సామూహిక ఇళ్ల శంకుస్థాపనలకు సర్వం సిద్ధం

1 Jul, 2021 02:41 IST|Sakshi

గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి శ్రీరంగనాథరాజు సమీక్ష

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల’ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంపై మంత్రి బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈనెల 1, 3, 4వ తేదీల్లో జరిగే సామూహిక శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు ఈనెల 10 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల గృహాలకు శంకుస్థాపన పూర్తికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.

సెప్టెంబర్‌ నాటికి మొదటి దశలో 15.6 లక్షల గృహాలకు శంకుస్థాపనలు పూర్తి చేసి, 2022 జూన్‌ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి సిబ్బంది వరకు సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్, చీఫ్‌ ఇంజనీర్‌ పి.శ్రీరాములు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు