Puttaparthi: ఆ ఏనుగంటే సత్యసాయికి ఎంతో ప్రేమ

23 May, 2022 14:56 IST|Sakshi
సాయిగీతతో సత్యసాయి (ఫైల్‌), (ఇన్‌సెట్‌)లో గజరాజు సమాధి మందిరం

పుట్టపర్తి అర్బన్‌(శ్రీసత్యసాయి జిల్లా): సత్యసాయి బాబాకు ఎంతో ఇష్టమైన ఓ ఏనుగు చనిపోవడంతో దానికి ఏకంగా ఆలయాన్నే నిర్మించారు. నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ‘గజరాజు’ ఆలయం పుట్టపర్తిలో నక్షత్రశాల పక్కనే ఉంది. ఈ ఆలయ నేపథ్యాన్ని పరిశీలిస్తే సత్యసాయి బాబా సకల జీవుల పట్ల చూపిన అంతులేని ప్రేమ స్ఫురణకు వస్తుంది. సత్యసాయిబాబా 1962లో తమిళనాడులోని బండిపూర అడవి నుంచి ఓ గున్న ఏనుగును కొనుగోలు చేసి పుట్టపర్తికి తీసుకొచ్చారు. దానికి ‘సాయిగీత’ అని పేరు పెట్టి.. ప్రేమతో పెంచుకుంటుండేవారు.
చదవండి: అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు!

ప్రశాంతినిలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ, పండుగల్లోనూ, ఊరేగింపుల్లోనూ బాబా ముందర సాయిగీత నడుస్తూ ఉండేది. దాని కోసం ప్రత్యేకంగా మావటీలను ఏర్పాటు చేసి, చిన్న షెడ్డులో ఉంచి సంరక్షించేవారు.  ప్రతి రోజూ మావటీలు ఏనుగును వాకింగ్‌కు తీసుకెళ్లేవారు. వయసు మీద పడడంతో 2007 మే 23న ‘సాయిగీత’ చనిపోయింది. ఆత్మ బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లని సత్యసాయి ఆరోజు సాయిగీత అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు.  స్థానిక నక్షత్రశాల పక్కనే దాన్ని సమాధి చేశారు. 10వ రోజున వైకుంఠ సమారాధన సైతం ఘనంగా నిర్వహించారు. అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం మరో గున్న ఏనుగును అప్పటి టీటీడీ చైర్మన్‌ ఆదికేశవుల నాయుడు సత్యసాయికి బహూకరించారు. అది అనారోగ్యంతో 2013లో మృతి చెందింది. దాన్ని సైతం సాయిగీత పక్కనే ఖననం చేశారు.

నిత్య పూజలు చేస్తున్న మావటి పెద్దిరెడ్డి 
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి సాయిగీతకు మావటిగా దాదాపు 23 ఏళ్లపాటు సేవలందించాడు. నిత్యం మేతగా చెరుకులు, నేపియర్‌ గడ్డి, రావి ఆకులు, మర్రి ఆకులు, అరటి గెలలు అందించేవాడు. ప్రతి రోజూ ఏనుగును సుమారు నాలుగు కిలోమీటర్లు వాకింగ్‌కు తీసుకెళుతుండేవాడు. ఏనుగు వచ్చినప్పుడు భక్తులంతా రోడ్డుకు ఇరువైపులా నిలబడి నమస్కరించేవారు. పెద్దిరెడ్డి ఇప్పటికీ పుట్టపర్తిలో ఉంటూ సాయిగీత ఆలయంలో నిత్య పూజలు చేస్తున్నారు. 

సాయిగీతకు మావటిగా పని చేయడం అదృష్టం 
సత్యసాయి బాబా ఎంతో ప్రేమగా చూసుకున్న సాయిగీతకు రెండు దశాబ్దాలకు పైగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నేను చెప్పిన మాటను బాగా వినేది. చుట్టూ ఎంత మంది భక్తులు ఉన్నా బెదరకుండా నడిచేది. సాయిగీత లేకున్నా బాబా ఆశీస్సులతో ఆశ్రమంలోనే ఉంటున్నా. జీవితాంతం బాబా, సాయిగీత సేవలోనే ఉండిపోతా. 
– పెద్దిరెడ్డి  

మరిన్ని వార్తలు