుండ్లకు సైన్యం గుర్తులు, ఉయ్యాల ఊగిన గుండ్లు అమ్మవారి మహిమలకు నిదర్శనాలుగా చెప్పుకుంటారు. 

పవిత్రమైన పుష్కరిణి తీర్థం  
కొండపై వెలసిన అమ్మవారి ఆలయం సమీపాన ఉన్న పుష్కరిణిలోని నీరు అతిపవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. ఈ తీర్థంను సేవిస్తే సకల రోగాలు, పంటలపై తీర్థాన్ని చల్లితే చీడపీడలు, దుష్టసంబంధమైన గాలి భయాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.కేవలం రూ.20కే బాటిల్‌తో సహా తీర్థములను భక్తులకు అధికారులు అందుబాటులో ఉంచారు. 

అమ్మవారి పుష్ప మహిమ  భక్తులు తమ కోరికలు నెరవేరుతాయా లేదా అని తెలుసుకోవడానికి అమ్మవారి శిరస్సుపై మూడు పుష్పములు ఉంచి కోరికలను మనస్సులో స్మరించుకోమంటారు. అమ్మవారికి కుడివైపున ఆ పుష్పము పడినచో కోరికలు తీరుతాయని, ఎడమవైపు పడినచో ఆలస్యంగా నెరవేరుతాయని, మధ్యలో పడితే తటస్థంగా ఉంటాయని అమ్మవారి మాటగా భక్తులు భావిస్తారు. 

ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చినట్లు ఆలయ చైర్మన్‌ మిద్దెంటి శంకర్‌నారాయణ తెలిపారు. అమ్మవారి అలంకారాలతో తీర్చిదిద్దిన తొమ్మిది డిజిటల్‌ హెచ్‌డీ ఆర్చిలను బోయకొండపై ఏర్పాటు చేశామన్నారు. దసరా మహోత్సవాల్లో పాల్గొన దలచిన ఉభయదారులు రూ.5,116 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దుర్గా సప్తశతి చంఢీ హోమం (పౌర్ణమి రోజున) పాల్గొనే ఉభయదారులు రూ.2,116 చెల్లించి ఉభయదారులుగా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. శ్రీఘ్ర ఫలదాయిని పూజలో పాల్గొనే భక్తులు రూ.516 చెల్లించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉభయదారులచే అమ్మవారికి ప్రత్యేక పూజలతోపాటు ఊంజల్‌సేవ, అభిõÙకం, గణపతి, చంఢీహోమములు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఉభయదారులకు అమ్మవారి ప్రసాదము, పవిత్రమైన శేషవస్త్రం, చీరతోపాటురవిక, అమ్మవారి కుంకుమ, గాజులు, అమ్మవారి జ్ఞాపిక ఇవ్వనున్నట్లు ఈవో చంద్రమౌళి పేర్కొన్నారు. ఉభయదారుల నమోదుకోసం 79016 42845, 79016 42846ను సంప్రదించాలని కోరారు  

రవాణా మార్గాలు  
పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆలయానికి చౌడేపల్లె నుంచి 12 కిమీ, పుంగనూరు నుంచి 14 కి.మీ, మదనపల్లె నుంచి 16 కి.మీ దూరం ఉంది. ఈ మూడు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. బెంగళూరు నుంచి బోయకొండకు ప్రత్యేకంగా కర్ణాటక ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. గతంలో గతుకుల రోడ్లతో భక్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు డబుల్‌ రోడ్డు వేయడంతో ప్రయాణం సులభతరంగా మారింది. కొండ కింద నుంచి ఆలయం వరకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.   

మరిన్ని వార్తలు