Tragic Accident In Sri Sathya Sai: సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియాకు, మెరుగైన చికిత్సకు ఆదేశం

30 Jun, 2022 10:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా ఘోర ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్‌ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

గురువారం ఉదయం ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్తు తీగ పడిన ఘటనలో.. ఐదుగురు మహిళలు సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. మృతిచెందిన వారిని గుడ్డంపల్లి వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోట్లకు చెందిన కుమారిగా గుర్తించారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు