ద్విముఖ రూపుడు.. జగన్మోహనుడు

9 Apr, 2022 14:56 IST|Sakshi

ఆత్రేయపురం(కోనసీమ జిల్లా): ముందు పురుష రూపం వెనుక భాగాన స్త్రీ రూపంతో ఏకశిలలో శివవిష్ణువులు సాక్షాత్కరించే అద్భుత నిలయం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. సృష్టికి ఆదిలోనే స్వయంభూ క్షేత్రంగా ఖ్యాతికెక్కిన ఈ పుణ్యక్షేత్రంలో ముందు భాగం కేశవ రూపం, వెనుక భాగం జగన్మోహినీ స్త్రీ రూపం ఆకారంలో స్వయంభువుగా అవతరించాడు. స్త్రీ, పురుష రూపధారణతో కొలువైన శివ, విష్ణు దేవతామూర్తులను దర్శించుకుంటే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. 

ఈ ఆలయంలో మరో విశేషమేమంటే భక్తులందరికీ గర్భాలయ ప్రవేశం ఉండటం. అంతేకాక ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి శివాలయం ఉండటం ఒక విశేషం. శివాలయంలో నీరు ఇంకిపోవడం, జగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదాల నుంచి నిరంతరం గంగ ఉద్భవించడం సృష్టి రహస్యాలుగా చరిత్ర చెబుతుంది. 

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ర్యాలి చేరుకునేందుకు గంట సమయం పడుతుంది. రావులపాలెం చేరుకున్న భక్తులు అక్కడ నుంచి ఊబలంక మీదుగా ర్యాలి చేరుకునేందుకు 6 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వుంటుంది. రావులపాలెం బస్టాండ్‌ నుంచి రెండు గంటలకోసారి ఆర్టీసీ బస్‌ సౌకర్యం ఉండడంతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా ర్యాలి దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు.  

కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు 
10న ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం గరుడ వాహనసేవ, రాత్రి 9 గంటలకు స్వామి వారి కల్యాణం, 14న సదస్యం, 16న చక్రస్నానం, 17న శ్రీపుష్పోత్సవంతో కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ ఈవో బి.కృష్ణ చైతన్య  తెలిపారు. 

మరిన్ని వార్తలు