దివ్య మంగళరూపం నిజరూప దర్శనం

3 May, 2022 10:54 IST|Sakshi

అణువణువూ అనంత భక్తితత్వంతో నిండిన ప్రకృతి రమణీయతలో భువిపై కొలువుదీరిన లక్ష్మీనారాయణుడు.. భూలోక వైకుంఠం.. సింహగిరిపై వెలసిన వరాహనరసింహుడు. ఏడాదిపొడవునా చందనలేపిత సుగంధ ద్రవ్యాల్లో చల్లబడుతూ వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే మంగళకర నిజరూప దర్శనమిచ్చే భక్తవరదుడు.. నిండైన చందనంలో నిత్యం కొలువుండే నరహరి నిజరూపాన్ని కనులారా తిలకించి మనసారా తరించేందుకు సమయం ఆసన్నమైంది.. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 4 గంటల నుంచి ఆ భాగ్యం భక్తులకు లభించనుంది.   

సింహాచలం: సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనానికి వేళాయింది. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆ భాగ్యం భక్తులకు లభించనుంది. ఉదయం నాలుగు గంటల నుంచి స్వామి నిజరూప దర్శనం ప్రారంభం కానుంది. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు, వైదిక కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించిన అనంతరం వెండి బొరుగులతో చందనం వలుపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిజరూపభరితుడ్ని చేస్తారు.

అనంతరం ఆరాధన నిర్వహించి తొలి దర్శనాన్ని ఉదయం 3గంటల సమయంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు అందిస్తారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి స్వామికి పట్టువస్త్రాలు అందించే దేవాదాయశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, టీటీడీ తరఫున పట్టువస్త్రాలు అందించే అధికారులకు దర్శనం అందిస్తారు. అనంతరం ఉదయం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తారు. 

రాత్రి 7గంటల వరకే క్యూలో అనుమతి 
స్వామివారి నిజరూపదర్శనానికి విచ్చేసే భక్తులను రాత్రి 7 గంటలలోపు క్యూల్లోకి అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటివరకు క్యూల్లో వేచిఉన్న భక్తులకు స్వామివారి దర్శనాలు అందజేస్తారు. 

దర్శన సమయాలు 
ఉచిత, రూ.300  టిక్కెట్లు కలిగిన భక్తులందరికీ ఉదయం 4 గంటల నుంచి రాత్రి వరకు దర్శనం అందజేస్తారు. రూ.1500 టిక్కెట్టుపై వచ్చే ప్రోటోకాల్‌ వీఐపీలకు ఉదయం 4నుంచి 6 గంటలు తిరిగి 7 గంటల నుంచి 9 గంటల వరకు రెండు స్లాట్‌లు పెట్టారు. అలాగే రూ.1200 టిక్కెట్టుపై వచ్చే వీవీఐపీలకు కూడా ఉదయం 4గంటల నుంచి 6గంటల వరకు, తిరిగి 7గంటల నుంచి 9గంటల వరకు దర్శనాల సమయం కేటాయించారు. 

దివ్యాంగుల కోసం.. 
దివ్యాంగులకు సాయంత్రం 5గంటల నుంచి 6 గంటలలోపు దర్శన సమయాన్ని కేటాయించారు. ఉచిత, రూ.300,రూ.1000,రూ.1200,రూ.1500 టిక్కెట్ల క్యూలను, క్యూలపై షామియానాలు, టెంట్ల్‌ ఏర్పాటు చేశారు. 25వేల మంది భక్తులు మొత్తం క్యూల్లో పట్టేలా ఏర్పాట్లు చేశారు. మంచినీరు, మజ్జిగ, ఇతర శీతలపానియాలు క్యూల్లో అందించే ఏర్పాటు చేశారు. 

రాత్రి 9 గంటల నుంచి సహస్రఘటాభిషేకం 
రాత్రి 9 గంటల నుంచి సహస్రఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం వెండి కలశాలను, మట్టి కలశలను సిద్ధం చేశారు. అలాగే ఆలయ దక్షిణ రాజగోపురం వద్ద బ్రిడ్జిపై నుంచి సహస్రఘటాభిషేకం నిర్వహణలో పాల్గొనే శ్రీవైష్ణవస్వాములు వెళ్లేలా, దుగువ నుంచి దర్శనం అనంతరం వెళ్లే భక్తులు వెళ్లేలా వంతెన ఏర్పాటు చేశారు. ఒక పక్క ఏడు గంటలలోపు క్యూలో ఉన్న భక్తులకు దర్శనాలు అందిస్తూనే, మరో వైపు సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వíస్తారు.

విధుల్లో పోలీసులు 
చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు సోమవారం ఉదయానికే చేరుకున్నారు. కొండదిగువ ట్రాఫిక్‌ పోలీసులకు, సింహగిరిపై లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసి పోలీస్‌ అధికారులు ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాలో డ్యూటీ చార్ట్‌లు వేశారు.

విద్యుత్‌ కాంతులతో సింహగిరి 
చందనోత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరి విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతోంది. అలాగే ఆలయాన్ని పెద్ద ఎత్తున పుష్పాలంకరణ చేశారు.  

మరిన్ని వార్తలు