ఇళ్ల నిర్మాణంపై ఈ ఏడుపేంటి!

25 Jul, 2021 05:23 IST|Sakshi
యండగండిలోని జగనన్న లేవుట్‌లో లబ్ధిదారులతో మంత్రి శ్రీరంగనాథరాజు

ఈనాడు రాతలపై మంత్రి శ్రీరంగనాథరాజు ఫైర్‌

నిజానిజాలు గుర్తించాలని హితవు

ఏలూరు (మెట్రో)/ఉండి: పేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇళ్లు నిర్మిస్తుంటే.. జీర్ణించుకోలేని ఎల్లో మీడియా విషపు రాతలతో బురద చల్లుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ముత్యాలమ్మ గుడి వద్ద లే–అవుట్‌లో నిర్మిస్తున్న గృహాలను హౌసింగ్‌ జేసీ సూరజ్‌ ధనుంజయ్‌తో కలసి శనివారం మంత్రి పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం ఏలూరులోని జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పేదలకు సెంటు స్థలమైనా ఇచ్చాడా అని నిలదీశారు.

ఆనాడు రామోజీరావుకు ఇది కనిపించలేదా అని ప్రశ్నించారు. ఒక్కో పేద కుటుంబానికి రూ.15 లక్షల ఆస్తి చొప్పున 31 లక్షల మంది పేదలకు ఆస్తులు ఇస్తుంటే ఓర్వలేకే విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం జరిగితే చూడగల శక్తి గానీ.. చూసి ఆనందించే శక్తి గానీ అటు రామోజీకి, ఇటు చంద్రబాబు కు, రాధాకృష్ణకు ఉందా అని నిలదీశారు. బాబు హయాంలో ఇళ్ల నిర్మాణంలో ఏపీ 27వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కొత్తగా స్థలాలు సేకరించి వందలాది ఇళ్ల నిర్మాణాల కోసం పూడికలు చేసి రోడ్లు నిర్మిస్తే అవి మునిగిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలు నిజాలు తెలుసుకోవాలన్నారు. 

వందేళ్లకు పైగా నిలబడేలా ఇళ్ల నిర్మాణాలు
గ్రేటర్‌ కమ్యూనిటీలకు దీటుగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లు 100 నుంచి 150 ఏళ్లపాటు దృఢంగా నిలబడేలా కడుతున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. భూసేకరణ చేసిన రెండు నెలల్లోనే రూ.12 వేల కోట్లు ఖర్చుచేసి స్థలాలను పూడ్పించి విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. రాష్ట్రంలో 17,500 వైఎస్సార్‌ జగనన్న లే–అవుట్లలో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, దీనివల్ల అనేక మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 15.60 లక్షల గృహాలు నిర్మిస్తుండగా.. లబ్ధిదారుల్లో 3.27 లక్షల మంది మూడో ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నారని తెలిపారు. వీరిలో ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని నియమించి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. లే–అవుట్‌ల వద్దకే ఇసుక, సిమెంట్, ఇనుము అందించి ఆర్థికంగా లబ్ధిదారులకు భారం కలగకుండా ప్రభుత్వం చేయూత అందిస్తోందని చెప్పారు.  

మరిన్ని వార్తలు